Top story:హార్ట్ బీట్ తో సిగ్నల్స్… అమెరికా ఆర్మీ టెక్నాలజీ అదుర్స్… ఇరాన్ లో అదే కాపాడిందా..?

యుద్ధ రంగంలో టెక్నాలజీ ఏ స్థాయికి చేరుకుందంటే.. శత్రువుల కళ్ళకు కనపడకుండా పాతాళంలో దాక్కున్నా, కొండల మధ్య నక్కినా సరే.. కేవలం మీ గుండె చప్పుడును బట్టి మిమ్మల్ని పట్టుకోగలరు.

Post Published By: dialnews
Updated : 9 April 2026, 1:03 PM IST

యుద్ధ రంగంలో టెక్నాలజీ ఏ స్థాయికి చేరుకుందంటే.. శత్రువుల కళ్ళకు కనపడకుండా పాతాళంలో దాక్కున్నా, కొండల మధ్య నక్కినా సరే.. కేవలం మీ గుండె చప్పుడును బట్టి మిమ్మల్ని పట్టుకోగలరు. వినడానికి ఇది అసాధ్యం అనిపిస్తోందా..? కానీ అమెరికా గూఢచారి సంస్థ సి.ఐ.ఎ ఇటీవలే ఇరాన్ గడ్డపై ఈ అద్భుతాన్ని చేసి చూపించింది. ఆ టెక్నాలజీ పేరే 'ఘోస్ట్ మర్మర్' అసలేమిటి ఈ టెక్నాలజీ..? ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల మధ్య ఇది ఎలా వెలుగులోకి వచ్చింది..? దీని వెనుక ఉన్న అసలు రహస్యాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.కథ గత కొద్ది వారాల క్రితం మొదలైంది. ఇరాన్ గగనతలంలో నిఘా పెడుతున్న అమెరికా యుద్ధ విమానం ఒకటి శత్రువుల దాడుల్లో కూలిపోయింది. పైలట్ పారాచూట్ సహాయంతో కిందకు దూకేసినా.. అతను ఎక్కడ ఉన్నాడో కనిపెట్టడం అమెరికాకు సవాలుగా మారింది. ఇరాన్ ఆర్మీ.. ఆ పైలట్ కోసం వేట మొదలుపెట్టింది. చుట్టూ కొండలు, శత్రువుల నిఘా.. ఇలాంటి సమయంలో సాంప్రదాయ శాటిలైట్ ఫోన్లు లేదా రేడియో సిగ్నల్స్ వాడితే పైలట్ ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. సరిగ్గా అప్పుడే సిఐఏ తన అత్యంత రహస్య అస్త్రం 'ఘోస్ట్ మర్మర్'ని రంగంలోకి దించింది.

వైద్య పరిభాషలో 'మర్మర్' అంటే గుండె లయలో వచ్చే చిన్న మార్పు. ఈ టెక్నాలజీ కూడా మనిషి గుండె చప్పుడు ఆధారంగానే పనిచేస్తుంది. 'ఘోస్ట్ మర్మర్' అనేది ఒక సెన్సింగ్ టెక్నాలజీ. ఇది కిలోమీటర్ల దూరం నుంచి, శత్రువుల కళ్ళు గప్పి, ఒక వ్యక్తి ఎక్కడ ఉన్నాడో పక్కాగా కనిపెడుతుంది. గుండె చప్పుడే.. మీ డిజిటల్ సిగ్నేచర్. ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన గుండె చప్పుడు ఉంటుంది. ఈ పరికరం ఆ ప్రత్యేక లయను దూరం నుంచే స్కాన్ చేస్తుంది. ఇది భూగర్భంలో దాక్కున్న వ్యక్తి నుంచి వచ్చే విద్యుదయస్కాంత సంకేతాలను పసిగడుతుంది.ఈ పరికరాన్ని అమెరికాకు చెందిన రక్షణ రంగ దిగ్గజం లాక్‌హీడ్ మార్టిన్‌కు చెందిన రహస్య విభాగం 'స్కంక్ వర్క్స్' అభివృద్ధి చేసింది. దీని పనితీరులో ప్రధానంగా రెండు అంశాలు ఉంటాయి. క్వాంటం మాగ్నెటోమెట్రీ అంటే.. మనిషి గుండె కొట్టుకున్నప్పుడు ఒక చిన్న అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఈ క్వాంటం సెన్సార్లు ఆ అత్యల్ప అయస్కాంత మార్పులను కూడా గుర్తించగలవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో దీన్ని వాడతారు. అంటే.. అడవిలో క్రూర మృగాల గుండె చప్పుడుకు, మనుషుల గుండె చప్పుడుకు మధ్య ఉన్న తేడాను ఏఐ సెకన్లలో విశ్లేషిస్తుంది. తద్వారా శత్రువుల మధ్య దాక్కున్న తమ సైనికుడిని అమెరికా ఖచ్చితంగా గుర్తించగలిగింది.

