ప్రపంచ క్రికెట్లో సరికొత్త శకానికి తెరతీసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతీ సీజన్‌కూ లీగ్ వాల్యూ పెరుగుతూనే ఉంది. తాజాగా ఐపీఎల్ అరుదైన మైలురాయి చేరుకుంది. లీగ్ విలువ 1,91,000 కోట్లు దాటిపోయింది.యూఎస్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ హౌలిహాన్ లోకీ 20 26 ఐపీఎల్ వాల్యుయేషన్ స్టడీ ఈ నివేదిక వెల్లడించింది. 2023లో 15.4 బిలియన్ డా లర్లుగా ఉన్న ఐపీఎల్ బ్రాండ్ విలువ 2024 లో 16.4 బిలియన్ డాలర్లు,2025లో 18.5 బిలియన్ డాలర్లకు పెరిగి, ఇప్పుడు 20.6 బిలియన్ డాలర్లను చేరుకుంది. లీగ్ స్వతంత్ర బ్రాండ్ విలువ 10.3 శాతం పెరిగి 41వేల 177 కోట్లకు చేరింది.
ఇక అధికారిక బ్రాడ్‌కాస్టర్ జియో హాట్‌స్టార్ లెక్కల ప్రకారం 2026 ఐపీఎల్ సీజన్‌కు 106 కోట్ల వీక్షణలు నమోదయ్యాయి. గతేడాదితో పోల్చుకుంటే 7 శాతం వ్యూయర్ షిప్ పెరిగింది. మీడియా హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు, టికెట్ విక్రయాలతో కలిపి 2026 సీజన్ ఆదాయం 1.8 బిలియన్ డాలర్లను దాటే అవకాశం ఉందని అంచనా వేసింది.ఇదిలా ఉంటే లీగ్ చరిత్రలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అరుదైన ఘనత సాధించింది. 300 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువ దాటిన తొలి ఐపీఎల్ ఫ్రాంచైజీగా నిలిచింది. ఆర్సీబీ బ్రాండ్ విలువ 16 శాతం పెరిగి 312 మిలియన్ డాలర్లకు చేరింది.
2025లో తొలిసారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచిన బెంగళూరు జట్టు బ్రాండ్ విలువ భారత కరెన్సీలో సుమారు 2575 కోట్లు కాగా... ఈసారి టైటిల్ నిలబెట్టుకున్న ఫ్రాంచైజీ 16 శాతం వృద్ధితో బ్రాండ్ విలువను 2987 కోట్లకు పెంచుకుంది. ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్ 2529 కోట్లతో రెండో స్థానంలో ఉంది. మూడుసార్లు ఐపీఎల్ టైటిల్ నెగ్గిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 2347 కోట్లతో మూడో స్థానంలో, ఐదుసార్లు ఐపీఎల్ విజేత చెన్నై సూపర్ కింగ్స్ 2337 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నాయి. ఈ సీజన్ ఆరంభానికి ముందే ఆదిత్య బిర్లా గ్రూప్, బ్లాక్‌స్టోన్, బోల్డ్వెంచర్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌లతో కూడిన కన్సార్టియం 17 వేల కోట్లకు ఆర్సీబీ జట్టును సొంతం చేసుకుంది.