Top story: H-1B భార్యలకు అమెరికా షాక్.. H4 వర్క్ పర్మిట్లు రద్దు? భారతీయులపై పడే ఇంపాక్ట్ ఇదే!

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ, అక్కడే స్థిరపడాలని కలలు కంటున్న వేలాది మంది భారతీయులకు, ముఖ్యంగా హెచ్-1బీ వీసాదారుల జీవితభాగస్వాములకు ట్రంప్ ప్రభుత్వం ఒక ఊహించని భారీ షాక్ ఇచ్చింది.

Post Published By: dialnews
Updated : 2 September 2026, 11:46 AM IST

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ, అక్కడే స్థిరపడాలని కలలు కంటున్న వేలాది మంది భారతీయులకు, ముఖ్యంగా హెచ్-1బీ వీసాదారుల జీవితభాగస్వాములకు ట్రంప్ ప్రభుత్వం ఒక ఊహించని భారీ షాక్ ఇచ్చింది. గత పదేళ్లుగా అత్యంత విజయవంతంగా అమల్లో ఉన్న హెచ్-4 వీసాదారుల పని హక్కులను, అంటే ‘వర్క్ పర్మిట్లను’ పూర్తిగా రద్దు చేసేందుకు అమెరికా ప్రభుత్వం సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఈ ప్రతిపాదన గనుక చట్టరూపం దాలిస్తే అమెరికాలోని వేలాది భారతీయ కుటుంబాలపై కోలుకోలేని ఆర్థిక ప్రభావం పడబోతోంది.అసలు ఈ హెచ్-4 ఈఏడీ అంటే ఏంటి? దీనిని రద్దు చేయాలని ట్రంప్ సర్కార్ ఎందుకు భావిస్తోంది? దీనివల్ల మన భారతీయులు, ముఖ్యంగా మహిళలు ఎలాంటి ఇబ్బందులు పడబోతున్నారు? ప్రస్తుతం వాలిడ్ వర్క్ పర్మిట్ ఉన్నవాళ్లు రేపటి నుంచి ఉద్యోగాలకు వెళ్లకూడదా?

అసలు మ్యాటర్ ఏంటంటే.. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తన సుదీర్ఘకాల నియంత్రణ ఎజెండాలో ఈ ప్రతిపాదనను అధికారికంగా చేర్చింది. "రిమూవింగ్ హెచ్-4 డిపెండెంట్ స్పౌసెస్ ఫ్రమ్ ది క్లాసెస్ ఆఫ్ నాన్‌సిటిజన్స్ ఎలిజిబుల్ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్" పేరుతో ఈ బిల్లును రిజిస్టర్ చేశారు. దీని అర్థం ఏంటంటే.. హెచ్-1బీ వీసాపై అమెరికా వెళ్లేవారిపై ఆధారపడే భార్య లేదా భర్తకు ఇచ్చే హెచ్-4 వీసా క్లాస్‌ను, ఇకపై ఉద్యోగాలు చేసుకోవడానికి అర్హత లేని కేటగిరీగా మార్చాలని చూస్తున్నారు.

ఒక రకంగా చెప్పాలంటే, ఇది గతంలో 2015లో ఒబామా ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను పూర్తిగా తిరగరాయడమే. నాడు ఒబామా గ్రీన్ కార్డ్ ప్రాసెస్‌లో ఉన్న హెచ్-1బీ భాగస్వాములకు వర్క్ పర్మిట్లు ఇచ్చే రూల్ తెస్తే.. ఇప్పుడు ట్రంప్ సర్కార్ మళ్లీ పాత కాలం నాటి కఠిన నిబంధనలను తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ నిర్ణయం వల్ల ప్రపంచంలో ఏ దేశానికి కానంత నష్టం మన భారతదేశానికే జరగబోతోంది. ఎందుకో తెలుసా? యూఎస్‌సీఐఎస్ డేటా ప్రకారం.. అమెరికాలో అప్రూవ్ అయ్యే మొత్తం హెచ్-1బీ వీసాల్లో ఏకంగా 71 శాతం వీసాలు మన భారతీయులవే. దీనికంటే షాకింగ్ నంబర్స్ ఇంకోటి ఉంది. 2014 నుండి 2017 మధ్య కాలంలో అమెరికా ఇచ్చిన హెచ్-4 వర్క్ పర్మిట్ అప్లికేషన్ల డేటాను ఒకసారి గమనిస్తే.. అందులో అప్రూవ్ అయిన వాటిలో ఏకంగా 93 శాతం మంది భారతీయ పౌరులే ఉన్నారు.

ఆ 93 శాతంలో మళ్లీ 94 శాతం మంది కేవలం భారతీయ మహిళలే. అంటే ఈ రూల్ గనుక మారితే ఉద్యోగాలు కోల్పోయే వారిలో సింహభాగం మన భారతీయ మహిళలే ఉంటారు. భారతదేశంలో పెద్ద పెద్ద డిగ్రీలు, పీజీలు చదివి, పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిన ఎంతో మంది ప్రతిభావంతులైన మహిళలు మళ్లీ ఇంట్లోనే ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. నిజానికి ట్రంప్ ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నం చేయడం ఇదే మొదటిసారి కాదు బాసు. తన మొదటి విడత పదవీ కాలంలో అంటే 2017లో కూడా హెచ్-4 ఈఏడీ పథకాన్ని రద్దు చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ప్రతిపాదించింది.

కానీ అప్పట్లో రకరకాల లీగల్ ఇష్యూస్ వల్ల అది ఫైనలైజ్ అవ్వలేదు, ఆ తర్వాత 2021లో బైడెన్ సర్కార్ రాగానే ఆ ప్రతిపాదనను పూర్తిగా వెనక్కి తీసుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ పట్టుదలతో ఈ నిబంధనను తీసుకురావడానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కసరత్తు చేస్తోంది. ఇది ఒక్కటే కాదు.. హెచ్-1బీ వీసాలను టార్గెట్ చేస్తూ అమెరికా మరికొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటోంది. కొత్తగా హెచ్-1బీ ఉద్యోగులను చేర్చుకునే కంపెనీలపై ఏకంగా 1,03,265 డాలర్ల భారీ ఫీజును విధించాలని ప్రతిపాదించింది.

అంతేకాకుండా, ఒకవేళ ఎవరైనా హెచ్-1బీ ఉద్యోగి తన జాబ్ కోల్పోతే.. వేరే కంపెనీ వెతుక్కోవడానికి ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను కూడా పూర్తిగా రద్దు చేయాలని వైట్ హౌస్ ప్లాన్ చేస్తోంది. అంటే జాబ్ పోతే వెంటనే ఇండియా వచ్చేయాలన్నమాట. అయితే ఇవన్నీ విని అమెరికాలో ఉన్న మన వాళ్లు ఇప్పుడే కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది కేవలం ఒక "ప్రతిపాదన" మాత్రమే, ఇంకా ఫైనల్ రూల్ కాలేదు. అమెరికా చట్టాల ప్రకారం ఏదైనా నిబంధన మార్చాలంటే ముందుగా ఫెడరల్ రిజిస్టర్‌లో ‘నోటీస్ ఆఫ్ ప్రపోజ్డ్ రూల్ మేకింగ్’ను పబ్లిష్ చేయాలి. ఆ తర్వాత సాధారణ ప్రజలు, కంపెనీల నుండి అభ్యంతరాలు, సలహాల కోసం సమయం ఇవ్వాలి.

అవన్నీ పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ లీగల్ ప్రాసెస్ అంతా పూర్తి కావడానికి కనీసం కొన్ని నెలల నుండి ఏడాది పైనే సమయం పడుతుంది. అప్పటివరకు వాలిడ్ ఈఏడీ కార్డులు ఉన్న హెచ్-4 జీవితభాగస్వాములు ఎంచక్కా లీగల్‌గా తమ ఉద్యోగాలు చేసుకోవచ్చు. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవడానికి బాధితులకు తగినంత టైమ్ దొరుకుతుంది. స్థానిక అమెరికన్లకే ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో ట్రంప్ ప్రభుత్వం వేస్తున్న ఈ అడుగులు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి.

Published : 
  • 2 September 2026, 11:46 AM IST