Top story: మళ్లీ అదే తప్పు చేస్తున్నారా? చంద్రబాబు చేసింది చెప్పుకోలేక పోతున్నారా?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పవర్ లో లేనప్పుడు... అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అద్భుతంగా పని చేస్తారు. ఎలా సక్సెస్ అవ్వాలి ?, ఏ వ్యూహాలు వెయ్యాలి అనే విషయంలో చాలా చురుగ్గా వ్యవహరిస్తారు.

Post Published By: dialnews
Updated : 18 August 2026, 11:15 AM IST

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పవర్ లో లేనప్పుడు... అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అద్భుతంగా పని చేస్తారు. ఎలా సక్సెస్ అవ్వాలి ?, ఏ వ్యూహాలు వెయ్యాలి అనే విషయంలో చాలా చురుగ్గా వ్యవహరిస్తారు. ఫీల్డ్ లో చాలా బలంగా, అలర్ట్ గా ఉంటారు. ప్రాక్టికల్ గా , రియాలిటీ కి దగ్గరగా ఆలోచిస్తారు. కానీ పవర్ లోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో ఏమో కానీ అధికారం లేనప్పుడు పని చేసినంత బలంగా, వేగంగా వ్యూహాత్మకంగా అధికారంలో ఉన్నప్పుడు పనిచేయరు. అప్పటి వరకు కనిపించని ఒక కోటరీ బ్యాచ్ ఆయన సీఎం అవ్వగానే చుట్టూ చేరిపోతుంది. వాళ్ళు ఏం చెప్తే అది ఆయన వింటూ ఉంటారు. అదేం చిత్రమో ఎన్నికల్లో చంద్రబాబుతో పని చేసిన వాళ్ళు బాబు పవర్ లో ఉన్నప్పుడు దూరమైపోతారు.
ఇది దాదాపు 1995 నుంచి కనిపిస్తున్న చిత్రం. బాబు గారు సీఎం కాగానే సలహాదారులు, వ్యూహకర్తలు, ప్రమోషన్ చేసేవాళ్లు.... రకరకాల డెసిగ్నేషన్స్ తో ఆయన చుట్టూ చేరిపోతారు .

భజన చేస్తూ ఉంటారు. ఫైనల్ గా ఐదేళ్లు అధికారంలో చేసింది చెప్పుకోలేక... ఎన్నికల్లో ఓడిపోతుంటారు చంద్రబాబు.2004, 2019లో ఇదే జరిగింది. మళ్లీ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ప్రభుత్వంలో జరుగుతున్న కృషిని, సంక్షేమాన్ని, అభివృద్ధిని చెప్పుకోవడంలో.... ప్రజెంట్ చేయడంలో చంద్రబాబు ఫెయిల్ అవుతున్నారు. నిజానికి 1995 నుంచి చూస్తే నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత చంద్రబాబు మొదటి మూడు టర్మ్స్ కంటే ఎక్కువ పని చేస్తున్నారు.76 ఏళ్ల వయసులో ఒకప్పటి కంటే చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అమరావతి, పోలవరం ఇతరత్రా భారీ ప్రాజెక్టులు వేగంగా జరుగుతున్నాయి. కానీ వాటి గురించి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చంద్రబాబు ఎక్కడో విఫలమవుతున్నారు.

కేవలం వైసీపీ నేతలునీ టార్గెట్ చేయడం.... అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం, వైసిపి లీడర్ల కామెంట్స్ కి కౌంటర్లు ఇవ్వడం దీనిపై పెడుతున్నంత శ్రద్ధ, చేసిన పనులు చెప్పుకోవడంలో చంద్రబాబు కానీ, మంత్రులు ఎమ్మెల్యేలు కానీ దృష్టి పెట్టడం లేదు. రాజకీయాలు చేయాల్సిందే. రాజకీయంగా ప్రత్యర్థులను ఎండగట్టాల్సిందే.. వాళ్లని ఎదుర్కోవాల్సిందే. ,కానీ అధికారంలో ఉండి.... చేసిన పనిని, జరుగుతున్న అభివృద్ధిని, ఇస్తున్న సంక్షేమాన్ని చెప్పుకో లేకపోతే మళ్లీ ఎన్నికల్లో గెలవడం కష్టం అవ్వచ్చు.2019 ...24 మధ్య జగన్ కూడా ఇలాంటి పొరపాటే చేసి మూల్యం చెల్లించుకున్నారు.ప్రభుత్వం చేస్తున్న పనిని ప్రచారం చేసే విషయంలో చంద్రబాబు పూర్తిగా ఎల్లో మీడియా మీద ఆధారపడిపోయారు. అక్కడే దారుణంగా దెబ్బ తింటున్నారు.

