Top Story: అమ్మను చంపడానికి ₹7 లక్షల సుపారీ.. గవర్నమెంట్ జాబ్ కోసం తల్లినే లేపేసింది.. మైండ్ బ్లోయింగ్ మర్డర్ స్కెచ్..!

సమాజం ఎటు పోతోంది..? ఆస్తి కోసం, ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం ఒక కూతురు ఇంతటి ఘాతుకానికి ఒడిగడుతుందా..? జైపూర్‌లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం.. సాధారణ యాక్సిడెంట్ కాదు, అదొక పక్కా స్కెచ్ అని తేలడంతో పోలీసులు సైతం నోరెళ్లబెట్టారు.

Post Published By: dialnews
Updated : 10 July 2026, 1:11 PM IST

సమాజం ఎటు పోతోంది..? ఆస్తి కోసం, ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం ఒక కూతురు ఇంతటి ఘాతుకానికి ఒడిగడుతుందా..? జైపూర్‌లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం.. సాధారణ యాక్సిడెంట్ కాదు, అదొక పక్కా స్కెచ్ అని తేలడంతో పోలీసులు సైతం నోరెళ్లబెట్టారు. 45 ఏళ్ల కన్నతల్లిని స్కోర్పియో కార్‌తో 130 కిలోమీటర్ల వేగంతో గుద్దింది ఎవరో కాదు.. ఆమె కడుపున పుట్టిన 24 ఏళ్ల లా స్టూడెంట్ కూతురే. కేవలం ఒకే ఒక్క గవర్నమెంట్ జాబ్ కోసం, కోట్లాది రూపాయల ఆస్తి కోసం సొంత తల్లిని అంతమొందించడానికి ఏకంగా ₹7 లక్షల సుపారీ ఇచ్చింది. అసలు ఈ జైపూర్ మర్డర్ మిస్టరీ ఏంటి..?

వివరాల్లోకి వెళ్తే.. జైపూర్‌ కోర్టులో క్లర్క్‌గా పనిచేస్తున్న నీరజ్ శర్మ అనే మహిళ జూలై 3వ తేదీన ప్రతాప్ నగర్ ఏరియాలో దారుణంగా హత్యకు గురయ్యారు. నిజానికి, ఏడాది క్రితం నీరజ్ శర్మ భర్త చనిపోవడంతో.. కారుణ్య నియామకం కింద ఆమెకు ఆ కోర్టు ఉద్యోగం వచ్చింది. అయితే, ఆ ఉద్యోగం చదువుకుంటున్న తనకే రావాలని ఆమె 24 ఏళ్ల కూతురు ఆయుషి శర్మ గొడవ పడింది. కానీ, ఇంట్లో మానసిక వికలాంగుడైన తమ్ముడు ఉన్నాడని, కుటుంబ పోషణకు తల్లికే ఉద్యోగం అవసరమని బంధువులు నచ్చజెప్పారు.

దీంతో తల్లిపై తీవ్ర కక్ష పెంచుకుంది ఆయుషి. దీనికి తోడు దాదాపు 10 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను దక్కించుకోవాలనే దురాశ కూడా తోడైంది. దాంతో తన మేనమామ కొడుకు బాలరామ్‌తో కలిసి తల్లిని నడిరోడ్డుపైనే యాక్సిడెంట్ రూపంలో చంపేయాలని మాస్టర్ ప్లాన్ వేసింది. ఈ దారుణానికి ఆయుషి ఏకంగా ₹7 లక్షల కాంట్రాక్ట్ మనీ మాట్లాడింది. నెల రోజుల క్రితమే హేమంత్ శర్మ అనే కిల్లర్.. 'థార్' కార్‌తో నీరజ్ శర్మను గుద్దాలని చూశాడు. కానీ ఆ ప్రమాదం నుంచి ఆమె తృటిలో తప్పించుకున్నారు.

ఈ ఘటనతో అనుమానం వచ్చిన నీరజ్ శర్మ.. ఇంటి చుట్టూ ఇనుప మెష్ వేయించుకుని, నాలుగు సిసిటివి కెమెరాలు కూడా పెట్టించుకున్నారు. ఆమె భయపడి ఇల్లు వదిలి వెళ్లాలనే ఉద్దేశంతో.. నిందితులు ఇంటి ముందు నిమ్మకాయలు, మిరపకాయలు, ఎర్రటి రంగులు చల్లి క్షుద్రపూజలు జరిగినట్లు భయపెట్టే ప్రయత్నం కూడా చేశారు. కానీ, తల్లి ఎంతకీ బయటకు రాకపోవడంతో.. మరో భయంకరమైన ప్లాన్ రెడీ చేశారు. జూలై 3వ తేదీన పక్కా సమాచారంతో కిల్లర్స్ మాటు వేశారు. నీరజ్ శర్మ తన కొడుకుతో కలిసి బయటకు వెళ్లినట్లు తెలుసుకున్న కూతురు ఆయుషి.. ఏదో అర్జెంట్ పని ఉందంటూ తల్లికి ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మని పిలిచింది.

అక్కడ కొందరు వ్యక్తులు నీరజ్ శర్మ కదలికలను ట్రాక్ చేస్తూ హర్యానా రిజిస్ట్రేషన్ ఉన్న స్కోర్పియో కార్ డ్రైవర్‌కు లొకేషన్ చేరవేశారు. నీరజ్ శర్మ రోడ్డు పక్కన నడుచుకుంటూ వస్తుండగా.. ఆ స్కోర్పియో కారు ఏకంగా 130 కిలోమీటర్ల స్పీడ్‌తో వచ్చి ఆమెను బలంగా ఢీకొట్టింది. ఆ దెబ్బకు ఆమె శరీరం 100 అడుగుల దూరం ఎగిరిపడి, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. యాక్సిడెంట్ చేసిన వాళ్లు అక్కడి నుంచి పరారయ్యారు. మొదట దీన్ని అందరూ మామూలు హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ అనుకున్నారు. కానీ పోలీసులు అక్కడి సిసిటివి ఫుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు అసలు ట్విస్ట్ బయటపడింది.

ఖాళీగా ఉన్న రోడ్డుపై, చివరగా నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను కారు కావాలనే టార్గెట్ చేసి గుద్దినట్లు స్పష్టమైంది. పైగా ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆమెను కాపాడటానికి ప్రయత్నించకుండా బైక్ ఎక్కి పారిపోవడం సిసిటివిలో రికార్డ్ అయింది. దీంతో ఆ కారు నెంబర్ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు కిల్లర్ హేమంత్‌ను పట్టుకున్నారు. వాడు ఇచ్చిన సమాచారంతో కన్నకూతురు ఆయుషి శర్మతో పాటు మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Published : 
  • 10 July 2026, 1:11 PM IST