ప్రేమ, పెళ్లి, బంధం.. ఈ పదాలకు ఒక్కొక్కరు ఒక్కో రకమైన నిర్వచనం ఇస్తుంటారు. కొందరు నిరంతరం కలిసుండటమే ప్రేమ అనుకుంటే, మరికొందరు ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేయడమే గొప్ప బంధం అనుకుంటారు. అయితే, ప్రముఖ నటి యామీ గౌతమ్ మాత్రం తన వైవాహిక జీవితం గురించి, ఒక ఆరోగ్యకరమైన బంధం ఎలా ఉండాలి అనే దాని గురించి చాలా స్పష్టమైన, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "ప్రేమలో అన్నిటికంటే ముఖ్యమైన అంశం పరస్పర గౌరవం" అని ఆమె నొక్కి చెప్పారు. సాధారణంగా దంపతులు అంటే ఎప్పుడూ ఒకే పని చేస్తూ, ఒకరి అభిరుచులను మరొకరు బలవంతంగా అలవర్చుకోవాలని చాలామంది భావిస్తుంటారు. కానీ యామీ గౌతమ్ దీనికి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
నా భర్త ఒక గదిలో కూర్చుని క్రికెట్ చూస్తూ ఉండొచ్చు.. నేను మరో గదిలో నా పనిలో నిమగ్నమై ఉండొచ్చు. ఇందులో తప్పు ఏమీ లేదు. ఒకే ఇంట్లో ఉంటూ కూడా మా మా వ్యక్తిగత ఇష్టాలను గౌరవించుకుంటూ వేర్వేరు పనులు చేసుకోవడం మా బంధానికి ఉన్న బలం అని ఆమె చెప్పేది ఏంటంటే.. భాగస్వామికి వారి సొంత సమయం ఇవ్వడం అనేది బంధాన్ని మరింత దృఢం చేస్తుంది. ఒకరిపై ఒకరు ఆధారపడటం కంటే, ఒకరి స్వతంత్రతను మరొకరు గౌరవించడం చాలా ముఖ్యం అని. జీవితం అంటే కేవలం నవ్వులే కాదు, కష్టాలు కూడా ఉంటాయి. యామీ గౌతమ్ ఈ విషయాన్ని చాలా పరిణతితో చెప్పారు. "ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు ఉంటాయి. ఒడిదుడుకులు లేని ప్రయాణం అంటూ ఏదీ ఉండదు. కానీ, రోజు చివరలో మనకు ఒక 'ఇల్లు' ఉందని, అక్కడ మన కోసం ఎదురుచూసే వ్యక్తి ఉన్నారని గుర్తుంచుకోవాలి.
ఎంత పెద్ద సమస్య ఎదురైనా, బయట ప్రపంచంలో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా.. ఇంటికి వెళ్ళాక భాగస్వామితో మనసు విప్పి మాట్లాడితే ఆ భారమంతా తగ్గిపోతుందని ఆమె అభిప్రాయపడ్డారు. నేటి కాలంలో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల విడిపోతున్న జంటలకు ఇది ఒక అద్భుతమైన సలహా. మరో అద్భుతమైన పాయింట్ ఏంటంటే.. ఒకరి ఎదుగుదలను చూసి మరొకరు గర్వపడటం. "మేము ఒకరికొకరం బిగ్గెస్ట్ చీర్ లీడర్స్" అని యామీ చెప్పుకొచ్చారు.భాగస్వామి విజయం సాధించినప్పుడు సంతోషించడం.వారు ఓడిపోయినప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించడం.ఎవరూ నమ్మకపోయినా, ఒకరి సామర్థ్యాన్ని మరొకరు గుర్తించడం.ఇవే ఒక బంధాన్ని అందంగా మారుస్తాయి. యామీ గౌతమ్, దర్శకుడు ఆదిత్య ధర్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ తమ ప్రొఫెషనల్ లైఫ్ ని, పర్సనల్ లైఫ్ ని ఎంత బ్యాలెన్స్డ్ గా లీడ్ చేస్తున్నారో ఈ మాటలు వింటే అర్థమవుతుంది.