టాలీవుడ్ సెన్సేషన్, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల పేరు వింటేనే యువతలో ఒక రకమైన పూనకం వస్తుంది. వరుస సినిమాలతో, అగ్ర హీరోల సరసన స్టెప్పులేస్తూ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ క్రేజీ హీరోయిన్గా ఎదిగిపోయింది ఈ బ్యూటీ. అయితే, ఇప్పుడు ఈ ‘పెళ్ళి సందడి’ భామ తన కెరీర్ విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు కేవలం కమర్షియల్ హంగులు, గ్లామర్ పాత్రలకే పరిమితమైన శ్రీలీల, ఇప్పుడు తన రూట్ మార్చి కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టింది.శ్రీలీల అంటే కేవలం డ్యాన్సులు, గ్లామర్ మాత్రమే అనే ముద్ర పడిపోయింది. ఈ ఇమేజ్ తన కెరీర్‌కు లాంగ్ రన్లో ఇబ్బంది కలిగిస్తుందని భావించిన ఈ ముద్దుగుమ్మ, ఇకపై కేవలం అందాల ప్రదర్శనకే కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకోవాలని ఫిక్స్ అయ్యింది. ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ నటిగా తనలోని పూర్తి స్థాయి ప్రతిభను నిరూపించుకోవాలని ఆమె ఆరాటపడుతోంది.
కేవలం భారీ ప్రాజెక్టులే కాకుండా, కథలో బలం ఉండి.. తన పాత్రకు స్కోప్ ఉండే సినిమాలకే ఓటు వేయాలని శ్రీలీల తన టీమ్‌కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కేవలం రెండు పాటలు, నాలుగు సీన్లకే పరిమితం కాకుండా, సినిమాను తన భుజాన మోయగల దమ్మున్న పాత్రల కోసం ఆమె వేచి చూస్తోంది. ఇందులో భాగంగానే పాత పంథాను వీడి, కొత్త తరహా కథాంశాలను వింటున్నట్లు సమాచారం. గత ఏడాది వరుసగా ఐదు ఆరు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన శ్రీలీలకు, ఈ మధ్య కాలంలో తెలుగులో అవకాశాలు కొంచెం తగ్గినట్లు కనిపిస్తోంది. వరుస డిజాస్టర్లు కూడా దీనికి ఒక కారణం కావొచ్చు. అందుకే, ఇప్పుడు తన ఫోకస్‌ను కోలీవుడ్ వైపు మళ్ళించింది. అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి గట్టిగానే ప్లాన్ చేస్తోంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సరసన ఒక క్రేజీ ప్రాజెక్టులో శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమా గనుక హిట్ అయితే, తమిళంలో కూడా శ్రీలీల బిజీ హీరోయిన్ అయిపోవడం ఖాయం. ఒకవైపు తెలుగులో మంచి కథల కోసం చూస్తూనే, మరోవైపు పరభాషా చిత్రాలతో తన మార్కెట్‌ను విస్తరించుకోవాలని ఆమె భావిస్తోంది. శ్రీలీల తీసుకున్న ఈ నిర్ణయం చూస్తుంటే, ఆమె కేవలం ఒక గ్లామర్ హీరోయిన్‌గానే కాకుండా, సౌత్ ఇండియాలో ఒక గొప్ప నటిగా ఎదగాలని కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. నటిగా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలనే ఆమె తపనను చూసి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.