పెళ్ళి వద్దు పిల్లలు ముద్దు…!

టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి నిత్యా మీనన్. కేవలం అందంతోనే కాకుండా, అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ మల్టీటాలెంటెడ్ బ్యూటీ,

Post Published By: dialnews
Updated : 30 April 2026, 10:55 AM IST

టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి నిత్యా మీనన్. కేవలం అందంతోనే కాకుండా, అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ మల్టీటాలెంటెడ్ బ్యూటీ, ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. అయితే ఈసారి ఆమె సినిమాల వల్ల కాకుండా, పెళ్లి మరియు మాతృత్వంపై చేసిన బోల్డ్ కామెంట్స్ వల్ల సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా సెలబ్రిటీలు పెళ్లి, పిల్లల వంటి వ్యక్తిగత విషయాలపై మాట్లాడటానికి కాస్త సంకోచిస్తారు. కానీ నిత్యా మీనన్ మాత్రం ఎక్కడా తడబడకుండా తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, మాతృత్వం గురించి మాట్లాడుతూ.. "పిల్లలను కనాలని అనుకోవడం అనేది పూర్తిగా ఒక వ్యక్తిగత నిర్ణయం. దానికి వివాహం అనేది తప్పనిసరి కాదు" అని స్పష్టం చేసింది.

సాంప్రదాయాలకు భిన్నంగా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. పిల్లల కోసం పెళ్లి ఒక్కటే మార్గం కాదని, ఆధునిక కాలంలో అందుబాటులో ఉన్న సైంటిఫిక్ పద్ధతుల ద్వారా కూడా తల్లి కావొచ్చని ఆమె పేర్కొంది. నిత్యా మీనన్ చేసిన మరో కీలక వ్యాఖ్య ఏమిటంటే, ఒక మహిళకు తన శరీరంపై, తన జీవితంపై పూర్తి హక్కు ఉంటుందని. సమాజం నిర్ణయించిన కట్టుబాట్ల ప్రకారం కాకుండా, తన మనసుకి నచ్చినట్లుగా జీవించే స్వేచ్ఛ ప్రతి మహిళకు ఉండాలని ఆమె అభిప్రాయపడింది. ముఖ్యంగా పిల్లలను కనడం వంటి సున్నితమైన విషయాల్లో ఇతరుల ప్రమేయం లేదా సామాజిక ఒత్తిడి ఉండకూడదని ఆమె గట్టిగా వాదించింది. నటిగా ఇప్పటికే ఎన్నో విజయాలను అందుకున్న నిత్యా, ఇప్పుడు నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. "కేయూరీ ప్రొడక్షన్స్" అనే బ్యానర్‌ను ప్రారంభించి, సినిమాల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. నటనతో పాటు వెబ్ సిరీస్‌లలో కూడా రాణిస్తున్న ఆమె, ఈ కొత్త ప్రయాణంతో తన కెరీర్‌లో మరో మెట్టు ఎక్కిందని చెప్పవచ్చు.

'అలా మొదలైంది'తో మొదలైన ఆమె ప్రయాణం, 'ఇష్క్', 'గుండె జారి గల్లంతయ్యిందే', 'భీమ్లా నాయక్' వంటి హిట్ చిత్రాల మీదుగా సాగుతూ.. ఇప్పుడు ఒక పవర్ ఫుల్ ఉమెన్ ఐకాన్‌గా మారుతోంది. నిత్య చెప్పింది నూటికి నూరు శాతం నిజమని, ఒక మహిళ మాతృత్వాన్ని పొందేందుకు పెళ్లి చేసుకోవాలనే నిబంధన అవసరం లేదని, ఆమె ధైర్యాన్ని అభినందిస్తున్నారు కొందరు నెటిజన్లు. మరోవైపు కొందరు విమర్శకులు, మన సంస్కృతి, సాంప్రదాయాలకు ఇటువంటి వ్యాఖ్యలు విరుద్ధమని, సెలబ్రిటీలు సమాజంపై ప్రభావం చూపిస్తారని, కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలని సూచిస్తున్నారు. ఏది ఏమైనా, నిత్యా మీనన్ తన మనసులోని మాటను ధైర్యంగా చెప్పడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. పాత చింతకాయ పచ్చడి లాంటి ఆలోచనలను పక్కన పెట్టి, ఆధునిక దృక్పథంతో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు నేటి తరం మహిళల్లో సరికొత్త ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు ఎప్పుడూ చర్చనీయాంశాలే అయినా, నిత్యా మీనన్ తన స్టైల్‌లో ఇచ్చిన ఈ 'షాకింగ్' స్టేట్‌మెంట్ మాత్రం చాలా కాలం పాటు ఇండస్ట్రీలో వైరల్ అయ్యేలా కనిపిస్తోంది.

Published : 
  • 30 April 2026, 10:55 AM IST