బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే పేరు మారుమోగిపోతోంది. యూపీలో నేరగాళ్ల గుండెల్లో నిద్రపోయే ఆ 'సింగం' ఇప్పుడు బెంగాల్ గడ్డపై అడుగుపెట్టింది. వందకు పైగా ఎన్కౌంటర్లు.. నేరస్తుల పాలిట యముడు.. ఆయనే ఐపీఎస్ అజయ్ పాల్ శర్మ. అసలు ఈయన్ని బెంగాల్‌కి ఎందుకు పంపించారు..? అక్కడ ఆయన చేసిన హెచ్చరికలకు టీఎంసీ నేతలు ఎందుకు వణికిపోతున్నారు..? ఇది 5 ఏళ్ల బదిలీనా లేక కేవలం ఎన్నికల డ్యూటీనా..? అజయ్ పాల్ శర్మ.. 2011 బ్యాచ్ యూపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి. వృత్తిరీత్యా ఆయన ఒకప్పుడు డెంటిస్ట్. కానీ ఖాకీ యూనిఫాం వేసుకున్నాక ఆయన శైలే మారిపోయింది. నోయిడా, రాంపూర్, షామ్లీ వంటి ప్రాంతాల్లో పనిచేస్తున్నప్పుడు వందలాది ఎన్కౌంటర్లకు నాయకత్వం వహించారు. అందుకే ఈయన్ని మీడియా 'యూపీ సింగం' అని పిలుస్తుంది. యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌లో నేర రహిత రాష్ట్రం కోసం ఆయన చేసిన ఆపరేషన్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆయన్ని 'పోలీస్ అబ్జర్వర్'గా నియమించింది. బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాలు, ముఖ్యంగా అభిషేక్ బెనర్జీకి పట్టున్న ప్రాంతాల్లో శాంతిభద్రతలను పర్యవేక్షించే బాధ్యత ఆయనకు అప్పగించారు. ఈయన నియామకాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిల్ కూడా దాఖలైంది. ఒక ఐపీఎస్ అధికారి రాక రాజకీయ పార్టీలను ఏ స్థాయిలో భయపెట్టిందో చెప్పడానికి ఇదే పెద్ద నిదర్శనం. ఎన్నికలు ముగిసిన వెంటనే, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక కీలక ఉత్తర్వు జారీ చేసింది.ఎన్నికల సమయంలో కేవలం 'అబ్జర్వర్'గా వెళ్లిన అజయ్ పాల్ శర్మను, ఇప్పుడు ఏకంగా 5 ఏళ్ల పాటు డెప్యూటేషన్‌పై బెంగాల్లోనే కొనసాగించాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. యూపీలో 100కు పైగా ఎన్కౌంటర్లు చేసిన ట్రాక్ రికార్డ్ ఉన్న ఈయన, ఇప్పుడు బెంగాల్‌లోని 'పొలిటికల్ క్రైమ్' మరియు 'సిండికేట్ రాజ్'ను ఎలా అణిచివేస్తారో చూడాలన్నది ప్రజల్లో ఉన్న ఆసక్తి. ఎన్నికల టైంలో అక్కడికి వెళ్ళిన ఆయన.. అక్కడకు వెళ్లిన వెంటనే ఆయన తన మార్క్ చూపించారు.
ఒక టీఎంసీ నేత ఇంటి వద్దకు వెళ్లి, 'వారితో జాగ్రత్తగా ఉండమని, తోక జాడిస్తే కాళ్లు విరగ్గొడతామని' చేసిన హెచ్చరికలు ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేసింది. అజయ్ పాల్ శర్మను ఐదేళ్ల పాటు బెంగాల్‌కు డిప్యుటేషన్‌పై పంపించారని చాలామంది పోస్టులు పెట్టడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే, దీనిపై కొన్ని ఫ్యాక్ట్ చెక్ సంస్థలు భిన్నంగా స్పందిస్తున్నాయి. ఇది నిజం కాదని కొందరు అంటుంటే.. నిజమే అని మరికొందరు అంటున్నారు.ఆయనను కేవలం ఎన్నికల పరిశీలకుడిగా మాత్రమే పంపించారని, ఐదేళ్ల బదిలీ అనేది కేవలం ప్రచారమే అని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. కానీ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి ఐదేళ్ల డిప్యుటేషన్ ఉత్తర్వులు వచ్చాయంటూ మరికొన్ని వర్గాలు గట్టిగా వాదిస్తున్నాయి. ఈయన నియామకంపై బెంగాల్లో రాజకీయం ముదిరింది.
మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్.. అజయ్ పాల్ శర్మ నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీ ఏజెంట్లను అబ్జర్వర్లుగా పంపి ఓటర్లను భయపెడుతున్నారని ఆరోపించారు.ఎన్నికల ప్రచారంలో అభిషేక్ బెనర్జీ వంటి నేతలు "ఎన్నికలు అయిపోయాక ఈ అధికారులు ఉండరు, ఆ తర్వాత మా ప్రతాపం చూపిస్తాం" అని హెచ్చరించారు. కానీ కేంద్రం మాత్రం ఆయన్ని అక్కడే పాగా వేయించడం ద్వారా "సింగం" ఇంకా అక్కడే ఉన్నాడని బలమైన సందేశం పంపింది. ఎన్నికల సమయంలో సౌత్ 24 పరగణాల జిల్లాలో టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ ఇంటి వద్ద అజయ్ పాల్ శర్మ చేసిన హడావిడి మామూలుది కాదు. పది మంది పోలీసులకు బదులు 14 మంది ఉండటాన్ని గుర్తించి అధికారులకు నోటీసులు ఇవ్వడం ద్వారా వ్యవస్థలోని లోపాలను ఎండగట్టారు.