తెలుగు సినీ చరిత్రలో గ్రాఫిక్స్ విప్లవానికి నాంది పలికిన అద్భుత చిత్రం 'అమ్మోరు'. నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి రాజీపడకుండా దాదాపు మూడున్నరేళ్ల పాటు శ్రమించి ఈ ప్రాజెక్ట్‌ను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా కోసం ఏకంగా 400 రోజులకు పైగా షూటింగ్ జరపడం ఒక విశేషం. ఎందుకంటే, ఈ చిత్రాన్ని ఇద్దరు దర్శకులతో రెండుసార్లు రూపొందించారు! మొదట వై. రామారావు దర్శకత్వంలో ప్రారంభమైనప్పటికీ, ఆవుట్-పుట్ నచ్చకపోవడంతో కోడి రామకృష్ణగారికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు.
ఇక నటీనటుల విషయానికి వస్తే, సౌందర్య ఈ సినిమా కోసం ఏకంగా 180 రోజులు పనిచేయగా, ఆమె తీసుకున్న పారితోషికం కేవలం 40 వేల రూపాయలు మాత్రమే కావడం గమనార్హం. సౌందర్య కెరీర్‌లో 3వ సినిమాగా మొదలైన 'అమ్మోరు', విడుదలైయ్యేసరికి ఆమె 27వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లండన్ నుండి విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడు క్రిస్ స్టాన్‌లీ హోమ్స్‌ను రప్పించి, ఒక ఏడాది పాటు శ్యాంప్రసాద్ రెడ్డి ఇంట్లోనే ఉంచి గ్రాఫిక్స్ డిజైన్ చేయించారు. నవంబర్ 23, 1995న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పూనకాలు తెప్పించడమే కాకుండా హిందీ, తమిళ్, మలయాళంతో పాటు పలు భాషల్లో ఘనవిజయం సాధించింది.