ఒకప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటే వివాదాలు, అవినీతి, రాజకీయాలు ఇవే ఎక్కువగా వార్తల్లో కనిపించేవి. కానీ ఇప్పుడు అదే హెచ్‌సీఏ… తెలంగాణ క్రికెట్‌కు కొత్త బ్రాండ్‌ను సృష్టిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. 21 రోజుల పాటు సాగిన టీజీ-20 లీగ్‌కు గ్రాండ్ ఫినాలేతో ఘనంగా తెరపడగా… స్టేడియంలో ప్రేక్షకుల హోరు, డిజిటల్ వేదికల్లో కోట్ల వ్యూస్, యువ ఆటగాళ్లలో కొత్త ఆశలు… ఇవన్నీ కలిసి టీజీ-20ను టాక్ ఆఫ్ తెలంగాణ క్రికెట్ గా మార్చేశాయి.జూన్ 21న మొదలైన టీజీ-20… 8 జట్లు, 32 మ్యాచ్‌లు, 21 రోజుల పాటు ఉప్పల్ స్టేడియాన్ని క్రికెట్ పండుగలా మార్చింది. టోర్నీ ముగిసే నాటికి దాదాపు 3 లక్షల మంది అభిమానులు స్టేడియానికి వచ్చి మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించడం హెచ్‌సీఏ నిర్వహణకు పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది.
గ్రాండ్ ఫినాలే కూడా అదే జోష్‌లో సాగింది. హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ తొలి టీజీ-20 ట్రోఫీని ముద్దాడగా… ఉప్పల్ స్టేడియంలో సంబరాలు మిన్నంటాయి. టైటిల్ పోరు ముగిసిన వెంటనే ప్రారంభమైన క్లోజింగ్ సెర్మనీ అంతర్జాతీయ స్థాయి లీగ్‌లను తలపించేలా సాగిందని క్రికెట్ అభిమానులు చెబుతున్నారు. విజేత జట్టుకు 1 కోటి ప్రైజ్ మనీ, రన్నరప్‌కు 50 లక్షలు, మూడు, నాలుగో స్థానాల్లో నిలిచిన జట్లకు చెరో 25 లక్షలు ప్రదానం చేశారు. యువ ఆటగాళ్లకు ఇంత భారీ ప్రైజ్ మనీ ఇవ్వడం ద్వారా తెలంగాణ క్రికెట్‌లో కొత్త ప్రమాణాలు నెలకొల్పిందన్న ప్రశంసలు హెచ్‌సీఏకు దక్కుతున్నాయి. ఈ టోర్నీ ప్రత్యేకత మాత్రం కేవలం ట్రోఫీలు కాదు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఆటగాళ్లకు పెద్ద వేదికను కల్పించడం. చిన్న పట్టణాల్లో, గ్రామాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు హెచ్‌సీఏ వేసిన ఈ అడుగు… భవిష్యత్ తెలంగాణ జట్టుకు పునాది కావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ హైకోర్టు నియమించిన సింగిల్ మెంబర్ కమిటీ చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ నవీన్ రావు పర్యవేక్షణలో టోర్నీ నిర్వహణ సాగడం మరో విశేషం. మైదాన ఏర్పాట్లు, షెడ్యూల్ అమలు, మ్యాచ్ నిర్వహణ… ప్రతి అంశంలో హెచ్‌సీఏ చూపిన సమర్థతపై క్రికెట్ వర్గాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. ఇక డిజిటల్ రీచ్ విషయానికి వస్తే… టీజీ-20 సోషల్ మీడియా వేదికల్లో 300 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినట్లు హెచ్‌సీఏ వర్గాలు చెబుతున్నాయి. తొలి సీజన్‌కే ఈ స్థాయి స్పందన రావడం టోర్నీకి లభించిన ఆదరణకు నిదర్శనంగా పేర్కొంటున్నారు.భారీ ప్రైజ్ మనీతో ఆటగాళ్లను ప్రోత్సహించడం… స్టేడియానికి అభిమానులను రప్పించడం… డిజిటల్ వేదికల్లో విశేష ఆదరణ పొందడం… గ్రామీణ ప్రతిభకు జాతీయ స్థాయి వేదికను కల్పించడం… ఇలా తొలి సీజన్‌తోనే టీజీ-20 ప్రత్యేక ముద్ర వేసింది.టీజీ-20 లీగ్ రాబోయే రోజుల్లో తెలంగాణ క్రికెట్‌కు మరింత మంది స్టార్ ఆటగాళ్లను అందించే వేదికగా నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.