బాలీవుడ్ లో సిచువేషన్స్ మారిపోతున్నాయి. స్టార్ హీరోలకు కూడా బెదిరింపులు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా ముంబై సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని వరుస బెదిరింపులకు పాల్పడుతుండటం ఇండస్ట్రీని కలవరపెడుతోంది. ఒకప్పుడు అండర్ వరల్డ్ డాన్ల నుంచి ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చేవి, ఇప్పుడు కొత్తగా ఈ గ్యాంగ్ పేరు వినిపిస్తేనే స్టార్ హీరోలు ఉలిక్కిపడుతున్నారు. కేవలం బెదిరింపులతో ఆగకుండా.. బాబా సిద్ధిఖీ వంటి ఘటనల తర్వాత ఈ ముఠా హెచ్చరికలను బాలీవుడ్ వర్గాలు సీరియస్‌గా తీసుకుంటున్నాయి. ఇప్పటికే స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ గ్యాంగ్ హిట్ లిస్ట్‌లో ప్రధానంగా ఉన్న సంగతి తెలిసిందే. సల్మాన్‌ను చంపుతామని పలుమార్లు బహిరంగంగానే ప్రకటించిన బిష్ణోయ్ గ్యాంగ్.. ఆయన నివాసం వద్ద రెక్కీ నిర్వహించడం వంటి చర్యలకు పాల్పడింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం సల్మాన్‌కు Y+ కేటగిరీ భద్రతను కల్పించింది.
సల్మాన్ కూడా తన వ్యక్తిగత భద్రత కోసం కోట్లు వెచ్చించి బుల్లెట్ ప్రూఫ్ కారులో తిరుగుతున్నారు. ఆయన చుట్టూ ఇప్పుడు మూడంచెల భద్రత వలయం ఉంటోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్‌కు కూడా తాజాగా బెదిరింపులు వచ్చాయి. రణవీర్ సింగ్ వాట్సాప్ నంబర్‌కు ఒక అజ్ఞాత వ్యక్తి వాయిస్ నోట్ పంపించాడు. అందులో తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తినని చెప్పుకుంటూ, కోట్ల రూపాయల డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ వాయిస్ నోట్‌లో స్పష్టంగా హెచ్చరించినట్లు సమాచారం. ఈ బెదిరింపుతో అప్రమత్తమైన రణవీర్ సింగ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ముంబై పోలీసులను ఆశ్రయించారు. తనకు వచ్చిన వాయిస్ నోట్ ఆధారాలను సమర్పించి అధికారికంగా ఫిర్యాదు చేశారు.
రణవీర్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముందు జాగ్రత్త చర్యగా రణవీర్ సింగ్ ఇంటి బయట భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ కాల్ నిజంగా బిష్ణోయ్ గ్యాంగ్ నుంచే వచ్చిందా లేక ఆ పేరు వాడుకుని ఎవరైనా సైబర్ నేరగాళ్లు చేస్తున్న పనా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తానికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వ్యవహారం బాలీవుడ్ స్టార్ల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మొన్న సల్మాన్ ఖాన్, ఇప్పుడు రణవీర్ సింగ్... ఇలా వరుసగా అగ్ర హీరోలను టార్గెట్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేయడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. స్టార్ హీరోలకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసులు ఈ నెట్‌వర్క్‌ను ఛేదించి, హీరోలకు భరోసా కల్పిస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.