నైజాం డిస్ట్రిబ్యూషన్ లో ఏం జరుగుతుంది.. రంగంలోకి అన్నపూర్ణ స్టూడియోస్ ఎంట్రీ..!

నైజాం డిస్ట్రిబ్యూషన్ లో అన్నపూర్ణ స్టూడియోస్ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇన్నాళ్లు దిల్ రాజు, శిరీష్ రెడ్డిల ఆధ్వర్యంలోని SVC సంస్థదే ఇక్కడ ఏకచక్రాధిపత్యం నడిచింది.

Post Published By: dialnews
Updated : 5 February 2026, 8:07 PM IST

నైజాం డిస్ట్రిబ్యూషన్ లో అన్నపూర్ణ స్టూడియోస్ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇన్నాళ్లు దిల్ రాజు, శిరీష్ రెడ్డిల ఆధ్వర్యంలోని SVC సంస్థదే ఇక్కడ ఏకచక్రాధిపత్యం నడిచింది. దానికి పోటీగా మైత్రీ మూవీ మేకర్స్ వచ్చినా, ఇప్పుడు అన్నపూర్ణ రాకతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. అన్నపూర్ణ రంగంలోకి దిగుతూనే సితార, హారికా హాసిని, సాహూ గారపాటి, SVCC, వైజయంతి మూవీస్ వంటి బడా నిర్మాణ సంస్థల సినిమాలను తమ ఖాతాలో వేసుకుంది. బాలకృష్ణ, బాబీ సినిమా NBK111 నిర్మాత సతీష్ కిలారు కూడా అన్నపూర్ణ వైపే మొగ్గు చూపాడు. గతంలో మైత్రీ వైపు వెళ్లడానికి ఆసక్తి చూపని వీరంతా ఇప్పుడు అన్నపూర్ణ గూటికి చేరడం SVCకి గట్టి దెబ్బే అని చెప్పాలి. నైజాం మార్కెట్‌లో ఇప్పుడు ముగ్గురు ప్లేయర్స్ SVC, మైత్రీ, అన్నపూర్ణ ఉండటం నిర్మాతలకు కలిసొచ్చే అంశం.

పోటీ ఉండటం వల్ల డిస్ట్రిబ్యూషన్ రేట్లు, అడ్వాన్సులు పెరిగే అవకాశం ఉంది. అయితే థియేటర్ల మీద పట్టు విషయంలో SVCని తక్కువ అంచనా వేయలేం. కానీ SVCకి కీలక భాగస్వామిగా ఉన్న సునీల్ నారంగ్ ఇప్పుడు అన్నపూర్ణకు సపోర్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నపూర్ణ వెనుక చాలా మంది నిర్మాతలు ఉండటం, ప్రస్తుతం SVC చేతిలో థియేటర్లకు సరిపడా సినిమాలు లేకపోవడంతో.. థియేటర్ల ఫీడింగ్ కోసం సునీల్ అన్నపూర్ణ వైపు వెళ్లినా ఆశ్చర్యం లేదు. సునీల్, శిరీష్ మధ్య సంబంధాలు బాగానే ఉన్నా, వ్యాపార రీత్యా ఇది అనివార్యం కావచ్చు. వైజాగ్ డిస్ట్రిబ్యూషన్‌లో అన్నపూర్ణకు క్లీన్ ఇమేజ్ ఉంది. గతంలో మైత్రీని తమకు పోటీ సంస్థగా భావించిన నిర్మాతలు, అన్నపూర్ణను మాత్రం సేఫ్ ఆప్షన్‌గా చూస్తున్నారు.

అన్నపూర్ణకు పవర్ గేమ్స్ మీద ఆసక్తి లేకపోవడం, సాఫ్ట్‌గా డీల్ చేయడం నిర్మాతలకు నచ్చుతోంది. అయితే నైజాంలో నిలదొక్కుకోవాలంటే కేవలం మంచితనం సరిపోదు, దూకుడు కావాలి. థియేటర్లను లీజుకు తీసుకోవడం, రినోవేట్ చేయడం లాంటి వాటికి భారీగా ఖర్చు చేయాలి. మైత్రీ సంస్థ ఎంతో కష్టపడితేనే మూడేళ్లలో 39 థియేటర్లను తీసుకోగలిగింది. మరి అన్నపూర్ణకు అంతటి ఆర్థిక స్థోమత, అగ్రెషన్ ఉన్నాయా అనేది చూడాల్సి ఉంది. అయితే అక్కినేని ఫ్యామిలీ మీద గౌరవంతో శిరీష్ రెడ్డి.. మైత్రీ మీద చూపించినంత కోపం అన్నపూర్ణ మీద చూపించకపోవచ్చని ఒక టాక్. ఇక మైత్రీ విషయానికి వస్తే, గత మూడేళ్లలో కొన్ని దెబ్బలు తిన్నా, డబ్బులు స్ట్రక్ అయినా.. నైజాం బాక్సాఫీస్ స్టామినాను పెంచడంలో వారి పాత్ర కీలకం.

SVC హయాంలో కేవలం బాహుబలి-2, RRR మాత్రమే 50 కోట్ల షేర్ దాటగా.. మైత్రీ వచ్చాక సలార్ కు 71 కోట్లు, పుష్ప-2కు 90 కోట్లు, కల్కికు 80 కోట్లు వంటి భారీ వసూళ్లు సాధ్యమయ్యాయి. డిస్ట్రిబ్యూటర్ శశికి మంచి పేరున్నా, రాజాసాబ్ ప్రీమియర్స్ విషయంలో జరిగిన గందరగోళం మైత్రీకి కాస్త మైనస్ అయ్యింది. ఇప్పుడు అన్నపూర్ణ రూపంలో మరో ఆప్షన్ రావడంతో మైత్రీకి పోటీ తప్పదు. కానీ చేతిలో సాలిడ్ సినిమా లైన్-అప్, ఫిక్స్డ్ క్లయింట్స్ ఉండటం వారికి ఊరటనిచ్చే అంశం. మైత్రీ, అన్నపూర్ణ కలిస్తే డిస్ట్రిబ్యూషన్‌లో తిరుగులేని శక్తిగా మారతారని కొందరు విశ్లేషించారు కానీ.. ప్రస్తుతానికి ఆ సూచనలు కనిపించడం లేదు. నైజాం ఆఫీస్ ఓపెనింగ్ విషయంలో మైత్రీ శశికి కనీస సమాచారం లేకపోవడం చూస్తుంటే.. ఈ రెండు సంస్థల మధ్య పొత్తు ఇప్పట్లో లేనట్టే. మొత్తానికి నైజాం బాక్సాఫీస్ గేమ్ ఇప్పుడు రసవత్తరంగా మారింది. SVC, మైత్రీ, అన్నపూర్ణ.. ఈ ముగ్గురి మధ్య పోటీ రాబోయే రెండేళ్లలో ఇండస్ట్రీని ఎలాంటి మలుపులు తిప్పుతుందో వేచి చూడాలి.

Published : 
  • 5 February 2026, 8:07 PM IST