ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో గుజరాత్ టైటాన్స్ ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా.. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది.మ్ లో ఉన్న సాయి సుదర్శన్ త్వరగానే ఔటైనప్పటకీ బట్లర్, కెప్టెన్ గిల్ మెరుపు ఇన్నింగ్స్ లు ఆడడంతో గుజరాత్ టైటాన్స్ స్కోరు వేగం టాప్ గేర్ లో సాగింది. ముఖ్యంగా బట్లర్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.కేవలం 27 బంతుల్లో 52 పరుగులు చేశాడు.
అటు గిల్ కూడా దూకుడుగా ఆడుతూ భారీ స్కోరే లక్ష్యంగా విధ్వంసం సృష్టించాడు. గిల్ 45 బంతుల్లో 70 పరుగులు చేశాడు. మరో ఎండ్ లో వాషింగ్టన్ సుందర్ కూడా చెలరేగిపోయాడు. గత రెండు మ్యాచ్ లలో విఫలమైన సుందర్ ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 32 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు ఢిల్లీ బౌలర్లలో ఎంగిడి తప్పిస్తే మిగిలిన వారంతా విఫలమయ్యారు.భారీ లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ కు మంచి ఆరంభమే దక్కింది. ఫామ్ లో ఉన్న నిస్సాంక దూకుడుగా ఆడి తొలి వికెట్ కు రాహుల్ తో కలిసి 76 పరుగులు జోడించాడు. నిస్సాంక ఔటైన తర్వాత ఒకే ఓవర్లో రషీద్ ఖాన్ తన స్పిన్ మాయాజాలాన్ని చూపించాడు.
10వ ఓవర్ చివరి రెండు బంతులకు వరుసగా నితీష్ రాణా రిజ్విలను ఔట్ చేశాడు. అయితే ఫామ్ అందుకున్న కేఎల్ రాహుల్ మాత్రం పోరాడాడు. 52 బంతుల్లో 92 పరుగులకు ఔటై సెంచరీ చేజార్చుకున్నాడు. రాహుల్ కీలక సమయంలో ఔటైనా డేవిడ్ మిల్లర్ మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 19వ ఓవర్లో సిరాజ్ కు చుక్కలు చూపించాడు. బౌండరీలు, ఫోర్లతో విరుచుకుపడి మ్యాచ్ ను రసవత్తరంగా మార్చేశాడు. సిరాజ్ ఓవర్లో ఏకంగా 23 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో సైతం ఢిల్లీ దాదాపుగా గెలిచినట్టే అనుకున్నారు. ఐదో బంతికి మిల్లర్ సింగిల్ తీయకపోగా.. చివరి బంతికి పరుగులేమీ రాకపోవడంతో గుజరాత్ 1 పరుగు తేడాతో గెలిచింది. ఈ సీజన్ లో ఢిల్లీకి ఇదే తొలి పరాజయం. అటు తాజా గెలుపుతో గుజరాత్ తన గెలుపు ఖాతాను ఓపెన్ చేసింది.