ఒక డీఎస్పీ దగ్గర 300 కోట్ల రూపాయల ఆస్తుల? దీనిని బట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డు నుంచి డీజీపీ వరకు వివిధ స్థాయిల్లో అవినీతి ఎలా పేరుకుపోయిందో అర్థమవుతుంది. ఏసీబీ దాడుల్లో దొరికిన ఎస్పీ సంకిరెడ్డి భీమిరెడ్డి ఆస్తులు చూస్తే అవినీతిలో పోలీస్ శాఖ టాప్ అనేది మరోసారి రుజువైంది.కాకి యూనిఫామ్ ఒంటి మీద ఉంటే చాలు డబ్బులే డబ్బులు. ముఖ్యంగా ల్యాండ్ సెటిల్మెంట్లు, దందాలు, పంచాయతీలు... తద్వారా వచ్చే సొమ్ముతో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు... ఇది పోలీసు అధికారుల రోజువారి వ్యవహారం. ఈ కేసులో విచిత్రం ఏంటంటే,ఏసీబీ దాడుల్లో సుమారు 300 కోట్ల ఆస్తులతో పట్టుబడిన డీఎస్పీ సంకిరెడ్డి భీమ్ రెడ్డిని ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు. అంటే ప్రభుత్వంలో ఒక కరప్టెడ్ ఆఫీసర్ కి ఎంత పలుకుబడి ఉందో చూడండి. డి.ఎస్.పి భీమ్ రెడ్డిని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎవరి ఒత్తిడి వల్ల అదుపులోకి తీసుకోలేదు? అనే ప్రశ్నలకు సమాధానం మాత్రం లేదు.
కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ స్థాయి వరకు ఎదిగిన సంకిరెడ్డి భీమిరెడ్డి సర్వీస్ అంతా సిటీలో హాట్ ఏరియాలోనే నడిచిపోయింది. మాదాపూర్, గచ్చిబౌలి ,రాయదుర్గం, తెల్లాపూర్ కోకాపేట లాంటి రియల్ ఎస్టేట్ హబ్బులో పనిచేసిన భీమ్ రెడ్డి సర్వీస్ లో సగం అంతా దందాలే. డిపార్ట్మెంట్ లో ఉన్న పలుకుబడితో వేరే చోటికి బదిలీ కాకుండా రియల్ ఎస్టేట్ ఏరియాలోనే సర్వీస్ కొనసాగిస్తున్నాడు భీమ్ రెడ్డి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులకు ఏం కావాలంటే అది క్షణాల్లో అరేంజ్ చేసే డీఎస్పీ నీ అడ్డుకునే వాడు ఎవడు.? దీనికి తోడు పొలిటికల్ సపోర్ట్ ఎలాగూ ఉండనే ఉంది.ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేస్తే .... డిపార్ట్మెంట్ మొత్తం షాక్ తగిలింది. సుమారు 300కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు గుర్తించినట్లు ప్రకటించింది.
ఇది గవర్నమెంట్ లెక్కల ప్రకారం మాత్రమే. మార్కెట్ వాల్యూ కడితే 1000 కోట్లు పైనే ఉంటుంది. భీమ్ రెడ్డి దగ్గర పెద్ద ఎత్తున బినామీల చిట్టా దొరికింది. భీమ్ రెడ్డి బినామీలు చిట్టా తేల్చేందుకు రెండు మూడు రోజులు సమయం పడుతుందని , అందు వల్ల ఇప్పుడే అరెస్టు చేయలేమని ఏసీబీ అధికారులు చెప్తున్నారు.డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమం ఆస్తుల చిట్టా చూస్తే జనం కళ్ళు బైర్లు కమ్ముతాయి.కానిస్టేబుల్ స్థాయి నుంచి డిఎస్పీగా ప్రమోషన్ పొంది వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడో లెక్కలు తీస్తే ఏసీబీ తో పాటు డిపార్ట్మెంట్ అంతా ఆశ్చర్యపోయింది. భీమ్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపుతారని అంతా భావించారు. కానీ భీమ్‌రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చి పంపించి వేశారు. అయితే బినామీల చిట్టాను మాత్రం అధికారులు తమ దగ్గర పెట్టుకున్నారు.. భీమ్‌రెడ్డి తో పాటు అతని భార్య దగ్గర పెద్ద ఎత్తున బినామీల జాబితాను స్వాధీనం చేసుకున్నారు.
ఇంతకీ బీమ్‌రెడ్డి బినామీలు ఎవరు? ఎక్కడ ఉన్నారు? ఈ బినామీల దగ్గర ఎంత మొత్తంలో దాచారు? వారిపేర్లపై ఎంత పెట్టుబడి పెట్టారు? భీమ్ రెడ్డి ఎక్కడ నిర్మాణాలు చేపట్టారు? అతడు నిర్మిస్తున్న ఫామ్ హౌస్ ఎక్కడ ఉంది? అతడికి సంబంధించిన కమర్షియల్ కాంప్లెక్స్ వివరాలు ఏమిటి? భీమ్‌రెడ్డి ఆస్తులను ఎవరు నిర్వహిస్తున్నారు? అతడికి సంబందించిన వ్యవసాయ భూములను ఎవరు చూసుకుంటున్నా రూ? వీటన్నిటిపైనా ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 300 కోట్ల ఆస్తుల కేసులో భీమ్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా కేవలం నోటీసులు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. భీంరెడ్డి అరెస్టును ఎవరు అడ్డుకున్నారు? రాజకీయ పలుకుబడి వల్లే అతడి అరెస్ట్‌ను అడ్డుకున్నారా? అనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదైతే నిందితులను కచ్చితంగా అరెస్టు చేస్తారు. .. గతంలో ఏకంగా 70 ఏళ్ల మాజీ చీఫ్ ఇంజనీర్లను సైతం అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇప్పుడు డి.ఎస్.పి భీమిరెడ్డిని అరెస్టు చేయకపోవడంపై అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల తో భీమ్ రెడ్డికి బలమైన సంబంధాలు ఉన్నాయని స్పష్టమైపోయింది.
తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న సంకిరెడ్డి భీమ్ రెడ్డిపై ఏసీబీ అధికారులు అక్రమాస్తుల కేసు నమోదు చేశారు. భీమ్ రెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీలకు చెందిన 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ ఇబ్రహీంబాగ్‌లోని వెస్సెల్లా మెడోస్‌లో ఒక విల్లా, టెలికాం నగర్లో భవనంతో పాటు సాయి ప్రభా రెసిడెన్సీలో ఒక ఫ్లాట్‌ను అధికారులు కనుగొన్నారు. అలాగే గచ్చిబౌలి క్రాంతి సియోన్ అపార్ట్‌మెంట్స్‌లో ఒక ఫ్లాట్, తెల్లాపూర్ అభినంద రెసిడెన్సీలో రెండు ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. మణికొండ లాంకోహిల్స్ రోడ్డులోని కమర్షియల్ కాంప్లెక్స్‌లో వాటా, మర్రిచెట్టు జంక్షన్ సమీపంలో కమర్షియల్ స్థలం, ప్రగతి రిసార్ట్స్ దగ్గర ఓపెన్ ప్లాట్ ఉన్నట్లు తేల్చారు. వీటితో పాటు నాగోల్, పటాన్చెరు, వికారాబాద్ జిల్లా మొమిన్‌పేట్ ప్రాంతంలో పలు ప్లాట్లు ఉన్నట్లు కనుగొన్నారు.
అలాగే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, మొమిన్‌పేట్, ముచింతలతో పాటు కర్ణాటక, బెంగళూరు పరిసరాల్లో భారీగా వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తించారు. శ్రీ రాఘవేంద్ర రాక్ సాండ్ మినరల్స్ సంస్థలో 75 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు కనుగొన్నారు. స్థిరాస్తులతో పాటు సోదాల్లో పెద్ద ఎత్తున నగదు, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. భీమ్ రెడ్డి స్వగృహంలో 3.60 లక్షల నగదు గుర్తించారు. అతడి బినామీ ఇంట్లో 40 లక్షల నగదు పట్టుకున్నారు. సుమారు 2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులు , వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న 19.91 లక్షల నగదును సీజ్ చేశారు. ఈ ఆస్తుల అసలు మార్కెట్ విలువ డాక్యుమెంట్లలో చూపిన దానికంటే చాలా రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. అంతేకాదు భీమిరెడ్డి ఇంట్లో 23 విదేశీ మద్యం బాటిల్స్ కూడా బయటపడ్డాయి. భీమ్ రెడ్డికి సంబంధించి ఇంకా అదనంగా ఉన్న ఆస్తులపై ప్రస్తుతం ధృవీకరణ ప్రక్రియ , కేసు విచారణ కొనసాగుతోంది.
అభినందనా ఇన్ ఫ్రా..అభినందన మీడోస్,అభినందన ఎమిరాల్డ్, అభినందన మణికొండ మాల్ సంస్థ ల్లో భారీగా భీం రెడ్డి, అతని స్నేహితుడు నరేందర్ రెడ్డి ద్వారా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం.మణికొండ మర్రిచెట్టువద్ద HMDA అనుమతి లేకుందా అక్రమంగా నిర్మించిన అభినందన ఎంరాల్డ్షాపింగ్ మాల్ లో భారీగా భీం రెడ్డి పెట్టుబడులు ఉన్నట్లు గుర్తించారు.ఇటీవల తెల్లాపూర్ మునిసిపల్ కార్పోరేషన్ పరిధి లో వున్న వెలిమల లో 6 ఎకరాల భూ వ్యవహారాన్ని సెటిల్ చేసిన భీం రెడ్డి, ఆ 6 ఎకరాల్లో కట్టిన 35 అంతస్తుల భవన నిర్మాణ వ్యాపార భాగస్వామిగా కూడా ఉన్నాడు. సెటిల్మెంట్ లో వచ్చిన మొత్తాన్ని అభినందన సంస్థల్లో మళ్లీ పెట్టుబడిగా పెట్టినట్లు ACB గుర్తించింది. ప్రస్తుతం అమెరికా లో ఉన్న అభినందన ఇన్ ఫ్రా చైర్మన్ వెంకటేష్, ఆయన భార్య ఆ సంస్థ ఎండి స్వప్న ఇండియాకి తిరిగి వస్తే పూర్తి వివరాలు బయటకు వస్తాయి. భీమ్ రెడ్డితోమరో భాగస్వామిగా వున్న మణికొండ మునిసిపాలిటీ వైస్ చేర్మన్ నీ కూడా ఏసీబీ ప్రశ్నించబోతోంది.హైదరాబాదులో హార్ట్ ఏరియాలో పనిచేసే ఒక డీఎస్పీ దగ్గర ఇన్ని వందల కోట్ల ఆస్తులు ఉంటే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో డిపార్ట్మెంట్లో ఒక్క అధికారి దగ్గర ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఉంటాయి.... మార్కెట్లో వాటి విలువ ఎంత ఉంటుంది అని జనం చర్చించుకుంటున్నారు.