చిక్కుల్లో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు.. స్టోక్స్ వీడియోపై ఐసీసీ నోటీసులు..!

ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చిక్కుల్లో పడింది. మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా విడుదల చేసిన వీడియోపై ఐసీసీ వివరణ కోరింది. ప్లేయర్స్ అండ్ మ్యాచ్ ఆఫిషియల్స్ ఏరియా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఐసీసీ

Post Published By: dialnews
Updated : 10 July 2026, 2:50 PM IST

ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చిక్కుల్లో పడింది. మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా విడుదల చేసిన వీడియోపై ఐసీసీ వివరణ కోరింది. ప్లేయర్స్ అండ్ మ్యాచ్ ఆఫిషియల్స్ ఏరియా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఐసీసీ అభిప్రాయపడిందని సమాచారం. గత నెల జూన్ 28న న్యూజిలాండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన మూడో టెస్టు నాలుగో రోజు ఆట సందర్భంగా బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. అయితే స్టోక్స్ తన నిర్ణయాన్ని సహచర ఆటగాళ్లకు డ్రెస్సింగ్‌రూమ్‌లో వివరిస్తున్న వీడియోను మ్యాచ్ జరుగుతుండగానే టీ విరామానికి ముందు ఈసీబీ తమ అధికారిక సోషల్ మీడియా వేదికల్లో, ప్రసార భాగస్వాములకు విడుదల చేసింది.

ఈ అంశంపైనే ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారం డ్రెస్సింగ్‌రూమ్‌లలో కెమెరాలు లేదా ఇతర రికార్డింగ్ పరికరాలను ఏర్పాటు చేయకూడదని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు మ్యాచ్‌ల సమగ్రతను కాపాడడంతో పాటు ఐసీసీ అవినీతి నిరోధక నియమావళికి మద్దతుగా అమల్లో ఉన్నాయని పేర్కొంది.ఐసీసీ అభిప్రాయం ప్రకారం, స్టోక్స్ రిటైర్మెంట్ వీడియోను మ్యాచ్ ముగిసిన తర్వాత జూన్ 29న విడుదల చేసి ఉంటే ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదు. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ఆ దృశ్యాలను ప్రసారం చేయడంపైనే ప్రశ్నలు లేవనెత్తింది.

ఈ అంశంపై ఐసీసీ పంపిన లేఖకు ఇప్పటివరకు ఈసీబీ అధికారికంగా స్పందించలేదు. కాగా బెన్ స్టోక్స్.. అంతర్జాతీయ కెరీర్ ఓటమితో ముగిసింది. 35 ఏళ్ల బెన్ స్టోక్స్ తన కెరీర్‌లో 122 టెస్టులు ఆడాడు. 114 వన్డేలు, 43 టీ20 మ్యాచులు సైతం ఆడాడు. ఇదిలా ఉంటే, బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ అనంతరం ఇంగ్లండ్ టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్ ఎంపిక ప్రక్రియను ఈసీబీ ప్రారంభించింది. వైట్‌బాల్ జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్ టెస్టు సారథ్యంపై ఆసక్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 19 నుంచి పాకిస్థాన్‌తో ప్రారంభమయ్యే మూడు టెస్టుల సిరీస్‌కు ముందు కొత్త కెప్టెన్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

Published : 
  • 10 July 2026, 2:50 PM IST