రాజమండ్రిలో సంచలనం రేపిన కల్తీ పాల వ్యవహారంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఇథలిన్ గ్లైకాల్ అనే కెమికల్ కలవడంతోనే పాలు కల్తీ జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు అధికారులు. కేవలం ఇప్పుడు అనారోగ్యానికి గురైన వారే కాకుండా చుట్టుపక్కల వేరే ప్రాంతాల్లో కూడా గణేష్ పాలు పోయడంతో బాధితుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు పోలీసులు.
రాజమండ్రిలో పాల కల్తీకి ఇథలిన్ గ్లైకాల్ అనే కెమికల్ కారణమ ప్రాథమికంగా నిర్ధారించారు. పాలను స్టోర్ చేసే ఫ్రిడ్జ్‌లో ఈ కెమికల్‌ను కూలెంట్‌గా ఉపయోగిస్తారు. ఆ ఫ్రిడ్జ్‌లో పైప్ లీకేజ్ కారణంగా పాలలో ఈ కెమికల్ కలిసినట్టు అనుమానిస్తున్నారు. ఇలా మొత్తం 40 లీటర్ల పాలు కల్తీ అయినట్టు చెప్తున్నారు పోలీసులు. విచారణ ముగిసిన తరువాత దీని గురించి పూర్తి వివరాలు బయటికి వచ్చే ఛాన్స్ ఉంది. గణేష్ మొత్తం 106 కుటుంబాలకు పాలు పోస్తుండగా.. ప్రస్తుతం 80 కుటుంబాల వారికి రక్త పరీక్షలు నిర్వహించారు.
గణేష్ కోరుకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన వ్యక్తి కావడంతో.. పశుసంవర్ధక శాఖ అధికారులు ఆ పరిసర ప్రాంతాల్లో 46 పాడిపశువుల నుంచి రక్త నమూనాలు సేకరించి వాటిని టెస్ట్‌లకు పంపారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరించిన పాలు, పెరుగు తదితర ఉత్పత్తుల శాంపిల్స్‌ను హైదరాబాద్, విశాఖపట్నంలోని ల్యాబ్స్‌కు పంపారు. గణేష్ ఎవరెవరికి పాలు పోశాడనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దివాన్‌చెరువులోని బీజాపురికాలనీ వాసులకు కూడా పాలు పోసినట్టు గుర్తించారు. దీంతో బాధితులు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
గణేష్ ఐదేళ్లుగా పాల వ్యాపారం చేస్తున్నాడు. శివరాత్రి నుంచే పాలు తేడా వచ్చినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. ఆ రోజు పాల అమ్మకాలు ఎక్కువగా ఉండడం వల్ల ఏదైనా కలిపి ఉండొచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. దివాన్‌చెరువులోని కుయ్యేటి ఛాయశ్రీ కూడా గత సోమవారం అస్వస్థతకు గురై మూడు ఆస్పత్రులు తిరిగి.. చివరికి ఈ నెల 20న చనిపోయినట్టు ఆమె భర్త మురళీకృష్ణ తెలిపారు. లాలాచెరువులోని స్వరూ్‌పనగర్, చౌడేశ్వరనగర్ బాధితులు కూడా ఈనెల 16 నుంచి అంటే శివరాత్రి మరుసటి నుంచే అస్వస్థతనకు గురయ్యారు. లాలాచెరువుకు చెందిన ఎన్.శేషగిరిరావు, రాధాకృష్ణమూర్తి, తాడి కృష్ణవేణి, తాడి రమణి కల్తీ పాల నేపథ్యంలో ఆక్యూట్ రీనాల్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయినట్టు నిర్ధారించారు.
కల్తీ పాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం చంద్రబాబు చెప్పారు. అసెంబ్లీ ఈ విషయం ప్రస్తావించారు. బాధిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అస్వస్థతతో ఆస్పత్రిపాలైన వారి వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఈ కల్తీకి కారణమైన వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.