ఆరు దశాబ్దాల పాటు యావత్ భారత సినీ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో ఊగించిన దక్షిణాది స్వరకోకిల, మన జానకమ్మ ఇక లేరనే వార్తను ఇప్పటికీ సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. దాదాపు 17 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడి, కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ సింగర్ ఎస్. జానకి గారు ఇటీవల మైసూరులో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కర్ణాటక ప్రభుత్వం ఆమెకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. అయితే, ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు సంగీత అభిమానుల్లో ఒక తీవ్రమైన చర్చ, ఒక బలమైన అసంతృప్తి వెల్లువెత్తుతోంది. అదేంటంటే.. తెలుగు నేల కన్న బిడ్డ, టాలీవుడ్‌ను దశాబ్దాల పాటు తన పాటలతో ఏలిన జానకమ్మ అంతిమ యాత్రకు టాలీవుడ్ నుంచి ఒక్క ప్రముఖుడు కూడా ఎందుకు వెళ్లలేదు? ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఎవరైనా చిన్న నటుడు చనిపోయినా.. లేదా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు మరణించినా కూడా టాలీవుడ్ పెద్దలు, స్టార్ హీరోలు, దర్శకులు క్యూ కడతారు. కానీ, భారతీయ సంగీత శిఖరమైన జానకమ్మ అంత్యక్రియల విషయంలో టాలీవుడ్ ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జానకమ్మ చనిపోగానే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో "ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి.. రిప్ జానకమ్మ" అంటూ పెద్ద పెద్ద పోస్టులు పెట్టి మమ అనిపించేశారు తప్ప, ఒక్కరంటే ఒక్కరు కూడా మైసూరుకు వెళ్లి ఆమె పార్థివదేహాన్ని కడసారి చూసే ప్రయత్నం చేయలేదు. కేవలం సోషల్ మీడియా పోస్టులతోనే తమ బాధ్యత తీరిపోయిందా? అని అభిమానులు సూటిగా ప్రశ్నిస్తున్నారు.
మనం ఒక్కసారి చరిత్రను గుర్తుచేసుకుంటే.. టాలీవుడ్లో ఉన్న సీనియర్ హీరోల నుంచి నిన్న మొన్నటి తరం వరకు ప్రతి ఒక్కరి సినిమాల్లోనూ జానకమ్మ అద్భుతమైన పాటలు పాడారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబుల కాలం నుండి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఇలా అందరి చిత్రాల విజయాల్లో ఆమె పాటలు కీలక పాత్ర పోషించాయి. అలాంటి మహోన్నత గాయని భౌతికంగా దూరమైతే, ఇండస్ట్రీ తరఫున ఒక ప్రతినిధి బృందం కూడా వెళ్లకపోవడం ఎంతవరకు సమంజసం అనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ఒకప్పుడు చెన్నైలో, హైదరాబాద్‌లో ఇండస్ట్రీని నడిపించిన పెద్దలతో జానకమ్మకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉండేది. అలాంటిది ఆమె చివరి చూపుకు నోచుకోకపోవడం టాలీవుడ్ నైతికతను ప్రశ్నార్థకం చేస్తోంది.
ఈ విమర్శలు కేవలం టాలీవుడ్ పైనే కాదు, మొత్తం దక్షిణాది చిత్ర పరిశ్రమపై వస్తున్నాయి. తమిళ, మలయాళ పరిశ్రమల నుండి కూడా ప్రముఖులెవరూ ఈ అంత్యక్రియలకు హాజరు కాలేదు. కర్ణాటక ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించి తన గౌరవాన్ని చాటుకుంది. మైసూరులోని మహారాజా కాలేజీ గ్రౌండ్స్‌లో వేలాది మంది అభిమానులు వచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. కానీ, ఆమె గొంతును వాడుకుని వందల కోట్ల బిజినెస్ చేసిన సినిమా రంగానికి చెందిన 'స్టార్స్' మాత్రం తమ లగ్జరీ ఇళ్లకే పరిమితమయ్యారు. "వెండితెరపై సెంటిమెంట్లు పండించే నటులకు, నిజ జీవితంలో ఒక లెజెండ్‌కు గౌరవం ఇవ్వాలనే సెంటిమెంట్ లేదా?" అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు.
ఇటీవల కాలంలో ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖ దర్శకులు లేదా నిర్మాతలు చనిపోయినప్పుడు, ముఖ్యమంత్రులు మరియు స్టార్ హీరోలు స్వయంగా వెళ్లి వారి అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు. కానీ జానకమ్మ విషయానికి వచ్చేసరికి మైసూరు దూరంగా ఉందనో, లేదా వృద్ధాప్యం వల్ల ఆమె గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుందనో కారణాలు వెతుకుతున్నారా అని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రతికి ఉన్నప్పుడు ఆమె పాటలతో థియేటర్లను ఊపేసిన ఇండస్ట్రీ, ఆమె శాశ్వతంగా కన్నుమూసినప్పుడు కనీసం ఒక పూలమాల వేయడానికి కూడా సమయం కేటాయించలేకపోయిందా అనే విమర్శల్లో నిజం లేకపోలేదు.
చివరిగా చెప్పాలంటే.. అవార్డులు, రివార్డుల కంటే ప్రేక్షకుల ప్రేమే గొప్పదని నమ్మిన నిగర్వి జానకమ్మ. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె పాడిన వేలాది పాటలు ఎప్పటికీ అమరమే. కానీ సినిమా ఇండస్ట్రీ ఇలాంటి లెజెండ్స్ విషయంలో ప్రదర్శిస్తున్న ఉదాసీనత మాత్రం భవిష్యత్తు తరాలకు మంచి సంకేతం కాదు. సోషల్ మీడియాలో నాలుగు ముక్కలు రాసి సంతాపం తెలపడం కాదు.. నిజమైన గౌరవం ఇవ్వడం అంటే వారి చివరి ప్రయాణంలో తోడుగా నిలవడం.