హగ్గులు, కిస్సులు.. 60ల్లో అవసరమా నరేష్ గారు.. మైక్ చేతిలో ఉంది కదా అని నోరు జారితే..!

టాలీవుడ్ ఈవెంట్స్ అంటే ఒకప్పుడు సినిమా ముచ్చట్లు, ఆసక్తికరమైన విశేషాలు మాత్రమే వినిపించేవి. కానీ ఈ మధ్యకాలంలో సినిమా ప్రమోషన్స్ కంటే, స్టేజ్ మీద నటులు మాట్లాడే మాటలే ఎక్కువ వైరల్ అవుతున్నాయి.

Post Published By: dialnews
Updated : 13 February 2026, 7:45 PM IST

టాలీవుడ్ ఈవెంట్స్ అంటే ఒకప్పుడు సినిమా ముచ్చట్లు, ఆసక్తికరమైన విశేషాలు మాత్రమే వినిపించేవి. కానీ ఈ మధ్యకాలంలో సినిమా ప్రమోషన్స్ కంటే, స్టేజ్ మీద నటులు మాట్లాడే మాటలే ఎక్కువ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ నటులు సరదా కోసం చేసే వ్యాఖ్యలు లేదా నీతులు చెప్పే క్రమంలో వాడే పదజాలం తరచూ వివాదాలకు కేంద్రబిందువు అవుతోంది. తాజాగా హే భగవాన్ ప్రెస్‌మీట్‌లో సీనియర్ నరేష్ చేసిన వ్యాఖ్యలు, అంతకుముందు దండోరా ఈవెంట్‌లో శివాజీ మాట్లాడిన మాటలు ఇందుకు తాజా ఉదాహరణలు. ఉద్దేశం ఏదైనప్పటికీ అది జనాల్లోకి వెళ్తున్న విధానం మాత్రం వేరేలా ఉంటోంది. మొన్నటికి మొన్న శివాజీ దండోరా సినిమా ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడుతూ కాస్త నోరు జారారు. డోస్ పెంచేసి అసభ్య పదజాలం మాట్లాడాడు. ఇప్పుడు నరేష్ కూడా కాస్త ఓవర్ యాక్షన్ చేసాడనేది ఓ వర్గం వాదన.

హే భగవాన్ ఈవెంట్‌లో నరేష్ మాట్లాడుతూ.. హీరోయిన్లను హగ్ చేసుకునే అవకాశం లేకుండా చీరలు కట్టుకొచ్చారని, ప్రస్తుత పరిస్థితుల వల్ల చీరల్లోనే కనిపిస్తున్నారని కామెంట్ చేశారు. పరిశ్రమలో జరుగుతున్న కొన్ని పరిణామాల వల్ల అమ్మాయిలు జాగ్రత్తగా ఉంటున్నారని చెప్పడం ఆయన ఉద్దేశం కావచ్చు. కానీ చీర కట్టుకుంటేనే పద్ధతి, హగ్గులకు భయపడే ఇలా వచ్చారు అనే కోణంలో ఆయన మాట్లాడిన విధానం చాలా మందికి రుచించలేదు. అది ఆడవారి భద్రతను వారి దుస్తులకు ఆపాదించినట్లుగా ఉండటంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక తాజాగా నరేష్ చేసిన కామెంట్స్ అయితే సెటైర్‌లా అనిపించినా, అందులోనూ అసౌకర్యం కలిగించే అంశాలున్నాయనేది నెటిజన్ల మాట. స్టేజ్ మీద భారతీయత కనిపిస్తోంది, అందరూ పద్ధతిగా ఉన్నారు అంటూనే.. హగ్ డే, కిస్ డే ప్రస్తావన తెచ్చి, ఎవరిని హగ్ చేసుకోవాలో వాళ్లనే చేశా అని నరేష్ అనడం చర్చనీయాంశమైంది.

శివాజీ వ్యాఖ్యలకు కౌంటర్‌గానో లేదా తాజా ట్రెండ్‌పై సెటైర్‌గానో ఆయన ఈ మాటలు అని ఉండొచ్చు. కానీ పబ్లిక్ ఈవెంట్స్‌లో, ముఖ్యంగా లేడీస్ ఉన్న వేదికపై ఇలాంటి డబుల్ మీనింగ్ ధోరణి లేదా వెటకారం అవసరమా అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. అసలు సమస్య ఎక్కడుందంటే.. మన స్టార్స్ ఉద్దేశం మంచిదే అయి ఉండొచ్చు. కానీ వాళ్ళ మాటతీరు మాత్రం తప్పుతోంది. నవ్విద్దామని కొందరు, సీరియస్‌గా సొసైటీకి మెసేజ్ ఇద్దామని కొందరు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ క్రమంలో వాడే భాష, బాడీ లాంగ్వేజ్ మాత్రం ఈ తరం ఆడియన్స్‌కి క్రింజ్ అనిపిస్తోంది. ఒకప్పుడు ఇలాంటి మాటలను మాస్ కామెడీ అని సరిపెట్టుకునేవారు. కానీ ఇప్పుడు ప్రతి మాటా రికార్డ్ అవుతోంది, ప్రతి ఎక్స్‌ప్రెషన్ మీమ్ అవుతోంది.

ఏ ఉద్దేశంతో అన్నా సరే, ఎదుటివారిని ఇబ్బంది పెట్టేలా లేదా కించపరిచేలా ఉన్నప్పుడు అది కచ్చితంగా తప్పే అవుతుంది. చివరగా చెప్పాలంటే.. ఇది 2026.. ఆడియన్స్ ఆలోచనా విధానం, సెన్సిబిలిటీస్ పూర్తిగా మారిపోయాయి. ఏం చెప్పాలనుకున్నా ఎవరినీ నొప్పించకుండా చెప్పడం చాలా ముఖ్యం. సీనియర్ నటులు తమ అనుభవంతో స్టేజ్ మీద హుందాగా వ్యవహరించాలే తప్ప, ఇలాంటి కాంట్రవర్సీలతో వార్తల్లో నిలవడం వారి స్థాయికి తగదు. మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడేస్తే.. సోషల్ మీడియా కోర్టులో తీర్పులు చాలా వేగంగా, ఘాటుగా వస్తాయని మన స్టార్స్ గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది.

Published : 
  • 13 February 2026, 7:45 PM IST