Top story: అమెరికాను వణికిస్తున్న లారెన్స్ గ్యాంగ్, లారెన్స్ గ్యాంగ్ తో ఎఫ్బీఐ మైండ్ గేమ్.. అమెరికా ఆఫీసర్ నే బెదిరించారా..?

భారతదేశంలోనే కాదు.. ఇప్పుడు అంతర్జాతీయంగా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌గా మారిన పేరు లారెన్స్ బిష్ణోయ్! ఇండియాలో జైల్లో కూర్చుని ప్రపంచవ్యాప్తంగా నెట్‌వర్క్ నడిపిస్తున్న ఈ గ్యాంగ్‌కు అమెరికా గూఢచార సంస్థ FBI ఊహించని షాక్ ఇచ్చింది.

Post Published By: dialnews
Updated : 10 July 2026, 4:30 PM IST

భారతదేశంలోనే కాదు.. ఇప్పుడు అంతర్జాతీయంగా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌గా మారిన పేరు లారెన్స్ బిష్ణోయ్! ఇండియాలో జైల్లో కూర్చుని ప్రపంచవ్యాప్తంగా నెట్‌వర్క్ నడిపిస్తున్న ఈ గ్యాంగ్‌కు అమెరికా గూఢచార సంస్థ FBI ఊహించని షాక్ ఇచ్చింది. బిష్ణోయ్ గ్యాంగ్‌తో పాటు బగ్వాన్‌పురియా, ధండా ముఠాలకు చెందిన ఏకంగా 24 మంది అంతర్జాతీయ క్రిమినల్స్‌ను అమెరికా పోలీసులు రీసెంట్‌గా అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్టుల వెనుక హాలీవుడ్ సినిమాను తలపించే రేంజ్‌లో ఒక మైండ్ బ్లోయింగ్ అండర్ కవర్ ఆపరేషన్ నడిచింది. దాని పేరే ‘ఆపరేషన్ హార్డ్ బాల్’. అసలు బిష్ణోయ్ గ్యాంగ్ ట్రాప్‌లో ఎలా పడింది?

ఈ కథ 2023లో మొదలైంది. కెనడా వేదికగా అమెరికా, మెక్సికో దేశాలకు వందల కిలోల కొకైన్, డ్రగ్స్ సప్లై చేసే రవీందర్ సింగ్ ధండా అనే పెద్ద డ్రగ్ ట్రాఫికర్‌పై అమెరికా నిఘా వర్గాలు కన్ను వేశాయి. ఈ క్రమంలోనే ఒక 'రహస్య ఏజెంట్' ధండాను సంప్రదించాడు. తానే డ్రగ్స్ ట్రాన్స్‌పోర్ట్ కోఆర్డినేటర్ అని నమ్మబలికాడు. ఆ ఏజెంట్‌ను నిజమైన క్రిమినల్ అనుకుని నమ్మేసిన ధండా.. లాస్ ఏంజిల్స్‌లో కొకైన్ డెలివరీ చేయాల్సిందిగా కోరాడు. అలా వరుసగా డ్రగ్ లోడ్స్ మారుస్తూ ఎఫ్‌బీఐ ఏజెంట్లను కలవడం ప్రారంభించాడు. చివరికి తగిన సాక్ష్యాలతో కెనడా పోలీసులు ధండాను అరెస్ట్ చేసేలా అమెరికా పక్కా స్కెచ్ వేసింది.

ధండా నెట్‌వర్క్‌ను గుప్పిట్లోకి తెచ్చుకున్న అదే అండర్ కవర్ ఏజెంట్.. పంజాబ్ కేంద్రంగా నడిచే మోస్ట్ డేంజరస్ 'బగ్వాన్‌పురియా' గ్యాంగ్‌లోకి కూడా చొరబడ్డాడు. మొదట ₹45 వేల డాలర్లకు కొకైన్ కొని వాళ్లకు నమ్మకం కలిగించాడు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే.. 2025లో కాలిఫోర్నియా పార్కింగ్ లాట్‌లో ఏకంగా ఏకే-47 తుపాకులు, గ్రెనేడ్లు, పిస్తోళ్లను ఆ గ్యాంగ్ నుండి ఈ సీక్రెట్ ఏజెంట్ కొనుగోలు చేశాడు. ఇదంతా అమెరికా రికార్డుల్లో సాక్ష్యాలుగా మారుతోందని ఆ ముఠా ఊహించలేకపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా నుంచి కెనడాకు 20 కిలోల కొకైన్ పంపాలని ఈ గ్యాంగ్ ప్లాన్ చేసింది. అయితే పోలీసులు దాన్ని ఒక నకిలీ డ్రగ్ లోడ్‌తో రీప్లేస్ చేసి, ఆ సరుకును సీజ్ చేశారు. దాంతో గ్యాంగ్ సభ్యులకు అనుమానం వచ్చి ఏజెంట్‌కు వార్నింగ్ మెసేజ్‌లు పంపారు గానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఇక అసలు సిసలైన ట్విస్ట్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో నడిచింది. ఈ గ్యాంగ్‌కు చెందిన సుఖ్‌రాజ్ సింగ్ కాంగ్ అనే కీలక సభ్యుడు.. తమకు రావలసిన ఒక పాత అప్పు వసూలు చేయడానికి అదే అండర్ కవర్ ఏజెంట్ సహాయం కోరాడు. అప్పు ఎగనామం పెట్టిన వ్యక్తిని బెదిరించి ₹2 లక్షల డాలర్లు వసూలు చేసి పెడితే.. ₹16 వేల డాలర్లు కమిషన్ ఇస్తామని డీల్ కుదుర్చుకున్నారు. ఇక్కడే ఎఫ్‌బీఐ మరో మాస్టర్ మైండ్ గేమ్ ఆడింది. ఆ అప్పు బాకీ ఉన్న వ్యక్తి స్థానంలో ఒక 'అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్' రంగంలోకి దిగాడు. బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు ఆ పోలీస్ ఆఫీసర్‌కే ఫోన్ చేసి.. "డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తాం" అంటూ విపరీతంగా బెదిరింపులకు దిగారు.

తాము బెదిరిస్తోంది సాదాసీదా వ్యక్తిని కాదు, సాక్షాత్తూ అమెరికా పోలీస్ ఆఫీసర్‌ని అనే విషయం తెలియక ఆడియో రికార్డింగులతో సహా తిరుగులేని సాక్ష్యాలను వాళ్లకు వాళ్లే ఎఫ్‌బీఐకి అందించారు. ఇలా మూడేళ్ల పాటు చాలా ఓపికగా వల పన్నిన అమెరికా డీఓజే మరియు ఎఫ్‌బీఐ.. జూన్ చివరి వారంలో గ్రాండ్ జూరీల ముందు ఈ సాక్ష్యాలన్నీ ప్రవేశపెట్టి అరెస్ట్ వారెంట్లు సాధించాయి. ఆ తర్వాత రంగంలోకి దిగిన ‘ఆపరేషన్ హార్డ్ బాల్’ ఫోర్స్.. అమెరికా, కెనడాల్లో ఒకేసారి దాడులు చేసి బిష్ణోయ్, బగ్వాన్‌పురియా నెట్‌వర్క్‌లకు చెందిన 24 మందిని ఊచకోత కోసినట్లు అరెస్ట్ చేసింది.

Published : 
  • 10 July 2026, 4:30 PM IST