ఓ వైపు ఇరాన్ తో శాంతి ఒప్పందం జరుగుతోంటే.. అమెరికా రక్షణ శాఖ మాత్రం యుద్దానికి కాలు దువ్వడం ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ఇరాన్ దేశానికి అమెరికా మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భయంకరమైన లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ ఇరాన్ గనుక మాట వినకపోతే.. ఆ దేశంపై నేరుగా మళ్ళీ సైనిక దాడి చేయడమే కాకుండా, ఇరాన్‌ను ప్రపంచం నుంచి పూర్తిగా ఒంటరిని చేస్తూ సముద్ర ముట్టడి చేయడానికి కూడా వెనుకాడబోమని అమెరికా తేల్చి చెప్పేసింది. అమెరికా వార్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు అమెరికా, ఇరాన్ మధ్య ఏం జరుగుతోంది? పీట్ మళ్ళీ ఇరాన్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?
బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో నాటో దేశాల రక్షణ మంత్రుల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత అమెరికా వార్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ఆయన ఇరాన్ దేశాన్ని ఉద్దేశించి అత్యంత కఠినమైన పదజాలంతో హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఇరాన్ అణు ఒప్పందం మరియు ఇతర అంతర్జాతీయ చర్చలకు సంబంధించి ఇరాన్ తూచా తప్పకుండా నియమ నిబంధనలు పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
"ఒకవేళ ఇరాన్ గనుక ఇచ్చిన గడువులోగా తన అంగీకారాలను, బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమైతే.. మేము ఇరాన్‌పై మళ్లీ సైనిక చర్యలను ప్రారంభించడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాం" అంటూ హెగ్సెత్ బాంబు పేల్చారు. అంటే అమెరికా ఎప్పుడైనా ఇరాన్‌పై క్షిపణి దాడులు చేయడానికి సిద్ధంగా ఉందనే సంకేతాలు ఇచ్చారు. కేవలం దాడులు మాత్రమే కాదు.. అమెరికా దగ్గర మరో డేంజరస్ ప్లాన్ కూడా సిద్ధంగా ఉందని పీట్ హెగ్సెత్ వెల్లడించారు. ఇరాన్ గనుక ఒప్పందాలను ఉల్లంఘిస్తే.. ఆ దేశంపై మళ్ళీ 'బ్లాకేడ్'విధిస్తామని చెప్పారు.
అసలు బ్లాకేడ్ అంటే ఏంటో తెలుసా? ఇరాన్ దేశ సరిహద్దుల్లో, ముఖ్యంగా సముద్ర మార్గాల్లో అమెరికా తన నావికా దళాన్ని మోహరిస్తుంది. దీనివల్ల ఇరాన్ నుంచి ఎలాంటి వస్తువులు, ముఖ్యంగా ఆ దేశ ప్రధాన ఆదాయ వనరైన ముడి చమురు బయటి దేశాలకు ఎగుమతి కాకుండా, అలాగే ఇతర దేశాల నుంచి ఇరాన్‌కు ఎలాంటి ఆహార లేదా రక్షణ సామాగ్రి రాకుండా పూర్తిగా దిగ్బంధిస్తారు. ఇది గనుక జరిగితే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కొద్ది రోజుల్లోనే కుప్పకూలిపోతుంది. ఆ స్థాయి ఒత్తిడిని ఇరాన్‌పై తీసుకురావడానికి తాము వెనుకాడబోమని అమెరికా తేల్చి చెప్పింది.
కేవలం వార్ సెక్రటరీ మాత్రమే కాదు.. స్వయంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్‌పై భారీ పొలిటికల్ ప్రెజర్ పెడుతున్నారు. ఫ్రాన్స్‌లోని ఎవియాన్ నగరంలో జరిగిన G7 కూటమి సదస్సులో ట్రంప్ ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఇరాన్‌తో జరగబోయే చర్చలు గనుక ఆశించిన ఫలితాలను ఇవ్వకపోతే, ఇరాన్‌పై 'మిలిటరీ స్ట్రైక్స్' చేయడానికి మళ్లీ పునరాలోచిస్తామని ట్రంప్ అంతర్జాతీయ వేదికలపైనే హెచ్చరించారు. అంటే అటు దౌత్యపరంగా చర్చలు జరుపుతూనే.. ఇటు రక్షణ పరంగా గన్ పాయింట్లో ఇరాన్‌ను ఉంచే వ్యూహాన్ని అమెరికా అమలు చేస్తోంది.
ఒకవేళ అమెరికా గనుక నిజంగానే ఇరాన్‌పై దాడులు చేస్తే లేదా సముద్ర ముట్టడి విధిస్తే.. ఆ ప్రభావం కేవలం ఆ రెండు దేశాల పైనే కాదు, యావత్ ప్రపంచంపై పడుతుంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ అంతా మళ్లీ అశాంతిలో మునిగిపోతుంది. ఇరాన్ గనుక హార్ముజ్ జలసంధిని మూసేస్తే.. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా ఆగిపోయి, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. దీనివల్ల భారత్ లాంటి దేశాల్లో తీవ్ర ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. ప్రస్తుతం అమెరికా ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నప్పటికీ, తన మిలిటరీని మాత్రం ఎప్పుడూ అలర్ట్‌గా ఉంచింది.
మరి ఈ ఒత్తిడికి లొంగి ఇరాన్ వెనక్కి తగ్గుతుందా? లేక అమెరికాకు ఎదురుతిరిగి యుద్ధానికి సై అంటుందా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అమెరికా ఇరాన్ మధ్య నడుస్తున్న ఈ కోల్డ్ వార్.. రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. మరి ఇరాన్‌పై సైనిక చర్యకు సిద్ధమన్న అమెరికా నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? అమెరికా నిజంగానే ఇరాన్‌పై దాడి చేస్తుందా? అనేది చూడాలి.