ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. సాకర్ సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఫిఫా వరల్డ్ కప్ - 2026 కు సంబంధించిన కీలక అప్డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈసారి ఈ మెగా టోర్నీ కేవలం ఆటకే పరిమితం కాకుండా, గ్లామర్ మరియు ఎంటర్టైన్మెంట్ కలబోతగా సాగనుంది. ముఖ్యంగా బాలీవుడ్ డ్యాన్సింగ్ సెన్సేషన్ నోరా ఫతేహి మరోసారి అంతర్జాతీయ వేదికపై తన స్టెప్పులతో రచ్చ చేసేందుకు సిద్ధమైంది. గతంలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ముగింపు వేడుకల్లో తన అద్భుతమైన డాన్స్‌తో ప్రపంచాన్ని ఊర్రూతలూగించిన నోరా ఫతేహి, ఈసారి సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. 2026 ప్రపంచకప్ ప్రారంభ వేడుకల్లో ఆమె ప్రదర్శన ఇవ్వనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
కెనడాలోని టొరంటో వేదికగా ఈ ప్రారంభ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకల్లో ప్రదర్శన ఇచ్చే స్టార్ల జాబితాలో నోరా పేరు కూడా ఉండటంతో ఆమె అభిమానులు, ముఖ్యంగా భారతీయ ఫుట్‌బాల్ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన పాటలు, గ్రేస్‌ఫుల్ మూవ్స్‌తో క్రీడాభిమానుల్లో కొత్త జోష్ నింపేందుకు ఆమె సర్వం సిద్ధం చేసుకుంది. ఫిఫా 2026 టోర్నీ పలు ప్రత్యేకతలకు వేదిక కానుంది. సాధారణంగా 32 దేశాలు పాల్గొనే ఈ మెగా టోర్నీలో, ఈసారి ఏకంగా 48 దేశాలు పోటీ పడబోతున్నాయి. దీంతో ఈసారి పోటీ మరింత రసవత్తరంగా మారనుంది. కెనడా, మెక్సికో మరియు యూఎస్ఏ దేశాలు సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహించబోతున్నాయి. మొత్తం 16 నగరాల్లోని స్టేడియాల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. గతంలో కంటే ఎక్కువగా ఈసారి మొత్తం 104 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
ఈ భారీ మార్పుల వల్ల టోర్నీ కాలపరిమితి కూడా పెరిగింది. సుమారు 39 రోజుల పాటు ఫుట్‌బాల్ ఫీవర్ ప్రపంచాన్ని వణికించనుంది. జూన్ 11న మెగా టోర్నీ అట్టహాసంగా మొదలయ్యే ఈ హోరాహోరీ పోటీలు జూలై 19న ముగుస్తాయి. టోర్నీ విజేతను నిర్ణయించే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ జూలై 19న అమెరికాలోని న్యూజెర్సీలో జరగనుంది.అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లోని విభిన్న వాతావరణ పరిస్థితుల్లో, అత్యాధునిక సౌకర్యాలున్న స్టేడియాల్లో ఈ మ్యాచ్‌లు జరగడం ఆటగాళ్లకు ఒక సవాల్‌గా మారనుంది. ఫుట్‌బాల్ అంటే కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. 48 దేశాల జట్లు, 104 మ్యాచ్‌లు, 16 వేదికలు.. ఇవన్నీ చూస్తుంటే ఈసారి ఫిఫా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. కెనడాలో నోరా ఫతేహి డాన్స్‌తో మొదలై, న్యూజెర్సీలో ఫైనల్ విజేత ఎవరో తేలే వరకు ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా సాగనుంది.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కళ్లు ఇప్పుడు జూన్ 11 వైపు ఉన్నాయి. సాకర్ దిగ్గజాలు మైదానంలో చేసే మ్యాజిక్ చూడాలని, తమ అభిమాన జట్లు గెలవాలని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.