క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ ఒకప్పుడు అజేయమైన శక్తి. 1970 నుండి 1990ల ప్రారంభం వరకు ప్రపంచ క్రికెట్‌ను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన జట్టు ఏదైనా ఉందంటే అది కరేబియన్ టీం మాత్రమే. అలాంటి విండీస్ జట్టు ఇప్పుడు పాతాళానికి పడిపోయింది. 2023 వన్డే వరల్డ్ కప్ కు అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్ ఈ సారి కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. తాజాగా 2027 వన్డే ప్రపంచ కప్‌కు డైరెక్ట్ క్వాలిఫికేషన్ సాధించలేకపోయింది. అఫ్గానిస్తాన్ జట్టు నేరుగా క్వాలిఫై కావడంతో విండీస్ ఆటోమేటిక్ బెర్త్‌ను కోల్పోయింది. ఇప్పుడు ఆ జట్టు ప్రపంచ కప్‌లో ఆడాలంటే క్వాలిఫైయర్ టోర్నీ ఆడాలి.
ఆతిథ్య జట్లు దక్షిణాఫ్రికా, జింబాబ్వే కాకుండా సెప్టెంబర్ 30 నాటి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-8లో నిలిచిన జట్లకు నేరుగా ప్రపంచ కప్‌లో చోటు లభిస్తుంది.అఫ్గానిస్తాన్ జట్టు టాప్-8 స్థానాన్ని ఖరారు చేసుకోవడం, ప్రస్తుతం వెస్టిండీస్ 10వ స్థానంలో ఉండటంతో విండీస్ జట్టుకు ఆటోమేటిక్ అర్హత అవకాశం కోల్పోయింది. సెప్టెంబర్‌లో భారత్‌తో జరగనున్న చివరి రెండు వన్డే మ్యాచ్‌ల్లో గెలిచినా వెస్టిండీస్ ర్యాంకింగ్స్‌లో టాప్-8లోకి వెళ్లే అవకాశం లేదు.వెస్టిండీస్ జట్టు 2027 ఫిబ్రవరిలో జరిగే కఠినమైన ఐసీసీ ప్రపంచకప్ క్వాలిఫైయర్ టోర్నీలో పాల్గొంటుంది.ఈ క్వాలిఫైయర్‌లో ఐర్లాండ్, లీగ్-2 జట్లు, ప్లే-ఆఫ్స్ నుంచి వచ్చే ఇతర జట్లతో విండీస్ తలపడనుంది.
ఈ క్వాలిఫైయర్ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేసి టాప్ స్థానాల్లో నిలిస్తేనే వెస్టిండీస్ జట్టు 2027 వన్డే ప్రపంచ కప్ ప్రధాన టోర్నీకి అర్హత సాధిస్తుంది.2023 ప్రపంచ కప్‌కు కూడా వెస్టిండీస్ నేరుగా అర్హత సాధించలేక క్వాలిఫయర్స్‌కు వెళ్లింది. అయితే అక్కడా విఫలమై తొలిసారి ప్రపంచ కప్‌కు దూరమైంది. అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అర్హత సాధించలేకపోయింది. ఇప్పుడు 2027 ప్రపంచ కప్ బెర్త్ కోసం మరోసారి క్వాలిఫయర్ మార్గాన్నే నమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.