వైసిపి అధినేత , మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఇసుక వేస్తే రాలనంత మంది జనం వస్తారు. అసలు ఈ జన ప్రవాహాన్ని చూస్తే.... వీళ్లేనా వైసిపి నీ 11 సీట్లకి తొక్కిపడేసారు? అని అనిపిస్తుంది. జగన్ చుట్టూ ఉన్న జనాన్ని చూసి.... టిడిపి జనసేన లకు ఎక్కడో ఏదో గుబులు రాకుండా మానదు. ఇక ఎల్లో మీడియా పరిస్థితి అయితే ఇంకా దారుణం. జగన్ కి వస్తున్న జనాన్ని చూపించను లేరు... అలాగని రాలేదని చెప్పలేరు. జగన్ కోసం వచ్చిన జనం అంతా పెయిడ్ అని ,లంపెన్ గ్రూప్స్ అని, రకరకాలుగా విశ్లేషణలు ఇవ్వడానికి ఎల్లో జర్నలిస్టులు నానా తంటాలు పడుతున్నారు. సరే అదంతా పక్కన పెడితే....అసలు వీళ్లంతా వైసీపీకి ఓట్లేసే జనమేనా? లేక తరలిస్తే వస్తున్నారా? ఇంత ప్రజాభిమానం ఉంటే 2024 లో జగన్ ఎందుకు ఓడిపోతాడు? ఇది చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న.
జగన్ కి జనం రావడం కొత్త ఏమి కాదు. 2011 నుంచి జగన్ ఎక్కడుంటే అక్కడ జనం ఉంటారు. అసలు అన్ని వేలమంది జనం జగన్ ని చూడడానికి ఎందుకు వస్తారు? ఎలా వస్తారు? వీళ్ళని తరలిస్తూ ఉంటారా? ప్రతిసారి, ప్రతి చోటికి జనాన్ని తరలించడం సాధ్యమేనా? అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకదు.జగన్ని చూడడానికి వచ్చిన జనం అంతా వైసిపికి ఓట్లు వేస్తే.... జగన్ అనే వాడికి ఓటమి ఉండదు. మరి 2014, 2024లో వైసీపీ ఎందుకు ఓడిపోయింది? అందుకే పరామర్శలకి, ఓదార్పులకి, జగన్ వచ్చినప్పుడు కదిలి వచ్చే జనం అంతా ఓటర్లు కాదు. వాళ్లు వైసిపికి ఓటు వేసే వాళ్ళు కాదు. అందువల్ల వాపు చూసి బలుపు అనుకుంటే రాజకీయ అంచనాలన్నీ బొక్క బోర్లా పడతాయి.2024 ఎన్నికలకు ముందు వైసిపి సిద్ధం సభలను నిర్వహించేది. ఒక్కొక్క సభకి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని అప్పట్లో టాక్. వాటికి లక్షల్లో జనం వచ్చినట్లు, టీవీల్లో అబ్బురంగా కనిపించే విజువల్ చూస్తే వైసీపీకి వై నాట్ 175 గ్యారెంటీ అనిపించేది. సీన్ కట్ చేస్తే 11 సీట్లు తో ఆ పార్టీకి బొమ్మ చూపించారు జనం. ఇప్పుడు కూడా అదే సీన్ కనిపిస్తోంది.
విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం వెళ్లడానికి ఏడు గంటల ప్రయాణం చేసే జగన్.... తన రోడ్ షోలో వేలాది మంది జనాన్ని పలకరించుకుంటూ వెళ్తారు. అలాగే దేవరపల్లిలో పొగాకు రైతుల పరిస్థితిని తెలుసుకోవడానికి వెళ్తే... అక్కడికి వచ్చిన జనాన్ని చూసి ప్రత్యర్థుల గుండెలు లబలబా కొట్టుకుంటాయి. కానీ ఈ జనమంతా ఓట్లుగా మారతారా అనే డౌటు టిడిపికే కాదు వైసిపి కూడా ఉంది. ఏపీలో వైసీపీకి 40 శాతం ఓట్ బ్యాంకు ఉంది. దానిలో ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీలు మైనారిటీలే. జగన్ సభలకు తరలివచ్చే వాళ్లు కూడా ఎక్కువగా వాళ్లే. ఎప్పటికీ బీసీలు టిడిపి తోనే ర్యాలీ అవుతున్నారు. ఇక మధ్యతరగతి, ఆపై మధ్యతరగతి ప్రజలు నూటికి నూరు శాతం టీడీపీ తోనే ఉంటారు. ప్రధానంగా వాళ్లు అభివృద్ధి, ఉద్యోగాలు, రోడ్లు, ఎయిర్పోర్ట్లు, ఇవే చూస్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే కచ్చితంగా కన్స్ట్రక్టివ్ గ్రోత్ ఉంటుందని భావిస్తారు. మరి వీళ్లంతా టిడిపి తో ఉన్నప్పుడు జగన్ దగ్గరికి వస్తున్న వాళ్ళు ఎవరు....? అని పరిశీలిస్తే సహజంగానే జగన్ పర్యటనలో ఎక్కువమంది గ్రామీణ ప్రజలు, ఎస్సీలు, మైనారిటీలు ఉంటారు. జగన్ ఓటు బ్యాంకు కూడా అదే.
అయితే అదే 40% పై ఆధారపడి జగన్ రాజకీయం చేసినంత కాలం ఆయన ఓటు బ్యాంకు పెరగదు. అంటే ఇవాళ జగన్ ఎక్కడికి వెళ్ళినా పరిగెత్తుకుంటూ వేలల్లో జనం వస్తున్నారంటే ఆ జనం అంతా నూటికి నూరు శాతం వైసీపీకి ఓటు వేసే వాళ్ళని కచ్చితంగా చెప్పలేం. అంతవరకు ఎందుకు మొన్నటికి మొన్న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి వచ్చిన జనం చూసి చంద్రబాబు ఆహా బలం ఇది కదా అని మురిసిపోయారు. తీరా సభ పూర్తి కాకుండానే జనం మజ్జిగ ప్యాకెట్లు, ఉప్మా పొట్లాలు కోసం కొట్టుకున్నారు. ఎయిర్పోర్ట్ ప్రాంగణంలోని మొక్కలని పీక్కొని పోయారు. అందువల్ల సభలకి, పర్యటనలకి జనం వచ్చినంత మాత్రాన వాళ్లు మన ఓటర్లు అని ఏ పార్టీ అయినా అనుకుంటే ఆ పార్టీ ఘోరంగా దెబ్బ తినేసినట్లే.
24 ఎన్నికలకు ముందు సిద్ధం సభలను చూసుకొని జగన్ ఇలాగే మురిసిపోయి దారుణంగా దెబ్బతిన్నాడు. అందువల్ల సభలకి వచ్చిన జనం అందరూ మనకే ఓటేస్తారనే భ్రమల్లో ఉంటే వైసీపీ మరోసారి మునిగిపోవడం ఖాయం. చంద్రబాబు ప్రభుత్వంలో ఎక్కువమంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు గానీ, ఓవరాల్ గా చంద్రబాబు పెర్ఫార్మెన్స్ పైన జనంలో అసంతృప్తి లేదు.76 ఏళ్ల వయసులో బాబు పనితీరుకి ప్రత్యర్థులు కూడా శభాష్ అనకుండా ఉండరు.అంతేకాదు కూటమిలో మూడు పార్టీలు ప్రస్తుతానికి కలిసికట్టుగానే ఉన్నాయి. విడిపోతే చెడిపోతామని ఆ మూడు పార్టీలకు తెలుసు. కనుక వైసీపీకి ఇప్పుడు కనిపిస్తున్నది వాపే గాని బలుపు కాదు. జగన్ను చూడ్డానికి తరలివచ్చే జనం అంతా వైసీపీకే ఓటు వేస్తారని భావిస్తే అంతకన్నా భ్రమ మరొకటి ఉండదు.