Top story:అలెర్ట్: భారత్ కు భారీగా వరద నేపాల్ ప్రళయం.. భారత్‌కు ముప్పు నారాయణి-గండక్ నదుల భయంకర రహస్యం.!

నేపాల్ రసువా జిల్లాలోని భోటే కోషి నదిలో ఒక్కసారిగా మంచు, బురద గోడలు బద్దలై వచ్చిన హఠాత్ ప్రళయం వందలాది మందిని బలితీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే ఆ అందమైన హిమాలయ లోయలు.

Post Published By: dialnews
Updated : 28 August 2026, 4:00 PM IST

నేపాల్ రసువా జిల్లాలోని భోటే కోషి నదిలో ఒక్కసారిగా మంచు, బురద గోడలు బద్దలై వచ్చిన హఠాత్ ప్రళయం వందలాది మందిని బలితీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే ఆ అందమైన హిమాలయ లోయలు.. కేవలం కొన్ని నిమిషాల్లోనే శ్మశాన వాటికలుగా మారిపోయాయి. ఇప్పటివరకు అందిన అధికారిక లెక్కల ప్రకారం ఈ ఘోర విపత్తులో 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది పర్యాటకులు గల్లంతయ్యారు. ఇందులో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏంటంటే, గల్లంతైన వారిలో 133 మంది భారతీయ పర్యాటకులు ఉన్నారు.

అయితే ఈ విపత్తు అంతటితో ఆగలేదు, నేపాల్ సరిహద్దుకు దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశంలోని రెండు పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్‌లను ఇప్పుడు ఈ ప్రళయ నీరు వణికించేస్తోంది. సరిహద్దు గ్రామాల్లోని ప్రజలను రాత్రికి రాత్రే ఖాళీ చేయిస్తూ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. అసలు నేపాల్‌లో వరద వస్తే ఇండియా ఎందుకు మునిగిపోతోంది? దీని వెనుక ఉన్న జాగ్రఫికల్ కనెక్షన్ ఏంటి? ఈ మొత్తం ఆందోళనకు అసలు కారణం నేపాల్, భారత్‌ల మధ్య ఉన్న ‘నారాయణి-గండక్’ నదీ అనుసంధానం.

నేపాల్‌లో ఏ నది ఉప్పొంగినా ఆ నీరంతా సహజంగానే ప్రవహిస్తూ కింద ఉన్న భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. టిబెట్‌లో పుట్టి నేపాల్ గుండా ప్రవహించే భోటే కోషి నది నీరంతా త్రిశూలి నదిలోకి చేరుతుంది. ఈ త్రిశూలి నది ముందుకు సాగి నేపాల్‌లో అత్యంత పెద్దదైన ‘నారాయణి నది’గా మారుతుంది. సరిగ్గా ఇదే నది భారత సరిహద్దు దాటి బీహార్ మరియు ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించినప్పుడు దీనిని మనం పవిత్ర ‘గండక్ నది’ అని పిలుచుకుంటాం. అంటే నేపాల్ ఎగువన పడిన ప్రతి నీటి చుక్కా కింద ఉన్న మన గండక్ నదిలోకి రావడం ప్రకృతి నియమం.

ఇప్పుడు నేపాల్ కొండల్లో బద్దలైన కోట్లాది లీటర్ల నీరు, బురద అంతా ఈ నారాయణి-గండక్ మార్గం ద్వారానే భారత్‌ వైపు ముంచెత్తుతోంది. ఈ అసాధారణ రాక్షస ప్రవాహాన్ని తట్టుకోవడానికి బీహార్ ప్రభుత్వం సరిహద్దులోని వాల్మీకినగర్ వద్ద ఉన్న గండక్ బారేజ్ కు సంబంధించిన అన్ని 36 గేట్లను అత్యంత అత్యవసరంగా, దశలవారీగా పూర్తిగా ఎత్తివేసింది. సాధారణంగా ఈ బారేజ్ నుండి కొన్ని వేల క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదలవుతుంది.

కానీ బుధవారం సాయంత్రానికి వాల్మీకినగర్ బారేజ్ వద్ద నీటి విడుదల ఏకంగా 1,06,000 క్యూసెక్కులకు చేరుకుంది. ఈ ప్రవాహం గురువారం ఉదయానికి ఏకంగా 3,00,000 క్యూసెక్కులు దాటిపోతుందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఈ నీటిని ఆపడానికి ప్రయత్నిస్తే బారేజ్ కొట్టుకుపోయే ప్రమాదం ఉంది, అందుకే 8,50,000 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న ఆ బారేజ్ గేట్లన్నింటినీ తెరిచి నీటిని కిందికి వదిలేస్తున్నారు. దీనివల్ల నదీ పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు గ్రామాలు జలమయమయ్యే ప్రమాదం పొంచి ఉంది.

ఈ ఊహించని నీటి ఉధృతి కారణంగా బీహార్ ప్రభుత్వం ఐదు కీలక జిల్లాలలో అత్యవసర ఖాళీలను ప్రారంభించింది. పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, గోపాల్‌గంజ్, సుపాల్ మరియు ముజఫర్‌పూర్ జిల్లాల్లోని నది ఒడ్డున ఉన్న వేలాది గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా నేపాల్ సరిహద్దుల్లోని మహారాజ్‌గంజ్, కుశీనగర్ జిల్లాల అధికారులను హై అలర్ట్‌లో ఉండాలని ఆదేశించారు.

ఎందుకంటే గండక్ నదితో పాటు నేపాల్‌లో ఉన్న బారేజ్ గేట్లు తెరవడం వల్ల ఘాగ్రా, రాప్తి నదులు కూడా ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లోని చమోలి వంటి సరిహద్దు జిల్లాలను సైతం విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. హిమాలయ నదుల్లో భూకంపాలు లేదా హిమసరస్సుల ఉప్పెన వల్ల ఇలాంటి ఆకస్మిక వరదలు రావడం కొత్తేమీ కాదు. అంతర్జాతీయ పర్వత పరిశోధనా సంస్థ 'ఇసిమోడ్' నివేదికల ప్రకారం, 1950 నుండి ఇప్పటివరకు హిమాలయాల ఎగువ ప్రాంతాలలో నేపాల్, భారత్, చైనాల సరిహద్దుల్లో దాదాపు 1,015 కి పైగా ఇలాంటి భారీ వరద సంఘటనలు నమోదయ్యాయి.

గ్లోబల్ వార్మింగ్ పెరిగే కొద్దీ ఈ ప్రమాదాల తీవ్రత మరింత ఎక్కువవుతోంది. నేపాల్‌లో జరిగే పర్యావరణ మార్పులు నేరుగా భారతదేశంలోని కోట్లాది మంది ప్రజల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయనడానికి ఈ నారాయణి-గండక్ నదుల ప్రళయమే ఒక పెద్ద ఉదాహరణ. ప్రకృతి సృష్టించిన ఈ విపత్తును ఎదుర్కొంటూ, అటు నేపాల్‌కు సహాయం అందిస్తూనే, ఇటు దేశంలోని ప్రజలను కాపాడుకోవడానికి భారత ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది.

Published : 
  • 28 August 2026, 4:00 PM IST