సాధారణంగా ఏ ఇన్ఫ్రారెడ్ కెమెరా అయినా శరీర వేడిని గుర్తిస్తుంది. కానీ 'ఘోస్ట్ మర్మర్' వేడిని కాదు, కేవలం గుండె చప్పుడును మాత్రమే వెతుకుతుంది. దీనివల్ల శత్రువుల రాడార్లు దీనిని గుర్తించడం అసాధ్యం. ఇరాన్ సరిహద్దుల్లోని దట్టమైన కొండల్లో నక్కిన పైలట్‌ను ఈ టెక్నాలజీ ద్వారా సిఐఏ టీమ్ గుర్తించి, అతనికి ఆహారం, నీరు అందజేయడమే కాకుండా.. సురక్షితంగా వెనక్కి తీసుకురాగలిగింది. 'ఘోస్ట్ మర్మర్' కేవలం రక్షణ కార్యకలాపాలకే పరిమితం కాదు. భవిష్యత్తులో దీనివల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి.భూకంపాలు వచ్చినప్పుడు శిథిలాల కింద చిక్కుకున్న వారిని వారి గుండె చప్పుడు ఆధారంగా రక్షించవచ్చు. ఉగ్ర పోరాటాల్లో దీన్ని వాడే అవకాశం ఉంది. బందీలను బంధించినప్పుడు, గోడల వెనుక లేదా నేలమాళిగల్లో ఎంతమంది ఉన్నారో ఈ పరికరంతో ముందే తెలుసుకోవచ్చు.

ఒక వైపు ఇది ప్రాణాలు కాపాడే టెక్నాలజీ అని చెబుతున్నా.. మరోవైపు దీనివల్ల ప్రైవసీకి భంగం కలుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. "నీ గుండె కొట్టుకుంటుంటే చాలు, నువ్వు ఎక్కడున్నా మేము కనిపెడతాం" అనే నినాదం వినడానికి బాగున్నా.. అది నిఘా వ్యవస్థ చేతుల్లోకి వెళ్తే భయంకరంగా మారుతుందనే ఆందోళనలు ఉన్నాయి.మొత్తానికి 'ఘోస్ట్ మర్మర్' ద్వారా అమెరికా తన సాంకేతిక శక్తిని మరోసారి నిరూపించుకుంది. ఇరాన్ లాంటి శత్రు దేశాల గడ్డపైకి వెళ్లి, ఒక సైనికుడిని రక్షించుకు రావడం వెనుక ఈ అదృశ్య కిరణాల కృషి ఎంతో ఉంది. రాబోయే రోజుల్లో యుద్ధం అంటే తుపాకులు, బాంబులు మాత్రమే కాదు.. ఇలాంటి 'అదృశ్య తరంగాల' మాయాజాలం అని ఈ ఘోస్ట్ మర్మర్ స్పష్టం చేస్తోంది. ఈ పరికరం సుమారు 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మనిషి గుండె చప్పుడును పసిగట్టగలదని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Published : 
  • 9 April 2026, 1:03 PM IST