Spl story:180 మందితో… వీడు మనిషేనా?

మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. ప్రేమ పేరుతో వల వేసి, మైనర్ బాలికలను ట్రాప్ చేసి, వారి జీవితాలను ఛిద్రం చేసిన ఒక కిరాతకుడి ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

Post Published By: dialnews
Updated : 17 April 2026, 12:33 PM IST

మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. ప్రేమ పేరుతో వల వేసి, మైనర్ బాలికలను ట్రాప్ చేసి, వారి జీవితాలను ఛిద్రం చేసిన ఒక కిరాతకుడి ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అమరావతి జిల్లాకు చెందిన 19 ఏళ్ల అయాన్ అహ్మద్ తన్వీర్ అనే యువకుడు దాదాపు 180 మంది మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అమరావతి జిల్లాకు చెందిన అయాన్ అహ్మద్ తన్వీర్ అనే యువకుడు సోషల్ మీడియా ద్వారా మైనర్ బాలికలను టార్గెట్ చేసేవాడు. తొలుత వారితో స్నేహం నటించి, ఆపై 'ప్రేమ' పేరుతో వారిని నమ్మించేవాడు. అమాయక బాలికలు అతని మాటలు నమ్మి దగ్గరయ్యాక, వారికి తెలియకుండానే వారి ఏకాంత క్షణాలను అసభ్యకరంగా వీడియోలు తీసేవాడు. ఇలా దాదాపు 350కి పైగా అసభ్య వీడియోలను చిత్రీకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

అంతటితో ఆగకుండా, ఆ వీడియోలను చూపిస్తూ బాధితులను బ్లాక్‌మెయిల్ చేసేవాడు. వారిని లొంగదీసుకుని పదే పదే లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. తీసిన వీడియోలను ఆన్‌లైన్‌లో షేర్ చేసినట్లు కూడా అభియోగాలు ఉన్నాయి. ఈ దారుణమైన వ్యవహారంలో అతనికి సహకరించిన ఉజర్ ఖాన్ అనే మరో యువకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఉజర్ ఖాన్ తన మొబైల్ ద్వారా ఈ వీడియోలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసినట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసులు అయాన్ అహ్మద్‌ను అరెస్ట్ చేసి పోక్సో చట్టంతో పాటు పలు కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోర్టు అతనికి ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. ప్రస్తుతం పోలీసులు కేవలం 8 మంది బాధితులను మాత్రమే గుర్తించినప్పటికీ, నిందితుడి ఫోన్ డేటా ఆధారంగా ఈ సంఖ్య 180 వరకు ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ఈ ఘటన ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో పెను మంటలు రేపుతోంది. నిందితుడు అయాన్ అహ్మద్‌కు అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో స్థానిక ఎన్నికల సమయంలో అతను పార్టీ సోషల్ మీడియా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నట్లు ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ నేత కిరీట్ సోమయ్య ముఖ్యమంత్రిని కోరారు. ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో అమరావతిలోని అచల్ పూర్ ప్రాంతంలో భారీ నిరసనలు వ్యక్తమయ్యాయి. హిందూ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి.

ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. నిందితుడి ఇంటితో పాటు అతనికి సంబంధించిన అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు. బీజేపీ ఎమ్మెల్యే ప్రవీణ్ తాయడే పర్యవేక్షణలో ఈ కూల్చివేతలు జరిగాయి. గతంలోనే నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఉదంతం చూస్తుంటే సోషల్ మీడియాలో యువత, ముఖ్యంగా మైనర్ బాలికలు ఎంతటి ప్రమాదంలో ఉన్నారో అర్థమవుతోంది. అపరిచితులతో స్నేహం, ప్రేమ పేరుతో వల వేసే సైకోల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో మన పిల్లలు ఏం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అనే విషయాలపై ప్రతి తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాల్సిన సమయం ఆసన్నమైంది అని సామాజిక విశ్లేషకులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

Published : 
  • 17 April 2026, 12:33 PM IST

Related News

No related posts found.