ప్రపంచం మరో పెను విపత్తు అంచున నిలబడిందా? రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-గాజా, యుద్ధాల కంటే భయంకరమైన యుద్ధానికి ప్రపంచం వేదిక కాబోతోందా? అవుననే అంటున్నాయి తాజా అంతర్జాతీయ పరిణామాలు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న మైండ్ గేమ్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వణుకు పుట్టిస్తున్నాయి. మొన్నటివరకు శాంతి చర్చలు అనుకున్న సీన్.. ఒక్కసారిగా తిరగబడింది. 'ఇరాన్‌తో కుదిరిన డీల్ ముగిసిపోయింది.. ఇక యుద్ధమే' అని డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేయగా.. దానికి ఇరాన్ అంతకంటే భయంకరమైన రేంజ్లో కౌంటర్ ఇచ్చింది. 'మేము తలవంచే ప్రసక్తే లేదు.. అమెరికా గనుక తోక జాడిస్తే చరిత్రలో ఎన్నడూ చూడని ప్రతీకార దాడిని రుచి చూపిస్తాం' అంటూ ఇరాన్ టాప్ లీడర్స్ వార్నింగ్ ఇచ్చారు. అసలు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉన్న ఈ గొడవ ఏంటి? ట్రంప్ ఎందుకు డీల్ క్యాన్సిల్ చేశారు?
వివరాల్లోకి వెళ్తే.. గత నెలలోనే అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒక కీలకమైన ఒప్పందం కుదిరింది. దీనివల్ల మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు తగ్గుతాయని అంతా భావించారు. కానీ, ఆ ఒప్పందం కుదిరిన కొద్ది రోజులకే ఇరు దేశాల మధ్య మళ్లీ దాడులు, ప్రతిదాడులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేస్తూ.. 'ఇరాన్‌తో సీజ్ఫైర్ (కాల్పుల విరమణ) ఒప్పందం ముగిసిపోయింది, ఆ డీల్ ఓవర్' అని తేల్చి చెప్పారు. అంతేకాదు, ఇరాన్ దేశమే తమతో చర్చలు జరపాలని బతిమాలుకుంటోందని, కానీ తాము దానికి ఒప్పుకోవడం లేదనే రేంజ్లో ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇరాన్‌కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి."
ట్రంప్ ప్రకటనపై ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. అమెరికా తమకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఉల్లంఘించినా.. అంతకు అంత ‘ప్రతీకార చర్య’ ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి అధికారికంగా హెచ్చరించారు. అమెరికా తామే చర్చల కోసం అడిగామని అబద్ధాలు చెపుతోందని, తాము ఎన్నడూ అమెరికాను చర్చల కోసం అడగలేదని స్పష్టం చేసింది. కేవలం ఖతార్ దేశానికి చెందిన రాయబారులు మధ్యవర్తిత్వం కోసం తమ దేశానికి వస్తే.. దానికి గౌరవం ఇచ్చి మాట్లాడామే తప్ప, అమెరికా ముందు మోకాళ్ల మీద నిలబడలేదని ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. ఇరాన్ టాప్ నెగోషియేటర్ మహ్మద్ బాఖెర్ గాలిబాఫ్ మాట్లాడుతూ.. 'యుద్ధాన్ని ఆపడం ప్రపంచ దేశాల ప్రాధాన్యత కావచ్చు.. కానీ ఈ పోరాటం ఇరాన్ లొంగిపోవడంతో మాత్రం ముగిసిపోదు' అని అమెరికాకు సూటిగా హెచ్చరికలు జారీ చేశారు.
ఇరాన్ దేశానికి చెందిన కీలక నేతలు అమెరికాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అమెరికాను ఒక ‘నేరపూరిత దేశం’గా ఇరాన్ అభివర్ణిస్తోంది. అమెరికాతో తాము జరిపేవి కేవలం ఒక యుద్ధ వ్యూహంలో భాగమే తప్ప, అవి శాంతి చర్చలు కావని స్పష్టం చేస్తోంది. ఇరాన్ వ్యవస్థాపకుడు రూహొల్లా ఖొమేని మనవడు అలీ ఖొమేని మాట్లాడుతూ.. 'క్రిమినల్ అమెరికాతో మనం శాంతిని ఎలా నెలకొల్పగలం? ఎవరైనా అమెరికాతో శాంతి కోసం స్నేహ హస్తం చాచాలని చూస్తే, వాళ్లు నమ్మకద్రోహులు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఇరాన్ ఎంత కసిగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
గత కొన్ని రోజులుగా మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల కారణంగా కొద్దిగా తగ్గిన దాడులు.. ఆ అంత్యక్రియలు ముగిసిన మరుసటి రోజు నుంచే మళ్లీ బాంబు పేలుళ్లతో మిడిల్ ఈస్ట్‌ను వణికించడం ప్రారంభించాయి. మరోవైపు డోనాల్డ్ ట్రంప్ కూడా తగ్గేదే లేదంటున్నారు. అమెరికాపై ఇరాన్ గనుక దాడులు చేయాలని చూస్తే.. తమ దగ్గర 1000కి పైగా క్షిపణులు లోడ్ అయి సిద్ధంగా ఉన్నాయని ట్రంప్ హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి. ఇటు అమెరికా సైనిక అగ్రరాజ్యం, అటు ఇరాన్ ఏమాత్రం తగ్గని మొండి దేశం. ఈ రెండు దేశాల మధ్య గనుక పూర్తి స్థాయి యుద్ధం మొదలైతే.. చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం. కన్నూ మిన్నూ కానకుండా సాగుతున్న ఈ శత్రుత్వం ఎక్కడికి దారితీస్తుందో అని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి.