Top Story: బెజవాడ కేంద్రంగా బయటపడిన భారీ కుట్ర, తెలుగు రాష్ట్రాల్లో భయపెడుతున్న ఉగ్ర కదలికలు..!

ప్రశాంతంగా ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉగ్ర కలకలం రేగింది. తెల్లవారుజామున 5 గంటలకే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు విజయవాడ నడిబొడ్డున ఉన్న వించిపేట లో మెరుపు దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది.

Post Published By: dialnews
Updated : 9 July 2026, 12:29 PM IST

ప్రశాంతంగా ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉగ్ర కలకలం రేగింది. తెల్లవారుజామున 5 గంటలకే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు విజయవాడ నడిబొడ్డున ఉన్న వించిపేట లో మెరుపు దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. టెర్రర్ లింక్స్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అసలు విజయవాడ కేంద్రంగా ఏం జరుగుతోంది? ఒక సాధారణ నిందితుడి అరెస్ట్‌తో మొదలైన ఈ కేసు వెనుక.. దేశంలోని 6 రాష్ట్రాలకు విస్తరించిన ఒక భారీ డిజిటల్ టెర్రర్ నెట్‌వర్క్ ఉందనే పక్కా ఆధారాలు ఎన్‌ఐఏకు ఎలా దొరికాయి? తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాదం చాపకింద నీరులా విస్తరిస్తోందా?

విజయవాడ వించిపేటలో ఈరోజు ఉదయం 5 గంటల నుంచే ఎన్‌ఐఏ బృందాలు రంగంలోకి దిగాయి. పక్కా సమాచారంతో అనుమానితుల ఇళ్లపై దాడులు చేసిన అధికారులు.. గంటల తరబడి సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ తనిఖీల్లో కొన్ని కీలకమైన పత్రాలు, డైరీలు మరియు ప్రధానంగా మొబైల్స్, హార్డ్ డిస్క్‌లు వంటి 'డిజిటల్ ఆధారాలను' అధికారులు స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లతో ఈ ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు రహస్యంగా కమ్యూనికేట్ అవుతున్నారనే బలమైన ఆధారాలతోనే ఈ రైడ్స్ జరుగుతున్నట్లు సమాచారం.

అసలు ఈ కేసు మూలాలు ఎక్కడున్నాయో తెలుసా? గత మార్చి నెలలో విజయవాడ టూటౌన్ పోలీసులు వించిపేటకు చెందిన మహ్మద్ రహ్మతుల్లా షరీఫ్ అనే 23 ఏళ్ల డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ఇతగాడు సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా నిషేధిత ఉగ్రవాద సంస్థలైన ఐసిస్, అల్ ఖైదాల వైపు ఆకర్షితుడై, ఆన్‌లైన్‌లో జిహాదీ కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. అతనితో పాటు భవానిపురానికి చెందిన డానిష్, మహంతిపురానికి చెందిన సోహైల్ బేగ్ అనే యువకులు కూడా ఈ ఆన్‌లైన్ రాడికలైజేషన్ నెట్‌వర్క్‌లో యాక్టివ్‌గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఈ కేసు తీవ్రత దృష్ట్యా కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు మే నెలలో ఈ కేసును ఎన్‌ఐఏ తన చేతుల్లోకి తీసుకుంది.

ఎన్‌ఐఏ అధికారులు నిందితులను కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఈ రహస్య ఆన్‌లైన్ టెర్రర్ నెట్‌వర్క్ కేవలం ఏపీ, తెలంగాణలకే పరిమితం కాలేదు. ఏకంగా దేశంలోని 6 రాష్ట్రాలకు విస్తరించింది. ముంబై, పూణే, హైదరాబాద్, ఢిల్లీ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, బీహార్ మరియు రాజస్థాన్‌లలో ఈ ముఠాకు చెందిన 13 మంది కీలక సభ్యులు సోషల్ మీడియా, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా రహస్య ఆపరేషన్లు నడుపుతున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ఇప్పటికే ఈ కేసులో 12 మంది నిందితులను అరెస్ట్ చేయగా, మిగిలిన వారి కోసం వేట కొనసాగుతోంది.

ఈ ఇన్వెస్టిగేషన్ లో తేలిన మరో షాకింగ్ అంశం ఏంటంటే.. ఈ ముఠా యువతను టార్గెట్ చేస్తూ తీవ్రవాదం వైపు బ్రెయిన్ వాష్ చేయడమే కాకుండా, మహిళలను కూడా చేర్చుకునేందుకు ప్రత్యేకంగా 'ఖవాతీన్' అనే వింగ్‌ను ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. విదేశాల్లో ఉండే కొందరు హ్యాండ్లర్లతో ఈ ముఠా టచ్‌లో ఉంటూ.. దేశంలో ఎక్కడైనా విధ్వంసాలకు లేదా దాడులకు ఏమైనా కుట్ర పన్నారా అనే కోణంలో ఎన్‌ఐఏ ప్రత్యేక ప్రశ్నావళితో నిందితులను విచారిస్తోంది. ప్రశాంతంగా ఉండే విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాలను ఈ ముఠాలు తమ రహస్య సేఫ్ జోన్లుగా వాడుకుంటున్నాయా అనే కోణంలో ఇంటెలిజెన్స్ బృందాలు అలర్ట్ అయ్యాయి. సోషల్ మీడియాలో వచ్చే తెలియని లింకులు, గ్రూపుల పట్ల యువత ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ కేసు నిరూపిస్తోంది. ఏది ఏమైనా ఎన్‌ఐఏ అధికారులు సకాలంలో స్పందించి ఈ నెట్‌వర్క్‌ను ఛేదించడం దేశ భద్రతకు ఎంతో కీలకంగా మారింది.

Published : 
  • 9 July 2026, 12:29 PM IST