అయోధ్య రాముడికే శఠగోపం పెట్టారు. దేవుడి పేరుతో కోట్లు కాజేశారు. భక్తులు సమర్పించిన కానుకలను గుట్టుచప్పుడు కాకుండా నొక్కేశారు. దేవుడి సొమ్ముతో ఆస్తులు కొనుగోలు చేశారు. మాజీ ఉద్యోగి ఇచ్చిన పిర్యాదుతో బాగోతం వెలుగులోకి వచ్చింది. విరాళాల నొక్కేసిన కేసులో సంచలన విషయాలు బయట పడుతున్నాయి. ఇంటి దొంగలను గుర్తించిన సిట్ 8 మందిని అరెస్ట్ చేసింది.అయోధ్య రాముడి హుండీకే ఇంటి దొంగలు కన్నం వేశారు. అయోధ్య రామాలయానికి భక్తులు ఇచ్చిన నగలు, వెండి భూరి విరాళాలను దారి మళ్లించారు..ఆలయంలోనే జరిగిన హుండీ, విరాళాల సొమ్ము స్వాహా సంగతులను ప్రత్యేక దర్యాప్తు బృందం బయటపెట్టింది. శ్రీరామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కు అత్యంత సన్నిహితుడైన టిన్నూ యాదవ్ ఇందులో కీలక సూత్రధారి అని తేల్చింది. అతడితో పాటు 8 మందిని అరెస్టుచేసి.. శుక్రవారం కోర్టు ముందు హాజరుపరచింది. రామాలయంలో విరాళాల లెక్కింపు గదిలోనే సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు.
ఎవరూ గమనించకుండా హుండీల నుంచి నగదు మాయం చేశారు. అలా దోచుకున్న డబ్బును టాయ్‌లెట్లలో దాచిపెట్టి, ఆ తర్వాత వీలు చూసుకుని తమతోపాటు తీసుకెళ్లి పంచుకున్నారు. విరాళాల సొమ్ము వంద నోట్ల చొప్పున కట్టలుగా కట్టిన తర్వాత... ప్రతి కట్టలో అదనంగా మరిన్ని నోట్లు కుక్కేవారు. బ్యాంకుకు తీసుకెళ్లేటప్పుడు ఆ కట్టల నుంచి అదనపు నోట్లు తీసేసుకున్నట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. రామాలయంలో సీసీ కెమెరాలకు ఒక ఉద్యోగి అడ్డంగా నిలబడితే... అదే సమయంలో మరో ఉద్యోగి నోట్ల కట్టల నుంచి డబ్బు మాయం చేసేవాడు. వాస్తవానికి బ్యాంకుల్లో జమచేసిన నిధుల వివరాలపై ఆరా తీస్తుండగా.. డబ్బు దొంగతనంపైనా ఆలయ ట్రస్టు అధికారులకు అనుమానం వచ్చింది. విరాళాల పెట్టెల్లో డబ్బు తగ్గడం వీరు గుర్తించారు. 500 నోట్ల పెట్టెల్లో 6-7 లక్షలు తగ్గడం గమనించారు. కొన్ని వారాల పాటు ఇలా జరిగినట్లు తేలింది. అనుమానం పెరగడంతో విరాళాలు లెక్కించే గదిలో రహస్య కెమెరాలు అమర్చారు. వాటిలో రికార్డయిన దృశ్యాలను పరిశీలించినప్పుడు ఈ వివరాలు తెలిశాయి.
అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగంపై ఏర్పాటైన సిట్ రెండు రోజుల క్రితం తమ ప్రాథమిక నివేదికను ఉత్తర్‌ప్రదేశ్ సర్కారుకు సమర్పించింది. నిందితులపై కఠినమైన చర్యలకు సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ఎనిమిది మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, వారిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్టైన వ్యక్తుల్లో శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్‌రాయ్ డ్రైవర్ కూడా ఉన్నాడు. అతడితో పాటు అవినాశ్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్‌కుశ్ మిశ్రా, మనీశ్ కుమార్ యాదవ్, కరుణేశ్ పాండే, రామశంకర్ మిశ్రా, సుభాశ్ శ్రీవాస్తవ, రామశంకర్ యాదవ్‌లపై ఎఫ్‌ఐఆర్‌లో నమోదైంది. వీరంతా ఆలయానికి వచ్చిన విరాళాలు, విలువైన వస్తువులను లెక్కించే ప్రక్రియలో పాలుపంచుకున్నారు. పోలీసులు ఆ ఉద్యోగి ఇంటి నుంచి రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అందులో కొంత నగదు బీరువాలో లభించగా, మిగిలినది ఆవు పేడ కుప్పలో దొరికింది. సదరు ఉద్యోగి ఇటీవల లక్షల రూపాయల విలువైన భూమిని కొనుగోలు చేసిన విషయం కూడా పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఆలయానికి వచ్చే విరాళాలను నిర్వహించే బాధ్యత కలిగిన ఈ ఉద్యోగి ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. అతడి నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రామమందిర విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన వివాదం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఆలయ మాజీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ మహిపాల్ సింగ్ సుమారు రూ.7 కోట్ల విరాళాలు అపహరణకు గురయ్యాయని ఆరోపించారు. ఆలయ కానుకల లెక్కింపు సమయంలో భారీ స్థాయిలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని అన్నారు. తాను స్వయంగా అప్రమత్తంగా ఉండి, సుమారు రూ.5 లక్షల నగదు దొంగతనాన్ని ఒకసారి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నానని చెప్పారు. రామ్ లల్లా 'ప్రాణ ప్రతిష్ఠ' జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 15 కోట్లకు పైగా ప్రజలు దర్శించుకున్నారు. ట్రస్ట్‌కు మొత్తం రూ. 500 కోట్లకు పైగా విరాళాలు అందాయి. ఇందులో సుమారు రూ. 150 కోట్లు విరాళాల హుండీల ద్వారా రాగా మిగిలిన రూ. 350 కోట్లు ఆన్‌లైన్ మాధ్యమాలు, కౌంటర్ల ద్వారా సమకూరాయి.