గత 3 దశాబ్దాలుగా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్‌లు ఏకచత్రాధిపత్యంతో ఏలారు. రొమాన్స్, మాస్ యాక్షన్, వైవిధ్యమైన కథలతో ఈ ముగ్గురు తమకంటూ తిరుగులేని బ్రాండ్ ఇమేజ్‌ను సృష్టించుకున్నారు. అయితే ఇప్పుడు ఆ శకం మారుతోంది. ఈ ఖాన్ త్రయం సృష్టించిన వారసత్వాన్ని అందిపుచ్చుకుని, దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే సత్తా ఎవరికి ఉందనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఈ రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు రణబీర్ కపూర్, రణవీర్ సింగ్. మరి రాబోయే దశాబ్దంలో బాలీవుడ్ బాద్‌షాగా ఎవరు నిలుస్తారు.. రణబీర్ కపూర్ కెరీర్‌ను గమనిస్తే అతని బలం నటనలోని లోతు.
రాక్‌స్టార్, బర్ఫీ, సంజు.. ఇటీవలి యానిమల్ వంటి చిత్రాలు అతనిలోని అద్భుతమైన నటుడిని ఆవిష్కరించాయి. రణబీర్ ఎంచుకునే పాత్రలు ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడమే కాకుండా.. అవి కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోతాయి. కెరీర్ ఆరంభంలో సినిమాల మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకోవడం, కొన్ని ప్రయోగాలు విఫలమవడం వంటి చిన్నపాటి లోపాలు ఉన్నప్పటికీ, అతని సినిమాలకు ఉండే రీవాచ్ వాల్యూ చాలా ఎక్కువ. రణబీర్ సినిమా అంటే ఒక బలమైన ఎమోషనల్ జర్నీ ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతారు. మరోవైపు రణవీర్ సింగ్ అంటేనే ఎనర్జీ, వైవిధ్యం. బాజీరావ్ మస్తానీ, పద్మావత్, గల్లీ బాయ్, 83 వంటి చిత్రాల్లో అతను చూపించిన ట్రాన్స్‌ఫర్మేషన్ అద్భుతం. మాస్, పీరియడ్ డ్రామా, స్పోర్ట్స్, మ్యూజికల్.. ఇలా ఏ జానర్ అయినా అవలీలగా చేయగల సత్తా రణవీర్ సొంతం.
బాక్సాఫీస్ పరంగా చూస్తే రణబీర్ కంటే ఎక్కువ 100 కోట్ల సినిమాలు రణవీర్ ఖాతాలో ఉన్నాయి. ఈయన ఖాతాలో 8 సినిమాలున్నాయి. కానీ స్క్రిప్ట్ సెలెక్షన్‌లో నిలకడ లేకపోవడం.. కొన్నిసార్లు అతిగా అనిపించే నటన అతని కెరీర్‌కు మైనస్‌గా మారుతున్నాయి. రణవీర్ సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనిపించినా.. రణబీర్ సినిమాలకు ఉన్నంత కల్ట్ ఫాలోయింగ్ తక్కువనే చెప్పాలి. ఇక భవిష్యత్తు లైనప్ విషయానికి వస్తే, రణబీర్ కపూర్ చాలా స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నాడు. నితీష్ తివారీ రామాయణం రెండు భాగాలుగా రానుంది, సందీప్ రెడ్డి వంగా యానిమల్ పార్క్, సంజయ్ లీలా భన్సాలీతో లవ్ అండ్ వార్, ప్రతిష్టాత్మక ధూమ్ 4 వంటి భారీ పాన్- ఇండియా ప్రాజెక్టులు రణబీర్ చేతిలో ఉన్నాయి.
రణవీర్ సింగ్ చేతిలో 'ధురంధర్' సిరీస్ వంటి సినిమాలు ఉన్నప్పటికీ.. రణబీర్ లైనప్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించేలా కనిపిస్తోంది. అవార్డుల పరంగా కూడా రణబీర్ 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో రణవీర్ కంటే ముందంజలో ఉన్నాడు. రణవీర్ కు 5 ఫిలింఫేర్ ఉన్నాయి.చివరగా చెప్పాలంటే రణవీర్ సింగ్ తన వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నప్పటికీ.. రణబీర్ కపూర్ తన నటనతో ఒక చెరగని ముద్ర వేస్తున్నాడు. దీర్ఘకాలికంగా చూస్తే కేవలం వైవిధ్యం కంటే.. టైమ్‌లెస్ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చే నటుడికే స్టార్‌డమ్ ఎక్కువ కాలం నిలుస్తుంది. ప్రస్తుత లైనప్, క్రేజ్, నటనలోని పరిణితిని బట్టి చూస్తే.. ఖాన్ల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే రేసులో రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ కంటే ఒక మెట్టు పైనే ఉన్నాడని చెప్పవచ్చు.