యూ ట్యూబ్‌లో ఆ పాటకు 1600 కోట్ల వ్యూస్.. ప్రపంచ జనాభా కంటే రెండు రెట్లు చూసారు తెలుసా..?

యూట్యూబ్ సామ్రాజ్యంలో సరికొత్త చరిత్ర లిఖించబడింది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఊపేసిన బేబీ షార్క్ డాన్స్ వీడియో ఏకంగా 16 బిలియన్ల వ్యూస్ అంటే 1600 కోట్లు మైలురాయిని దాటి అగ్రస్థానంలో నిలిచింది.

Post Published By: dialnews
Updated : 14 February 2026, 8:15 PM IST

యూట్యూబ్ సామ్రాజ్యంలో సరికొత్త చరిత్ర లిఖించబడింది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఊపేసిన బేబీ షార్క్ డాన్స్ వీడియో ఏకంగా 16 బిలియన్ల వ్యూస్ అంటే 1600 కోట్లు మైలురాయిని దాటి అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ జనాభా సుమారు 8 బిలియన్లు అనుకుంటే.. దానికి రెట్టింపు సంఖ్యలో ఈ వీడియోను వీక్షించడం ఒక అరుదైన రికార్డు. 2016లో పింక్‌ఫాంగ్ అనే కొరియన్ కంపెనీ అప్లోడ్ చేసిన ఈ వీడియో.. తన ఆకర్షణీయమైన ట్యూన్, విజువల్స్‌తో యూట్యూబ్ కింగ్‌గా అవతరించింది. బేబీ షార్క్ దరిదాపుల్లో కూడా ఇతర వీడియోలు లేకపోవడం గమనార్హం. ఒకప్పుడు ప్రపంచాన్ని ఊపేసిన లూయిస్ ఫోన్సీ డెస్పాసిటో 8.9 బిలియన్ల వ్యూస్‌తో రెండో స్థానంలో కొనసాగుతోంది. అంటే మొదటి స్థానానికి, రెండో స్థానానికి మధ్య దాదాపు 7 బిలియన్ల వ్యూస్ అంతరం ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో పిల్లల రైమ్స్ అయిన వీల్స్ ఆన్ ద బస్ 8.5 బిలియన్లు అంటే 850 కోట్ల వ్యూస్.. బాత్ సాంగ్ 7.5 బిలియన్లు అంటే 750 కోట్ల వ్యూస్‌తో నిలిచాయి.

టాప్ లిస్టును గమనిస్తే మ్యూజిక్ వీడియోల కంటే పిల్లల కంటెంట్ హవానే ఎక్కువగా కనిపిస్తోంది. మన చిన్నప్పుడు విన్న, మన పిల్లలకు నేర్పించే జానీ జానీ ఎస్ పాపా రైమ్ కూడా టాప్ చార్టులో ఉండటం విశేషం. ఈ వీడియో 7.1 బిలియన్ల వ్యూస్ సాధించి, డిజిటల్ యుగంలో నర్సరీ రైమ్స్ పవర్ ఏంటో నిరూపిస్తోంది. ఇక పెద్దల పాటల విషయానికి వస్తే ఎడ్ షీరన్ షేప్ ఆఫ్ యూ, విజ్ ఖలీఫా సీ యు అగైన్.. యూట్యూబ్ తొలి వైరల్ హిట్ గంగ్నమ్ స్టైల్ కూడా బిలియన్ల వ్యూస్‌తో తమ క్రేజ్ ఇంకా తగ్గలేదని నిరూపించుకుంటున్నాయి. ఈ మొత్తం జాబితాలో అత్యంత ఆశ్చర్యకరమైన, భారతీయులకు గర్వకారణమైన విషయం ఒకటి ఉంది. అదే శ్రీ హనుమాన్ చాలీసాకు వచ్చిన వ్యూస్.

టి-సిరీస్ సంస్థ అప్లోడ్ చేసిన హరిహరన్ పాడిన ఈ భక్తి గీతం ఏకంగా 5.1 బిలియన్ల వ్యూస్ సాధించింది. అంటే అక్షరాలా 510 కోట్ల వ్యూస్ అన్నమాట. గ్లోబల్ పాప్ సాంగ్స్, కిడ్స్ కంటెంట్ ఆధిపత్యం ఉన్న యూట్యూబ్‌లో.. భక్తి పాట ఈ స్థాయి ఆదరణ పొందడం డిజిటల్ భక్తికి నిదర్శనం. యూట్యూబ్‌లో అత్యధికంగా వీక్షించబడిన భక్తి వీడియోగా ఇది రికార్డు సృష్టించింది. ఈ గణాంకాలను లోతుగా విశ్లేషిస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. యూట్యూబ్‌లో కిడ్స్ కంటెంట్‌దే పైచేయి. పిల్లలు ఒకే వీడియోను పదే పదే చూడటం, తల్లిదండ్రులు పిల్లలను ఎంగేజ్ చేయడానికి యూట్యూబ్‌పై ఆధారపడటం ఇందుకు ప్రధాన కారణాలు. అందుకే టాప్ 10 జాబితాలో సగానికి పైగా వీడియోలు రైమ్స్ లేదా పిల్లల పాటలే ఉన్నాయి. రాబోయే కాలంలో కూడా ఎడ్యుకేషనల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కిడ్స్ వీడియోలే యూట్యూబ్ రికార్డులను శాసించే అవకాశం ఉంది.

Published : 
  • 14 February 2026, 8:15 PM IST