ఒకప్పుడు సినిమా అంటే.. షూటింగ్ పూర్తయ్యాక సెన్సార్ బోర్డ్ సభ్యులు సినిమా చూసి, అందులో ఉన్న అభ్యంతరకరమైన సన్నివేశాలకో, డైలాగులకో కత్తెర వేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. సినిమా కథ దాకా వెళ్ళకుండానే, టైటిల్ దగ్గరే వ్యవహారం ఆగిపోతోంది. పోస్టర్ మీద టైటిల్ డిజైన్ కొంచెం తేడాగా అనిపించినా, పేరులో ఏదైనా అభ్యంతరకరమైన అర్థం స్ఫురించినా సెన్సార్ బోర్డ్ అస్సలు ఉపేక్షించడం లేదు. కథతో సంబంధం లేకుండా, టైటిల్ మార్చాల్సిందేనని పట్టుబడుతున్నారు. దీంతో రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న సమయంలో మేకర్స్ చేసేదేం లేక, చివరి నిమిషంలో టైటిల్స్ మార్చుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఇలా టైటిల్ చిక్కుల్లో పడ్డ సినిమాల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. తాజా ఉదాహరణ తీసుకుంటే.. సుహాస్ హీరోగా నటించిన సినిమాకు ముందుగా 'హే భగవాన్' అనే టైటిల్ అనుకున్నారు. కానీ టైటిల్‌లో దేవుడి ప్రస్తావన ఉండటం, అది కొందరి మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందన్న కారణంతో సెన్సార్ బోర్డ్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
దీంతో నిర్మాతలు వెనక్కి తగ్గి, ఆ టైటిల్‌ను 'హే బలవంత్'గా మార్చుకోవాల్సి వచ్చింది. అలాగే మొన్నొచ్చిన 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాకు కూడా టైటిల్ సమస్యే ప్రధాన అడ్డంకిగా మారింది. కేవలం ఆ టైటిల్ కారణంగానే సినిమాకు 'A' సర్టిఫికెట్ జారీ చేశారనేది మేకర్స్ వాదన. కంటెంట్ బాగున్నప్పటికీ, టైటిల్ చూసి అపోహ పడటం వల్ల కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు దూరమయ్యారని, అది సినిమా ఫలితంపై తీవ్ర ప్రభావం చూపిందని ఆ చిత్ర మేకర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక జనవరి 1న విడుదలైన 'వానర' సినిమా విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. 'వానర' అనే పదం ఒక వర్గం వారిని కించపరిచేలా ఉందంటూ అభ్యంతరాలు రావడంతో, చివరికి దాన్ని 'వనవీర'గా మార్చక తప్పలేదు. అయితే, సినిమా ప్రమోషన్ అంతా 'వానర' పేరుతో జరగడం, రిలీజ్ టైంకి పేరు మారిపోవడంతో ఆడియన్స్‌లో కన్ఫ్యూజన్ ఏర్పడింది.
అప్పటికే రిజిస్టర్ అయిన పేరు కాకుండా కొత్త పేరుతో రావడంతో అది సినిమా కలెక్షన్లపై, ఫలితంపై గట్టి దెబ్బే కొట్టింది. టైటిల్ మార్పు అనేది చిన్న విషయం కాదని, అది సినిమా ఐడెంటిటీని ఎలా దెబ్బతీస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణగా నిలిచింది.రాజకీయ కారణాలు, వృత్తిపరమైన అభ్యంతరాలు కూడా టైటిల్స్ మార్పుకు కారణమవుతున్నాయి. త్వరలో రాబోతున్న 'ఛాయ్ వాలా' సినిమా టైటిల్ ఇప్పుడు 'నవాబ్ కేఫ్'గా మారింది. 'ఛాయ్ వాలా' అనే పదానికి రాజకీయంగా వేరే అర్థాలు వస్తాయని, అది వివాదాలకు దారి తీసే అవకాశం ఉందని భావించి టైటిల్ మార్చాల్సిందేనని తేల్చి చెప్పారట. దీంతో మేకర్స్ అయిష్టంగానే 'నవాబ్ కేఫ్'గా మార్చారు. గతంలో విజయ్ డబ్బింగ్ సినిమా 'పోలీసోడు' టైటిల్‌పై అభ్యంతరాలు రావడంతో 'పోలీస్'గా మార్చారు.
అలాగే నాగబాబు నటించిన 'దాదర్ ఎక్స్‌ప్రెస్' టైటిల్ కూడా చివరి నిమిషంలో 'సూపర్ ఎక్స్‌ప్రెస్'గా మారిపోయింది. అన్నింటికంటే ముఖ్యంగా మెగా హీరో వరుణ్ తేజ్ సినిమా విషయంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమాకు ముందుగా 'వాల్మీకి' అనే టైటిల్ పెట్టి, ప్రమోషన్లు కూడా భారీగా చేశారు. కానీ ఒక వర్గం వారి ఆందోళనలు, కోర్టు కేసుల నేపథ్యంలో.. సినిమా విడుదలకి కొన్ని గంటల ముందు టైటిల్‌ను 'గద్దలకొండ గణేష్'గా మార్చాల్సి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే.. సెన్సార్ కత్తెర అనేది ఇప్పుడు రీల్స్ మీద కాకుండా టైటిల్స్ మీద పడుతోంది. కోట్లు ఖర్చు పెట్టి జనం నోళ్లలో ఒక పేరు నానేలా చేశాక, ఆఖరి నిమిషంలో టైటిల్ మార్చాల్సి రావడం నిర్మాతలకు తలకు మించిన భారంగా మారుతోంది.