పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఎలా ఆశ్రయం ఇస్తుందో, వారిని ఎలా స్వేచ్ఛగా తిరగనిస్తుందో చాటిచెప్పే ఒక షాకింగ్ వీడియో ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. పాక్ మాజీ క్రికెట్ దిగ్గజం షోయబ్ అక్తర్ అన్న అంత్యక్రియలు ఇస్లామాబాద్‌లో జరిగాయి. అయితే, ఈ అంత్యక్రియల వేడుకకు భారత్‌పై దాడులు చేసిన లష్కరే తోయిబా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు బహిరంగంగా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో పాకిస్థాన్ ఉగ్రవాద బుద్ధి మరోసారి ప్రపంచం ముందు నగ్నంగా బయటపడింది. అసలు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్న ఆ భయంకరమైన టెర్రరిస్ట్ ఎవరు? భారత్‌కు అతడు చేసిన ద్రోహం ఏంటి? ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పెద్దన్నయ్య షాహిద్ అక్తర్ జూన్ 24న మరణించారు. ఇస్లామాబాద్‌లోని హెచ్-8 స్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, ఈ అంత్యక్రియల తాలూకు వైరల్ వీడియోను గమనించిన ఇంటెలిజెన్స్ వర్గాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి. ఎందుకంటే, ఆ గుంపులో లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి స్పష్టంగా కనిపించాడు. ఇతడే 2025లో జరిగిన భయంకరమైన పహల్గామ్ పర్యాటకుల దాడికి సూత్రధారి. అతనితో పాటు లష్కరే రాజకీయ విభాగమైన 'పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్' అధ్యక్షుడు ఇనామ్ ఉర్ రెహమాన్ కూడా ఈ అంత్యక్రియల్లో పాల్గొనడం తీవ్ర కలకలం రేపుతోంది.
అసలు ఎవరీ సైఫుల్లా కసూరి? భారత్‌కు ఇతడు ఎందుకు మోస్ట్ వాంటెడ్? 2025 ఏప్రిల్ 22న కాశ్మీర్‌లోని పహల్గామ్లో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్రదాడిలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘోరారణ్యకాండ వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ ఈ సైఫుల్లా కసూరియే. నాటి దాడికి ప్రతీకారంగా భారత్ తక్షణమే 'సింధు జలాల ఒప్పందాన్ని' రద్దు చేయడమే కాకుండా, 'ఆపరేషన్ సింధూర్' ద్వారా పాకిస్థాన్‌లోని మురిద్కేలో ఉన్న లష్కరే ప్రధాన కార్యాలయాన్ని నామరూపాలు లేకుండా ధ్వంసం చేసింది. ఆ దెబ్బకు భయపడిపోయిన కసూరి, అప్పటి నుండి సముద్ర మార్గంలో భారత్‌పై మరో 26/11 తరహా దాడి చేస్తామంటూ నిరంతరం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు.
ఈ వీడియోతో ప్రపంచ దేశాల ముందు పాకిస్థాన్ బండారం మరోసారి నగ్నంగా బయటపడింది. అంతర్జాతీయ సమాజం నిషేధించిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు పాకిస్థాన్ రాజధాని నగరంలోనే ఇంత బహిరంగంగా తిరుగుతున్నారంటే, అక్కడ ఉగ్రవాదులకు ప్రభుత్వ రక్షణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక వీడియోలో సైఫుల్లా కసూరి స్వయంగా మాట్లాడుతూ.. "పాక్ ఆర్మీనే నన్ను సైనికుల అంత్యక్రియల ప్రార్థనలకు పిలుస్తుంది, ఇండియా నన్ను చూసి భయపడుతుంది" అంటూ పాక్ సైన్యం తమకు ఇస్తున్న మద్దతును బహిరంగంగానే ఒప్పేసుకున్నాడు. క్రికెట్ ప్రపంచంలో ఎంతో పేరు తెచ్చుకున్న షోయబ్ అక్తర్ కుటుంబ సభ్యుల అంత్యక్రియల్లో ఇలాంటి ప్రమాదకరమైన ఉగ్రవాదులు ప్రత్యక్షమవడం ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.