మొన్నటిదాకా వైసీపీలో ఉండి... పదవుల కోసం వెంపర్లాడుతూ... పవన్ కల్యాణ్ ని కూడా లెక్కచేయలేదు. అధికారాంతమున అన్నట్టుగా... వైసీపీ పవర్ ఊడిపోవడంతో అలీ కూడా ఆ పార్టీ నుంచి బయటపడ్డాడు. అప్పట్లో జగన్ ఆదేశిస్తే పవన్ మీద కూడా పోటీకి సిద్ధమన్న అలీ... ఇప్పుడు పవర్ స్టార్ ముద్దు అంటున్నాడు. ఓ టీవీ కార్యక్రమంలో మీకు ఎవరు ఇష్టమని యాంకర్ సుమ...పవన్, రవితేజ ఫోటోలు చూపించింది అడిగింది. దాంతో తనకు పవన్ ఇష్టమని చెప్పాడు అలీ.. అతనితో నటించేందుకు కూడా సిద్ధమంటున్నాడు. ఇప్పుడీ ప్రోమో వైరల్ గా మారింది.
వైసీపీలో ఉన్నప్పుడు నటుడు అలీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ... ఇలా ఏదో ఒక పోస్టు కావాలని ఉబలాట పడ్డాడు. 2019లో వైసీపీలో జాయిన్ అయినప్పటి నుంచీ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాడు అలీ. కానీ ఏ ప్రాధాన్యతా లేని మీడియా అడ్వైజర్ పోస్ట్ మాత్రమే ఇచ్చారు జగన్. ఐదేళ్ళూ పార్టీ వాడుకొని వదిలేసింది అలీకి అర్థమైంది. అందుకే వైసీపీకే కాదు... ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పాడు. ఏపీలో ఎలాగూ కూటమి ప్రభుత్వం గెలవడం... పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అవడం కూడా అలీకి ఇబ్బందిగా మారాయి. సినిమా ఇండస్ట్రీలో పవన్, బాలకృష్ణకి పలుకుబడి కూడా ఉండటంతో తనకు సినిమా అవకాశాలు కూడా తగ్గిపోతాయన్న భయం పట్టుకుంది. అయితే అలీ వైసీపీలో ఉన్నప్పుడు పవన్ ను టార్గెట్ చేస్తూ ఏనాడూ విమర్శలు చేయలేదు. వైసీపీకి అనుకూల ప్రకటనలు మాత్రమే చేసేవాడు. ఒక్క పవన్ పై పోటీకి సిద్ధం అని ప్రకటించినప్పుడు మాత్రం... పవర్ స్టార్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పవన్ తో చాలా క్లోజ్ ఫ్రెండ్ గా ఉండి... ఎన్నో సినిమాల్లో నటించి...చివరకు రాజకీయాల కోసం జగన పంచన చేరడం ఏంటన్న విమర్శలు వచ్చాయి.
రీసెంట్ గా యాంకర్ సుమ నిర్వహిస్తున్న ఓ టీవీ షోలో పాల్గొన్నాడు అలీ. ఇందులో సుమ మీకు ఎవరితో నటించడం కంఫర్ట్ గా ఉంటుందని... ఎవరంటే ఇష్టమని అడిగింది. అందులో రవితేజ, పవన్ కల్యాణ్ ని ఆప్షన్ గా పెట్టారు. కొంచెమైనా ఆలోచించకుండానే... టక్కున పవన్ పేరే చెప్పాడు అలీ. పవన్ అంటే ఇష్టమంటూ తన మనసులో మాట బయటపెట్టాడు. దీన్నిబట్టి పవన్, చిరంజీవితో పాటు... మెగా హీరోలతో కలసి నటించడానికి అలీ రూట్ క్లియర్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. పాలిటిక్స్ లోకి వెళ్ళాక పవన్ తో కలసి అలీ సినిమాల్లో నటించలేదు. ఇప్పుడు అవకాశాలు తగ్గడంతో... పవన్ కు దగ్గరయ్యేందుకు అలీ ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోంది.