టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల. ‘మల్లేశం’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ‘వకీల్ సాబ్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, వరుస సినిమాలతో దూసుకుపోతోంది. గ్లామర్ పాత్రలకైనా, వైవిధ్యమైన నటనకైనా సై అంటూ బిజీగా గడుపుతున్న అనన్య, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ మరియు వ్యక్తిగత జీవితం గురించి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన లైఫ్‌లో ఎదుర్కొన్న ఒక లవ్ బ్రేకప్, దాని వల్ల తను పడ్డ నరకం గురించి ఆమె ఓపెన్ అయిపోయింది.
ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన అనన్య నాగళ్ల చదువులో ఎప్పుడూ టాపర్. బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఐటీ దిగ్గజం ‘ఇన్ఫోసిస్’ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కొన్నాళ్ల పాటు పనిచేశారు. అయితే, చిన్నప్పటి నుంచి నటనపై ఉన్న విపరీతమైన ఆసక్తితో మొదట షార్ట్ ఫిలిమ్స్ వైపు అడుగులు వేశారు. ఆ తర్వాత ‘మల్లేశం’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆపై ప్లే బ్యాక్, వకీల్ సాబ్, మ్యాస్ట్రో, ఊర్వశివో రాక్షసివో, శాకుంతలం, మళ్లీ పెళ్లి, అన్వేషి, తంత్ర, డార్లింగ్, పొట్టేల్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ వంటి ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి మెప్పించారు.
చాలా మంది అమ్మాయిలు ప్రేమకు సంబంధించిన విషయాల వల్లే ఎక్కువగా బాధపడతారు. నా విషయంలో కూడా అదే జరిగింది. నేను ఒక వ్యక్తిని ప్రాణం కంటే ఎక్కువగా, చాలా బాగా నమ్మాను. కానీ అతను నన్ను తీవ్రంగా మోసం చేశాడు. ఇది కేవలం ఏదో లవ్ బ్రేకప్, లవ్ ఫెయిల్యూర్ అని నేను తేలికగా చెప్పలేను. ఎందుకంటే ఆ నమ్మకద్రోహం నన్ను అంతగా కుంగదీసింది." అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అనన్య ఆవేదన వ్యక్తం చేశారు.
చాలా మందికి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. కొందరు రెండు మూడు నెలల్లో కోలుకుంటారు. కానీ నేను ఆ బ్రేకప్ తాలూకూ బాధను, ఆ నరకాన్ని ఏకంగా మూడేళ్ల పాటు అనుభవించాను." అని తెలిపారు. రాత్రంతా ఏడుస్తూ కూర్చునేదాన్ని. ఉదయం నిద్ర లేవగానే మళ్లీ అవే ఆలోచనలు వెంటాడేవి. ఎంత బిజీగా ఉన్నా ఆ జ్ఞాపకాలు నన్ను వదిలేవి కావు. కానీ ఆ బాధ నా కెరీర్‌ను దెబ్బతీయకుండా చూసుకున్నాను. షూటింగ్స్‌కు మాత్రం అస్సలు మిస్ అయ్యేదాన్ని కాదు." రాత్రంతా ఏడ్చి, తెల్లవారగానే ఏమీ ఎరుగనట్టు జిమ్‌కి వెళ్ళిపోయేదాన్ని. షూటింగ్ స్పాట్‌లో నా షాట్ వచ్చే వరకు కారవాన్‌లోనే కూర్చుని గుండె పగిలేలా వెక్కి వెక్కి ఏడ్చేదాన్ని. మళ్లీ షాట్ అనగానే కళ్లు తుడుచుకుని, మేకప్ వేసుకుని నా పని నేను చేసుకునేదాన్ని." అంటూ షూటింగ్ రోజుల్లో తను పడ్డ మానసిక సంఘర్షణను అనన్య బయటపెట్టారు. ఇంటర్వ్యూలో అనన్య కంటెంట్ క్రియేటర్స్, మీమ్స్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"సోషల్ మీడియాలో అమ్మాయిలు చాలా సెన్సిటివ్ అని, అబ్బాయిలను వదిలేసి వెళ్లిపోతారని ఎన్నో మీమ్స్ వస్తుంటాయి. ఎన్నో మాటలు అంటారు. ఎందుకంటే సోషల్ మీడియాలో అబ్బాయిలు ఎక్కువగా ఉండటం, కంటెంట్ క్రియేటర్స్ కూడా వాళ్లే ఎక్కువగా ఉండటం వల్ల ఎప్పుడూ అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే బయటకు వస్తుంది. కానీ అమ్మాయిలు కూడా ఎంతలా మోసపోతారో, ఎంత బాధపడతారో అనే అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడా బయటకు రావడం లేదు" అని అనన్య పేర్కొన్నారు. వ్యక్తిగత జీవితంతో పాటు కెరీర్ పరంగా చిన్న సినిమాలు చేయడం ఎంత కష్టమో కూడా అనన్య వివరించారు. "ఒక మంచి స్క్రిప్ట్‌ను ఎంచుకోవడం, యాక్టింగ్ చేయడం.. ఆ సినిమాను రిలీజ్ వరకు తీసుకురావడం చాలా కష్టం.
ఎందుకంటే నేను చేసేవన్నీ చాలా చిన్న సినిమాలు. ఒకవేళ కష్టపడి రిలీజ్ వరకు తీసుకొచ్చినప్పటికీ.. దాన్ని ప్రమోషన్ చేయడం, జనాళ్లకు రీచ్ అయ్యేలా చేయడం చాలా టఫ్. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా కనీసం ప్రజలు ఒక రిజల్ట్ ఇవ్వడానికైనా థియేటర్లలోకి రావాలి కదా? కానీ చిన్న సినిమాలకు ఆ రిలీజ్ అవకాశమే రానప్పుడు చాలా పెయిన్ ఫుల్‌గా ఉంటుంది. అందుకే ప్రేక్షకులు మా కష్టాన్ని చూడాలని, ఆ ప్రమోషన్స్ బాధ్యతను నా భుజాల మీద వేసుకుంటాను" అని చెప్పారు. ఏదేమైనా, జీవితంలో ఎంతో కష్టమైన బ్రేకప్ ఫేజ్‌ను అనుభవిస్తూనే, ప్రొఫెషనల్ లైఫ్‌ను సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేసిన అనన్య నాగళ్ల ధైర్యాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.