సినీ పరిశ్రమలో గ్లామర్ ప్రపంచానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఇద్దరు నటీమణులు సిల్క్ స్మిత, షకీలా. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధంపై సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా సిల్క్ స్మిత, షకీలాను షూటింగ్ సెట్లో కొట్టిందనే ప్రచారం ఇండస్ట్రీలో దశాబ్దాలుగా వినిపిస్తోంది. తాజాగా ఈ రూమర్లపై నటి షకీలా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ ఆసక్తికరమైన నిజాలను బయటపెట్టారు. అసలు ఆ రోజు షూటింగ్ సెట్లో ఏం జరిగిందో వివరిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్లో వైరల్‌గా మారాయి. తనను సిల్క్ స్మిత కొట్టిందనే ప్రచారంలో నిజముందని షకీలా అంగీకరించారు. అయితే అది చాలా మంది అనుకుంటున్నట్లు చెంపదెబ్బ కాదని, సీన్లో భాగంగా కాలితో తన్నడమని ఆమె స్పష్టం చేశారు. తన కెరీర్ ఆరంభంలో ఒక సినిమాలో సిల్క్ స్మిత హీరోయిన్గా నటిస్తుంటే, షకీలా ఆమెకు సోదరి పాత్ర చేశారట.
ఆ సినిమాలోని ఒక సీన్ ప్రకారం సిల్క్ స్మిత, షకీలాను కాలితో తన్నాల్సి ఉంది. అయితే ఆ షాట్లో సిల్క్ స్మిత నిజంగానే చాలా గట్టిగా తన్నడంతో షకీలాకు విపరీతమైన నొప్పి వేసింది. దాంతో తట్టుకోలేక షూటింగ్ సెట్లోనే, డైరెక్టర్ ముందే కళ్లల్లో నీళ్లు తిరిగి అక్కడే ఏడ్చేసినట్లు షకీలా ఆనాటి చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ షాట్ పూర్తయిన తర్వాత సిల్క్ స్మిత ప్రవర్తనలో ఒక్కసారిగా మార్పు వచ్చిందని షకీలా చెప్పారు. "నేను ఏడవడం చూసి సిల్క్ స్మిత వెంటనే నా దగ్గరకు వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకుంది. ఆ తర్వాత నన్ను పక్కకు పిలిచి ఎంతో సున్నితమైన స్వరంతో వివరణ ఇచ్చింది" అని షకీలా వెల్లడించారు. నువ్వు కేవలం టవల్ మాత్రమే కట్టుకుని ఉన్నావు. ఇలాంటి సీన్లు నీకు కొత్త. ఒకవేళ దెబ్బ సరిగ్గా పడకపోతే డైరెక్టర్ మళ్లీ మళ్లీ రీటేకులు తీసుకుంటాడు. అందరి ముందు నువ్వు ఇబ్బంది పడకూడదనే, ఒకే ఒక్క షాట్లో ఈ సీన్ ఓకే అవ్వాలని నేను గట్టిగా తన్నాను" అని చెప్పినట్లు షకీలా పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆ సమయంలో షకీలాకు లోదుస్తుల విషయంలో కొన్ని విలువైన సలహాలు ఇచ్చి సిల్క్ స్మిత ఎంతో సహాయం కూడా చేసిందట.
సిల్క్ స్మిత ఆ రోజు అంతటి వివరణ ఇచ్చినప్పటికీ, ఆ దెబ్బ షకీలాకు బాగా తగలడం వల్ల ఆమె మనసులో ఆ పెయిన్ అలాగే ఉండిపోయింది. సిల్క్ స్మిత చెప్పిన సమాధానం తనకు ఇప్పటికీ పూర్తిగా సంతృప్తిని ఇవ్వలేదని షకీలా నిర్మొహమాటంగా చెప్పారు. రీటేకులు పడకూడదనే ఉద్దేశంతోనే అలా చేసినా.. అంత గట్టిగా తన్నడం అవసరమా అనే భావన ఆమెలో ఇప్పటికీ ఉంది. సిల్క్ స్మిత బతికుంటే తనకు ఈ స్థాయి స్టార్డమ్ వచ్చేది కాదని షకీలా సంచలన వ్యాఖ్య చేశారు. అయితే తామిద్దరం ఎప్పుడూ ప్రత్యర్థులం కాదని ఆమె స్పష్టం చేశారు. 1998లో సిల్క్ స్మిత ఆకస్మికంగా మరణించిన తర్వాతే టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమలలో షకీలాకు విపరీతమైన క్రేజ్ మరియు స్టార్డమ్ వచ్చాయని ఆమె పేర్కొన్నారు.మొత్తానికి సిల్క్ స్మిత కరుకుతనానికి వెనుక ఒక నటిగా ఆమెకున్న ప్రొఫెషనలిజం, తోటి నటిపై ఉన్న శ్రద్ధ దాగి ఉన్నాయని షకీలా మాటలను బట్టి అర్థమవుతోంది. ప్రస్తుతం షకీలా చేసిన ఈ వ్యాఖ్యలు ఇటు సిల్క్ స్మిత అభిమానులను, అటు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.