Top story: అమెరికా సైనికుడ్ని లేపేస్తే 50 లక్షలు ఇరాన్ ప్రజలకు ఆర్మీ క్రేజీ ఆఫర్.. ట్రంప్‌కు ఇరాన్ ఆర్మీ చీఫ్ మైండ్ బ్లాకింగ్ షాక్..!

అంతర్జాతీయ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఒక సంచలన ప్రకటన ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ కోలుకోలేని మైండ్ బ్లాకింగ్ షాక్ ఇచ్చింది. అమెరికా సైనికులను టార్గెట్ చేస్తూ ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామి

Post Published By: dialnews
Updated : 18 August 2026, 4:28 PM IST

అంతర్జాతీయ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఒక సంచలన ప్రకటన ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ కోలుకోలేని మైండ్ బ్లాకింగ్ షాక్ ఇచ్చింది. అమెరికా సైనికులను టార్గెట్ చేస్తూ ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామి నేరుగా తలవెల ప్రకటించారు. ఒక్క అమెరికా సైనికుడిని చంపినా లేదా సజీవంగా బంధించినా ఏకంగా 30 వేల డాలర్లు.. అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 25 లక్షల రూపాయలకు పైగా రివార్డు ఇస్తామని ఓపెన్‌గా ప్రకటించారు. ఇందులో అసలైన ట్విస్ట్ ఏంటంటే, ఒకవేళ ఈ పని మహిళలు చేస్తే ఆ బహుమతి రెట్టింపు, అంటే 50 లక్షల రూపాయలు ఇస్తారట. అసలు ఇరాన్ ఎందుకు ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకుంది? 'ఫైనాన్షియల్ జిహాద్' అంటే ఏంటి? ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ ఏంటి?

అసలు ఏం జరిగిందంటే.. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ఇరాన్ ఆర్మీ కమాండర్-ఇన్-చీఫ్ అమీర్ హతామి అధికారికంగా ఈ రివార్డును ప్రకటించారు. దేశం కోసం యుద్ధంలో పాల్గొనాలని, తమ వంతు ఆర్థిక సాయం అందించాలని ఇరాన్ ప్రజల నుండి భారీగా అభ్యర్థనలు వస్తున్నాయట. అందుకే దీనికి 'ఫైనాన్షియల్ జిహాద్' అని పేరు పెట్టి ఈ ప్లాన్ రూపొందించారు. ఎవరైనా సరే అమెరికా సైనికుడిని హతం చేసి లేదా బంధించి ఇరాన్ సైన్యానికి అప్పగిస్తే.. ఇరాన్ కరెన్సీ ప్రకారం 5 బిలియన్ తోమన్స్ అంటే 500 కోట్ల తోమన్స్.. లేదా 30 వేల అమెరికన్ డాలర్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ ఇరాన్‌కు చెందిన ధైర్యవంతులైన మహిళలు ఈ పని పూర్తి చేస్తే వారికి డబుల్ అమౌంట్ చెల్లిస్తామని అనడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ ప్రకటనలో ఇరాన్ ఆర్మీ చీఫ్ మరో వింతైన ఆఫర్ కూడా ఇచ్చారు. అమెరికా సైనికుడిని హతం చేయడానికి ఏ ఆయుధాన్ని అయితే ఉపయోగిస్తారో.. ఆ తుపాకీ లేదా ఆయుధాన్ని ఇరాన్ ప్రభుత్వం దాని అసలు విలువ కంటే రెట్టింపు ధర ఇచ్చి సొంతంగా కొనుగోలు చేస్తుంది. అంతేకాదు, ఆ పాత ఆయుధానికి బదులుగా సదరు వ్యక్తికి సరికొత్త గన్‌ను కూడా బహుమతిగా ఇస్తారు. మరి కొనుగోలు చేసిన ఆ పాత ఆయుధాన్ని ఏం చేస్తారో తెలుసా? భవిష్యత్తులో ఇరాన్ ఏర్పాటు చేయబోయే ఒక ప్రత్యేక సైనిక మ్యూజియంలో ఆ ఆయుధాన్ని ప్రదర్శనకు ఉంచుతారట. అయితే, ప్రస్తుతం ఇరాన్ భూభాగంలో అమెరికా పదాతి దళాలు ఎక్కడా లేవు. కేవలం గత ఏప్రిల్‌లో కూలిపోయిన ఒక అమెరికా పైలట్‌ను రక్షించే మిషన్ కోసం మాత్రమే అమెరికా దళాలు వచ్చాయి. మరి ఇరాన్ దళాలు అమెరికా సైనికులను ఎక్కడ ఎదుర్కొంటాయనే దానిపై హతామి క్లారిటీ ఇవ్వలేదు.

ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఆర్మీ చీఫ్ తీవ్రంగా మండిపడ్డారు. ఒకవేళ ఇరాన్ ఓడిపోతే.. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన 'స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్' జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తామంటూ గతంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనిపై అమీర్ హతామి స్పందిస్తూ.. ట్రంప్ కేవలం ప్రపంచం ముందు గెలిచినట్లు నటిస్తున్నారని, కానీ అంతర్జాతీయంగా అమెరికా తన మిలిటరీ ఆధిపత్యాన్ని కోల్పోయిందని ఎద్దేవా చేశారు. అమెరికాకు పూర్వపు పట్టు లేదని, వాషింగ్టన్ సైనిక బలహీనతను చూసిన ప్రపంచ దేశాలు ఇప్పుడు తమ రక్షణ కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నాయని హతామి వ్యాఖ్యానించారు.

ఇరాన్ ఆర్మీ చీఫ్ పశ్చిమ ఆసియా లోని అమెరికా సైనిక స్థావరాలకు కూడా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తమ పొరుగు దేశాలలో ఉంటూ ఇరాన్ భద్రతకు ముప్పు కలిగించే ఏ ఒక్క అమెరికా మిలిటరీ బేస్‌ను కూడా ప్రశాంతంగా పనిచేయనివ్వబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికా దళాలను పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రం మరియు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ప్రాంతాల్లోకి రాకుండా పూర్తిగా అడ్డుకున్నామని ఆయన క్లెయిమ్ చేశారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ గుండా వెళ్లే అంతర్జాతీయ చమురు ట్యాంకర్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ప్రారంభించిన ఈ యుద్ధం అంత సులువుగా ముగిసేలా కనిపించడం లేదు. అమెరికా సైనికులపై ఇరాన్ ఏకంగా తలవెల ప్రకటించడంతో మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకున్నాయి.

Published : 
  • 18 August 2026, 4:28 PM IST