ఎలాన్ మస్క్ Vs క్రిస్టఫర్ నోలన్.. ది ఒడిస్సీ కాస్టింగ్ కార్చిచ్చు.. అసలేం జరిగింది..?

హాలీవుడ్ అండ్ సిలికాన్ వ్యాలీ మధ్య ఒక ఊహించని క్రాస్‌ఓవర్ యుద్ధం ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్, హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్ మధ్య మాటల యుద్ధం మొదలైంది.

Post Published By: dialnews
Updated : 3 February 2026, 6:00 PM IST

హాలీవుడ్ అండ్ సిలికాన్ వ్యాలీ మధ్య ఒక ఊహించని క్రాస్‌ఓవర్ యుద్ధం ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్, హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. నోలన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న తదుపరి చిత్రం ది ఒడిస్సీ ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారింది. గ్రీకు పురాణాల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో అత్యంత అందగత్తెగా భావించే హెలెన్ ఆఫ్ ట్రాయ్ పాత్ర కోసం ఆస్కార్ విజేత లుపిటా న్యోంగోను పరిశీలిస్తున్నారనే వార్తలే ఈ అగ్గి రాజేశాయి. రెండు వేర్వేరు రంగాలకు చెందిన దిగ్గజాలు ఒక సినిమా కాస్టింగ్ విషయంలో తలపడటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ వార్తలపై ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించాడు. పౌరాణిక, చారిత్రక పాత్రలను ఎంచుకునేటప్పుడు మూల కథలోని వర్ణనలకు కట్టుబడి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డాడు.

ఒకవేళ నోలన్ నిజంగానే హెలెన్ పాత్రకు లుపిటాను ఎంచుకుంటే, అది ఆయన తన క్రియేటివ్ ఇంటిగ్రేటీని కోల్పోవడమే అవుతుంది అంటూ మస్క్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఆధునిక రాజకీయ ధోరణులకు తలొగ్గి.. అసలైన చరిత్రను లేదా పురాణ వర్ణనలను మార్చకూడదని మస్క్ పరోక్షంగా హెచ్చరించాడు. మస్క్ వ్యాఖ్యలతో ఇంటర్నెట్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఒక వర్గం మస్క్ వాదనను సమర్థిస్తుంటే.. మరో వర్గం నోలన్‌కు అండగా నిలిచింది. సినిమా అనేది ఒక కళ, అది చరిత్ర పాఠం చెప్పే పుస్తకం కాదు అంటూ నోలన్ అభిమానులు, పలువురు విశ్లేషకులు మస్క్‌కు కౌంటర్ ఇస్తున్నారు. క్రిస్టఫర్ నోలన్ వంటి దర్శకుడికి తనకు నచ్చిన రీతిలో కథను చెప్పే పూర్తి స్వేచ్ఛ ఉంటుందని.. లుపిటా న్యోంగో వంటి అద్భుతమైన నటిని కేవలం బాడీ కలర్ కారణంగా పక్కన పెట్టలేమని వాళ్ళు వాదిస్తున్నారు. ఈ వివాదం ఇప్పుడు ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ వర్సెస్ హిస్టారికల్ ఆక్యూరసీ అనే చర్చకు దారితీసింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ కాస్టింగ్ గొడవంతా కేవలం రూమర్స్ ఆధారంగానే జరుగుతోంది. ఇప్పటివరకు సినిమా యూనిట్ నుంచి గానీ, నోలన్ నుంచి గానీ లుపిటా న్యోంగో కాస్టింగ్‌పై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర అయిన ఒడిసియస్ గా ప్రముఖ నటుడు మ్యాట్ డేమన్ నటిస్తున్న విషయం మాత్రమే ఖరారైంది. అధికారికంగా ధృవీకరించని ఒక వార్తపై మస్క్ వంటి స్థాయి వ్యక్తి స్పందించడం.. దానికి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగడం హాలీవుడ్‌లో అరుదుగా జరిగే పరిణామం. ఈ వివాదం ఎలా ఉన్నా ది ఒడిస్సీ సినిమాపై మాత్రం అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 2026లో విడుదల కానున్న ఈ చిత్రంపై ఇప్పుడు అందరి కళ్ళూ పడ్డాయి. ఏడాది ముందే దీనికి టికెట్స్ ఓపెన్ చేశారు మేకర్స్. మస్క్ విమర్శలు సినిమాకు నెగటివ్ పబ్లిసిటీ తెస్తాయా లేక హైప్ పెంచుతాయా అనేది పక్కన పెడితే.. నోలన్ ఈ వివాదంపై ఎలా స్పందిస్తాడో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పురాణ గాథను నోలన్ తన స్క్రీన్ ప్లే మ్యాజిక్‌తో ఎలా చూపిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అప్పటి వరకు ఈ మస్క్ Vs నోలన్ వార్ సోషల్ మీడియాలో కొనసాగుతూనే ఉంటుంది.

Published : 
  • 3 February 2026, 6:00 PM IST