రాజకీయం అంటేనే అధికార భోగాలు, ప్రభుత్వ సొమ్ముతో విలాసాలు అనుకునే రోజులివి. చిన్న పంటి నొప్పి వచ్చినా విదేశాలకు వెళ్లి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మెడికల్ రీఎంబర్స్‌మెంట్ రూపంలో క్లెయిమ్ చేసే నాయకులను మనం చూశాం. కానీ, ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా... "ప్రజాధనం ప్రజల కోసమే.. నా వ్యక్తిగత అవసరాల కోసం కాదు" అంటూ తన శస్త్రచికిత్స ఖర్చులను అణాపైసలతో సహా సొంత జేబులోంచి పెట్టుకున్న ఏపీ డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయారు.
ఇటీవల పవన్ కళ్యాణ్ గారికి ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో కుడి భుజానికి సుమారు మూడున్నర గంటల పాటు సుదీర్ఘ శస్త్రచికిత్స జరిగింది. ప్రముఖ స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ దిన్షా పార్థీవాలా నేతృత్వంలో ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. అసలు ఈ నొప్పి ఈరోజుది కాదు. 2016 నుంచే ఆయన రెండు భుజాల నొప్పితో బాధపడుతున్నారు. 2018 పోరాట యాత్ర, ఆ తర్వాత వారాహి యాత్ర సమయాల్లో అభిమానులు ఉత్సాహంతో చేతులు పట్టి లాగడం వల్ల ఈ రొటేటర్ కఫ్ గాయం తీవ్రమైంది.
ఎన్నికల ప్రచారం, ఆ తర్వాత ప్రభుత్వ బాధ్యతల కోసం ఈ సర్జరీని వాయిదా వేస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్, ఎట్టకేలకు డాక్టర్ల బలవంతం మీద ముంబై వెళ్లాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో చికిత్స తీసుకుంటే హాస్పిటల్‌కు వేలాది మంది అభిమానులు వచ్చి ఇతర రోగులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతోనే ఆయన ముంబైని ఎంచుకోవడం ఆయన సంస్కారానికి నిదర్శనం అంటూ పవన్ ఫ్యాన్స్ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ సర్జరీ ముగిసిన తర్వాత డిప్యూటీ సీఎం కార్యాలయం ఒక సంచలన ప్రకటన చేసింది. ఒక మంత్రిగా పవన్ కళ్యాణ్‌కు ఎంతటి ఖరీదైన వైద్యానికైనా ప్రభుత్వ నిధులను క్లెయిమ్ చేసుకునే పూర్తి హక్కు ఉంది.
కానీ పవన్ కళ్యాణ్ గారు దానికి పూర్తిగా నిరాకరించారు. ఆపరేషన్ థియేటర్ బిల్లు, మందుల ఖర్చులు, హాస్పిటల్ రూమ్ రెంట్ మాత్రమే కాదు... తానే కాకుండా తనతో పాటు ప్రయాణించిన స్టాఫ్ ఫ్లైట్ టికెట్స్, ప్రయాణ వ్యయాలన్నింటినీ తన సొంత నిధుల నుంచే చెల్లించారు. రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా చూసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. సుమారు ఆరు నెలల క్రితం ఆయన ముక్కుకు ఒక శస్త్రచికిత్స జరిగింది. అప్పుడు కూడా ఆయన ఏపీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం లభించే ఉచిత వైద్య సదుపాయాన్ని కానీ, బిల్లుల రీఎంబర్స్‌మెంట్‌ను కానీ వినియోగించుకోలేదు.
ఆ రోజు కూడా తన సొంత కష్టార్జితంతోనే ఆ వైద్య ఖర్చులన్నీ భరించారు. ప్రజా జీవితంలో జవాబుదారీతనం అంటే కేవలం ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, ఆచరించి చూపించడం అని ఆయన ప్రతి విషయంలోనూ రుజువు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు ఒక్కో కోటి రూపాయలు ఇవ్వడమే కాకుండా, పంచాయతీ రాజ్ మంత్రిగా ఏపీలోని 400 పంచాయతీలకు సొంత డబ్బుల నుండి ఒక్కో లక్ష చొప్పున మొత్తం 6 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని తన వ్యక్తిగత ఖాతా నుంచే ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న వేలాది మంది కౌలు రైతు కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున తన సొంత సినిమాల సంపాదన నుండి లక్షలాది రూపాయల ఆర్థిక సాయం అందించి వారి కన్నీళ్లు తుడిచారు.
డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తన క్యాంప్ ఆఫీస్ మరమ్మతులు, ఇతర అవసరాలకు కూడా వీలైనంత వరకు ప్రభుత్వ నిధుల దుబారాను అడ్డుకుంటూ క్లీన్ పాలిటిక్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. వైద్యుల సమాచారం ప్రకారం.. కుడి భుజానికి సర్జరీ విజయవంతమైంది, మరో రెండు నెలల తర్వాత ఎడమ భుజానికి కూడా సర్జరీ జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన ముంబై హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి విశ్రాంతి తీసుకుంటున్నారు. పదవులు రాగానే ప్రభుత్వ సొమ్ముతో ఎలా జల్సాలు చేయాలో ఆలోచించే నాయకులు ఉన్న ఈ సమాజంలో... రాచమర్యాదలు, అపరిమితమైన ప్రభుత్వ నిధులు అందుబాటులో ఉన్నా, నిబద్ధతతో వాటిని తిరస్కరించిన పవన్ కళ్యాణ్ నిజంగా నేటి తరానికి ఒక రోల్ మోడల్ అంటూ ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. "దిస్ ఈజ్ నాట్ జస్ట్ పాలిటిక్స్... దిస్ ఈజ్ క్యారెక్టర్" అంటూ సోషల్ మీడియా మొత్తం ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది.