కథ పాతదే అయినా.. చెప్పే విధానంలో నిజాయితీ ఉంటే ప్రేమకథలు ఎప్పుడూ ఫ్రెష్‌గానే అనిపిస్తాయి. ఆ కోవలోకే వస్తుంది 'విత్ లవ్'. మదన్ దర్శకత్వంలో అభిషన్, అనస్వరా రాజన్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం, ప్రేక్షకులకు ఒక స్వచ్ఛమైన అనుభూతిని పంచుతుంది. మరి ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం.కథ విషయానికి వస్తే.. సత్య (అభిషన్ జీవింత్)కు పెళ్లి చూపుల తంతుపై పెద్దగా ఆసక్తి ఉండదు. కానీ చెల్లి బలవంతం మీద ఒక బ్లైండ్ డేట్‌కు వెళ్తాడు. అక్కడ అతనికి మోనిష (అనస్వరా రాజన్) పరిచయం అవుతుంది. మాటల సందర్భంలో.. ఇద్దరూ ఒకే స్కూల్ విద్యార్థులని (సీనియర్-జూనియర్) తెలుసుకుంటారు. ఆ చిన్న పలకరింపు కాస్తా.. వారి పాత జ్ఞాపకాలను, తొలి ప్రేమను, విడిపోయిన సందర్భాలను ఎలా గుర్తుచేసింది? గతాన్ని నెమరువేసుకుంటూ వారు సాగించిన ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేదే మిగతా కథ.
స్క్రీన్ ప్లే విషయానికి వస్తే.. సినిమా ఆరంభం నుంచే దర్శకుడు ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడంలో సఫలమయ్యాడు. ప్రథమార్ధం అంతా చాలా హాయిగా, ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోతుంది. ఇందులో ఉన్న సున్నితమైన హాస్యం, కథ నడిపిన తీరు ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేస్తాయి. ముఖ్యంగా స్కూల్ రోజుల నాటి అమాయకత్వాన్ని, చిన్న చిన్న అల్లర్లను తెరపై చూపించిన విధానం చాలా సహజంగా ఉంది. ఆ సీన్స్ అన్నీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా వేగంగా ఫస్టాఫ్ వెళ్లిపోయింది. ఇక సెకండాఫ్‌లో కథలో భావోద్వేగాలు బలపడతాయి. అయితే దర్శకుడు వాటిని మెలోడ్రామాగా మార్చకుండా చాలా పద్ధతిగా డీల్ చేశారు. గతాన్ని భారంలా మోయకుండా, దాన్ని స్వీకరించి ముందుకు సాగాలనే పాయింట్‌ను చాలా పరిణితితో చూపించారు. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి ఫీల్ గుడ్ చిత్రాల్లో ఇదొకటి. కేవలం ప్రేమకథగానే కాకుండా, జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలో చెప్పే ప్రయత్నం ఇది. సింపుల్ అండ్ స్వీట్ లవ్ స్టోరీలను ఇష్టపడేవారికి ఈ సినిమా మంచి ఛాయిస్.
నటీనటుల విషయానికి వస్తే.. హీరోగా అభిషన్ జీవింత్‌కు ఇదే తొలి చిత్రమైనా, ఎంతో అనుభవం ఉన్న నటుడిలా కనిపించాడు. అతనిలో ఎక్కడా బెరుకు లేదు, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఇక అనస్వరా రాజన్ తన సహజమైన నటనతో ఆకట్టుకుంది. బ్యాక్ బెంచర్ స్టూడెంట్‌గా ఆమె హావభావాలు, ఎమోషన్స్ సినిమాకు హైలైట్. కావ్య అనిల్ తన పాత్ర పరిధి మేరకు చక్కగా నటించి, తొలి ప్రేమ జ్ఞాపకాలను గుర్తుచేసింది. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.టెక్నికల్ టీం విషయానికి వస్తే.. సాంకేతికంగా ఈ సినిమాకు ప్రధాన బలం సీన్ రోల్డాన్ సంగీతం. పాటలతో పాటు, సన్నివేశాల్లోని మూడ్‌ని ఎలివేట్ చేయడంలో నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించింది. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ లుక్‌ని ఇచ్చింది, విజువల్స్ కంటికింపుగా ఉన్నాయి. ఎడిటింగ్ నీట్‌గా ఉంది. కొత్త టీమ్ అయినప్పటికీ నిర్మాణ విలువల్లో రాజీ పడలేదు. దర్శకుడు మదన్ తన తొలి ప్రయత్నంలోనే మంచి మార్కులు కొట్టేశాడు.ఓవరాల్‌గా విత్ లవ్.. తీపి జ్ఞాపకాల విందు.. ఒక అందమైన లవ్ జర్నీ..!