విక్టరీ వెంకటేష్ సినిమా వస్తోందంటేనే థియేటర్లలో నవ్వుల పూవులు పూస్తాయి. కుటుంబ సమేతంగా హాయిగా కూర్చొని నవ్వుకోవడానికి వెంకీ మామ సినిమాలను మించిన ఆప్షన్ ఉండదు. ఇక అలాంటి వెంకటేష్‌కి, తన మాటలతో మాయ చేసే ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ తోడైతే ఎలా ఉంటుంది? ఆలోచిస్తేనే కిక్కు వస్తుంది కదూ..వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నెం. 47’. ఈ సినిమాకు సంబంధించి తాజాగా రిలీజైన ఒక చిన్న అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా టీమ్ వెంకటేష్ పాత్రను పరిచయం చేస్తూ ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఇందులో మన వెంకీ మామ ‘చిట్టిబాబు’ అనే సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. పేరు వినడానికి చాలా సింపుల్‌గా, సరదాగా ఉంది కదూ! ఈ క్యారెక్టర్‌లో ఆయన మార్క్ కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్ పుష్కలంగా ఉండబోతున్నాయని ఆ వీడియో చూస్తేనే అర్థమవుతోంది.
ఇక ఈ సినిమాలో ఆయన సరసన కథానాయికగా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ‘కేజీఎఫ్’ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి, వెంకటేష్ జోడీగా నటించడం చాలా ఆసక్తికరంగా మారింది. వీరిద్దరి కెమిస్ట్రీ వెండితెరపై ఎలా ఉండబోతుందో చూడాలని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో మరో పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే... వైవిధ్యమైన కథలను ఎంచుకునే నారా రోహిత్ కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. వెంకటేష్, నారా రోహిత్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా సరదాగా, అదే సమయంలో డ్రామాతో కూడి ఉంటాయని టాక్. త్రివిక్రమ్ మార్క్ టైమింగ్‌తో వీరిద్దరి కాంబినేషన్ సీన్లు థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది. త్రివిక్రమ్ సినిమా అంటేనే కేవలం హాస్యమే కాదు... నవ్వుల వెనుక ఒక మంచి కుటుంబ బంధం, వినసొంపైన డైలాగులు ఉంటాయి.
‘ఆదర్శ కుటుంబం’ అనే టైటిల్ చూస్తుంటేనే ఇది ప్రతీ ఒక్కరి ఇంట్లో జరిగే కథలా, ప్రతీ కుటుంబానికి దగ్గరయ్యేలా ఉంటుందని పిస్తోంది.
ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు ఎక్కడా తగ్గకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను అక్టోబర్ 2న విజయదశమి కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. పండుగ రోజుల్లో కుటుంబంతో కలిసి హాయిగా థియేటర్‌కు వెళ్లి నవ్వుకోవడానికి ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నెం. 47’ ఒక పర్ఫెక్ట్ సినిమా కాబోతోంది. వెంకీ మామ మార్క్ టైమింగ్, త్రివిక్రమ్ పవర్ ఫుల్ డైలాగ్స్ కలసి ఈ దసరాకి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తాయో చూడాలి.