భారత క్రికెట్ జట్టు యూకే టూర్ ఘోరపరాజయాలతో ముగిసింది. భారీ అంచనాలతో అక్కడకు వెళ్లిన టీమిండియా పూర్తిగా నిరాశపరిచింది. మొదట పసికూన ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ పరాభవం చవిచూసింది. ఐర్లాండ్ పై భారత జట్టు నుంచి ఇలాంటి ప్రదర్శన ఎవ్వరూ ఊహించలేదు. తర్వాత ఇంగ్లాండ్ గడ్డపైనా అదే చెత్త ఆటతీరు. ఫలితంగా టీ20 సిరీస్ లో 0-4తో ఘోరపరాభవం. పొట్టి క్రికెట్ లో ప్రపంచ ఛాంపియన్లుగా ఉన్న భారత జట్టు ఇలా వరుసగా రెండు సిరీస్ లలో వైట్ వాష్ అవమానం ఎదుర్కొంటుందని ఎవ్వరూ అనుకోలేదు. పోనీ వన్డే సిరీస్ లోనైనా గాడిన పడతారా అంటే అదీ జరగలేదు. తొలి వన్డే గెలిచి సిరీస్ పై ఆశలు రేకెత్తించిన టీమిండియా తర్వాత వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోయి సిరీస్ ను సమర్పించుకుంది.
ఫలితంగా యూకే టూర్ లో 10 మ్యాచ్ లకు గానూ కేవలం ఒకే ఒక్క విజయాన్ని అందుకుని చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. ఈ టూర్ ముగిసిన నాలుగు రోజుల్లోనే భారత జట్టు జింబాబ్వేతో టీ20 సిరీస్ కు రెడీ అయింది.స్వదేశం నుంచి పలువురు యువ ఆటగాళ్లు తాత్కాలిక కోచ్ లక్ష్మణ్ తో కలిసి జింబాబ్వేలో ల్యాండ్ అయ్యారు. అటు వన్డే జట్టులో ఉన్న కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, అర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్ వంటి ప్లేయర్స్ లండన్ నుంచి నేరుగా హరారేకు బయలుదేరారు. నిజం చెప్పాలంటే ఈ సిరీస్ కెప్టెన్ గా శ్రేయాస్ గా అగ్నిపరీక్ష కానుంది. ప్రస్తుత పరిస్థితుల్లో జింబాబ్వేను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఇటీవలే బంగ్లాదేశ్ ను ఓడించిన ఆ జట్టు స్వదేశంలో బలమైనదే. పైగా టీ20 ఫార్మాట్ లో ఏ జట్టునూ తక్కువ అంచనా వేయలేం.
ఈ విషయం ఇటీవలే ఐర్లాండ్ జట్టు కూడా క్రికెట్ ప్రపంచానికి రుజువు చేసింది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో టీ20 సిరీస్ హోరాహోరీగా సాగుతుందని అంచనా. కాగా రెగ్యులర్ కోచ్ గౌతమ్ గంభీర్ అందుబాటులో లేకపోవడంతో,వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా జట్టును నడిపించనున్నారు. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూ, ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేసిన పలువురు కొత్త ఆటగాళ్లకు ఈ సిరీస్‌లో చోటు దక్కింది.అటు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్, తన సారథ్యంలో తొలి సిరీస్ విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ ఛాలెంజ్ కానుంది. హర్ష్ దూబే, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ లాంటి ప్లేయర్స్ అంతర్జాతీయ స్థాయిలో ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది.