సినిమా ఇండస్ట్రీలో అందం ఒకెత్తయితే, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల్లో గట్టిగా ముద్ర వేయడం మరొక ఎత్తు. సరిగ్గా ఇదే బాటలో ప్రయాణిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అదాశర్మ. 'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, ఆ తర్వాత రకరకాల ప్రయోగాత్మక పాత్రలతో అలరిస్తున్న ఈ భామ.. ఇండస్ట్రీ తీరుతెన్నులపై చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
సౌత్ లేదా నార్త్.. ఏ ఇండస్ట్రీలో చూసినా హీరోయిన్లకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు ఎక్కువగా వస్తున్నాయా? అని అడిగిన ప్రశ్నకు అదాశర్మ చాలా ప్రాక్టికల్‌గా సమాధానమిచ్చారు.
కథ బాగుంటే అది ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇండస్ట్రీ చిన్నదా, పెద్దదా అనేది కాకుండా అక్కడ ఎలాంటి సబ్జెక్ట్స్ రాసుకుంటున్నారు అనేదే ముఖ్యం" అని ఆమె స్పష్టం చేశారు.ప్రస్తుతం హిందీ, తెలుగు భాషలతో పాటు మార్వాడీ చిత్ర పరిశ్రమలో కూడా ఆమె నటిస్తున్నారు. ప్రతి ఇండస్ట్రీ తన నటనా పరిధిని పెంచే మంచి పాత్రలనే అందించిందని ఆమె చాలా గర్వంగా చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో పెద్ద అవకాశాలు రావడం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని అదాశర్మ ఓపెన్‌గా మాట్లాడారు. నటిగా ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ విజయం ఎంత కీలకమో ఆమె వివరించారు.
"మన ఖాతాలో ఒక మంచి సినిమా హిట్ అయ్యాక మాత్రమే ఇండస్ట్రీకి మన నటనపై, మార్కెట్‌పై నమ్మకం పెరుగుతుంది. ఆ ఒక్క విజయం సాధించిన తర్వాతే పెద్ద మేకర్స్ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లతో మన దగ్గరకు వస్తారు. ఇది నా సొంత అనుభవంతో తెలుసుకున్న నిజం!"
ఒక హిట్ సినిమా పడిన తర్వాతే, రిస్క్ అనిపించే సవాలుతో కూడిన విభిన్నమైన పాత్రలు నటీమణులను వెతుక్కుంటూ వస్తాయని ఆమె వెల్లడించారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రతి ఇండస్ట్రీలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు అదాశర్మ. వరుస ప్రయోగాలతో అలరిస్తున్న ఆమె, రాబోయే రోజుల్లో ఎలాంటి విజయాలు అందుకుంటారో చూడాలి.