Top Story:చంద్రబాబుకి మూడు ఆప్షన్స్…. లోకేష్ సీఎం అవ్వాలంటే చంద్రబాబుకు మూడు ఆప్షన్స్… లోకేష్ సీఎం అయితే…. చంద్రబాబు ఏమవుతారు?

తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ని నియమించడంతో చంద్రబాబు తర్వాత ఏపీకి లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు అనేది ఖరారు అయిపోయింది.ప్రజలు, కార్యకర్తల మైండ్ కూడా సెట్ చేసేసారు సీఎం చంద్రబాబు నాయుడు.

Post Published By: dialnews
Updated : 21 April 2026, 9:30 AM IST

తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ని నియమించడంతో చంద్రబాబు తర్వాత ఏపీకి లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు అనేది ఖరారు అయిపోయింది.ప్రజలు, కార్యకర్తల మైండ్ కూడా సెట్ చేసేసారు సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీకి లోకేష్ ముఖ్యమంత్రి కావ డమే ఆలస్యం అన్నట్లుంది పార్టీలో పరిస్థితి. అయితే లోకేష్ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు.... ?ఆ ముహూర్తం ఎప్పుడు అన్నదే ఇప్పుడు జనంలో బాగా చర్చ జరుగుతున్న అంశం.చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు 76 ఏళ్లు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. వారానికి ఏడు రోజులు పని చేస్తారు. తెల్లవారుజామున 5 గంటలకు లెస్తే రాత్రి పదింటి వరకు పనిచేస్తూనే ఉంటారు.

అలాంటి చంద్రబాబు ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీ చేసి,లోకేష్ కి ఇవ్వకపోయినా పెద్ద నష్టమేమీ జరగదు. కానీ ఇంట.... బయట ఉన్న ఒత్తిళ్లు, లోకేష్ రాజకీయ భవిష్యత్తు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని లోకేష్ ని ముఖ్యమంత్రిని చేయాలని అందరూ దాదాపుగా డిసైడ్ అయిపోయారు. అయితే లోకేష్ ని ముఖ్యమంత్రిని చేయడం ఇప్పుడు పెద్ద టాస్క్ కాదు. ఇప్పటికీ సూపర్ యాక్టివ్ గా ఉన్న చంద్రబాబు కి రాజకీయంగా ప్రత్యామ్నాయ పదవులు ఏమున్నాయి అనేది పార్టీ ముందున్న పెద్ద ప్రశ్న. ఇదే విషయం చంద్రబాబు లోకేష్ విడివిడిగా ప్రధాని మోడీని కలిసి కూడా చర్చించారని సమాచారం. లోకేష్ కి సీఎం సీట్ ఇవ్వడానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కూడా తనకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేశారు. ఇప్పుడు సమస్యల్లా లోకేష్ సీఎం అయితే... చంద్రబాబు ఏమవుతారు అన్నదే.

చంద్రబాబు ముందున్న మొదటి ఆప్షన్, రాష్ట్రపతి పదవి.2027 నాటికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పదవి కాలం ముగుస్తుంది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా చంద్రబాబుకి అవకాశం ఇవ్వచ్చు. 50 ఏళ్ల రాజకీయ జీవితం, అపారమైన అనుభవం, రాష్ట్రపతిగా చంద్రబాబు కి ఉన్న గొప్ప అర్హతలు. కానీ రాష్ట్రపతి అభ్యర్థిని కేవలం బిజెపి మాత్రమే డిసైడ్ చేయదు. కచ్చితంగా ఆర్ఎస్ఎస్ తను నిర్ణయాన్ని తెలియజేస్తుంది. బిజెపి నేతకు కాకుండా కేవలం 21 ఎంపీ సీట్లున్న టిడిపి అధినేతకు రాష్ట్రపతి పదవి ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్న ఆర్ఎస్ఎస్ నుంచి రాక మానదు. ఇటీవలే చంద్రబాబు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో కూడా సమావేశం అయ్యారు.

రాష్ట్రపతి అభ్యర్థి విషయమై ఇప్పటివరకు ఆర్ఎస్ఎస్ నుంచి ఎటువంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు. బిజెపి అభ్యర్థికి కాకుండా ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం అయినా టిడిపికి, అందులో చంద్రబాబు కి ఎందుకు రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వాలి అనే ప్రశ్నకు ఇప్పటివరకు సమాధానం దొరకలేదు. రాజకీయ వ్యూహాలకు పెట్టింది పేరైన చంద్రబాబుకు రాష్ట్రపతి పదవి ఇచ్చి కొత్త సమస్యలు తెచ్చుకోవాలా అనే అనుమానం బీజేపీలో కొందరికి లేకపోలేదు. అందువల్ల చంద్రబాబుకి రాష్ట్రపతి పదవి రావడం కష్టమే కావచ్చు. నిజంగా ఆయన ఆ పదవిని అలంకరిస్తే, తెలుగు వాళ్ళకి గౌరవం కూడా. 2027 నుంచి 2032 వరకు బాబు ఆ పదవిలో నిరాటంకంగా కొనసాగవచ్చు. కానీ ఆయనకు బిజెపి రాష్ట్రపతి పదవి ఇస్తుందా అన్నది మాత్రం అనుమానమే.

ఇక మరో అవకాశం, లోకేష్ ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టి 2027 నాటికి ఏదైనా పెద్ద రాష్ట్రానికి చంద్రబాబు గవర్నర్గా వెళ్లడం. ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ 45 ఏళ్లుగా గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక పాత్ర పోషిస్తున్న చంద్రబాబుకి గవర్నర్ పదవి అనేది చాలా చిన్నది. అంతేకాదు దేశంలో అత్యంత యాక్టివ్ చీఫ్ మినిస్టర్ అయిన చంద్రబాబుకి, ఎటువంటి ఆక్టివిటీ లేని గవర్నర్ పోస్ట్ ఇవ్వడం అంటే చిరుత పులిని గొలుసులేసి కట్టడం లాంటిది. ముఖ్య మంత్రిగా ఉన్న, ప్రతిపక్ష నేతగా ఉన్న నిత్యం చురుగ్గా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం అనేది చంద్రబాబు నిత్య కృత్యం. పైగా ఆయన యాక్టివ్ అడ్మినిస్ట్రేటర్ కూడా. అలాంటి చంద్రబాబుని ఒక పెద్ద రాష్ట్రానికి గవర్నర్ ని చేసి కట్టిపడేయడం ఎవరు జీర్ణించుకోలేనిది. పార్టీ నేతలకు కూడా ఇది ఆమోద యోగ్యం కానిది.ఇక చంద్రబాబుకు ఉన్న మూడో ఆప్షన్, బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ లా రాజ్యసభ ఎంపీ సీట్ తీసుకుని, కేంద్రంలో క్యాబినెట్ మంత్రిగా స్థిరపడిపోవడం.

అది కూడా చంద్రబాబు స్థాయికి చాలా చిన్నది. ఎన్నో ఏళ్లుగా కేంద్ర మంత్రులను ఎంపిక చేస్తున్న చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోడీ క్యాబినెట్లో ఆయన సహచరుడిగా, కేంద్ర మంత్రి పోస్టులో పక్కన కూర్చోవడం తెలుగుదేశం కార్యకర్తలకే జీర్ణం కాదు.లోకేష్ ని ముఖ్యమంత్రిని చేసి 2027 నాటికి ఆ పదవి నుంచి తప్పుకోవాలి అంటే చంద్రబాబు ముందున్న మూడు ఆప్షన్స్ ఇవే. ఇందులో రాష్ట్రపతి పదవి తప్ప మిగిలిన రెండు ఆయన స్థాయికి చిన్నవే అవుతాయి. అయినప్పటికీ కొడుకు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, కుటుంబ ఒత్తిడికి తలఒగ్గి చంద్రబాబు ఈ మూడింట్లో దేనికో దానికి తనను తాను పరిమితం చేసుకుంటే...2027లో లోకేష్ ను మనం సీఎంగా చూడడం ఖాయం. ఈ మూడు ఆప్షన్స్ లో ఏదో ఒక దాన్ని చంద్రబాబు వినియోగించుకుంటారా.... లోకేష్ కు సీఎం సీట్ ఇస్తారా... లేక ఈ టర్మ్ కి తానే ముఖ్యమంత్రిగా కొనసాగి, 2029 తర్వాత నిర్ణయం తీసుకుంటారా అన్నది వేచి చూడాలి.

 

Published : 
  • 21 April 2026, 9:30 AM IST