ఓ మూడు పత్రికలు... ఆరు న్యూస్ చానల్స్ ని నమ్ముకొని వాటికి తెర ముందు నుంచి తెర వెనకనుంచి డబ్బులు అందిస్తూ, ఇతర ఫేవర్స్ చేస్తూ వాటికి ప్రభుత్వాన్ని పార్టీని రక్షించే పనిని పూర్తిగా అప్పజెప్పేసారు. అక్కడే చంద్రబాబు దారుణంగా దెబ్బతింటున్నారు. ప్రత్యర్థుల్ని రాజకీయంగా దెబ్బతీయడానికి మాత్రమే ఎల్లో మీడియా పనికొస్తుంది తప్ప.. జరిగిన అభివృద్ధిని నిజాయితీగా ప్రజల్లోకి తీసుకెళ్లేటంతగా చంద్రబాబు పత్రికలు గాని, చానల్స్ గాని, సోషల్ మీడియా గానీ పనిచేయటం లేదు. వాటికంత శక్తి కూడా లేదు. ఊరు మీద చెత్తంతా పోగేసి... వాటిని వైసిపికి ఆపాదించి
అల్లరి చిల్లర చర్చలు పెట్టడం తప్ప ఎల్లో మీడియా చేస్తున్నది ఏమీ లేదు. ప్రతినెలా 70 లక్షల మందికి వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు, రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్సు నడుస్తుంది, ఎం ఎస్ ఎం ఈ ద్వారా మహిళలకు ఎంతో మేలు జరుగుతుంది. ఇతర సంక్షేమ పథకాలు కింద మీద పడి అమలు చేస్తున్నారు. పెట్టుబడులు కూడా వస్తున్నాయి.

ఇన్ని జరుగుతున్నా ప్రజల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఎందుకు వస్తుంది? ఎమ్మెల్యేలు పట్ల ఎందుకు కోపంగా ఉన్నారు? ఈ విషయాన్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదు. చాలా భారాన్ని మొత్తం తానే భుజాలకి ఎత్తుకొని.... నేను సెల్ఫోన్ కనిపెట్టాను, నేనే వంటగ్యాస్ మొదటి జనాలకి ఇచ్చాను, నేనే హైదరాబాద్ సృష్టించాను.... ఇలాంటి అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డులు పట్టుకుని వేసి వేసి వేసి తన బ్రాండ్ పెంచుకుంటున్నారు తప్ప... తన పాలన పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని మాత్రం అంచనా వేయలేకపోతున్నారు. ప్రభుత్వం వల్ల నేను ఈ బెనిఫిట్ పొందాను అని జనంలో ఒక్కరు కూడా ఆన్ రికార్డ్ చెప్పిన పాపాన పోలేదు. ఐ అండ్ పి ఆర్ మినిస్ట్రీ కానీ, ఇతర ప్రసార సాధనాలు కానీ, చివరికి ఎల్లో మీడియా గానీ ఇవేమీ పట్టించుకోవడం లేదు.

ఎమ్మెల్యేలు అందని కాడికి దోచుకుంటున్నారు. మంత్రులు శని ఆదివారాల్లో హైదరాబాదులో ఎంజాయ్ చేస్తున్నారు. గ్రేడ్ టు నాయకులు పైరవీలు, ఇతర పనులతో హడావిడిగా ఉన్నారు. ఇదంతా జనం గమనిస్తున్నారు. ఇన్ని తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు తన పాత ఫార్ములానే మళ్లీ అప్లై చేస్తున్నారు. తన గురించి తానే సొంత భజన చేసుకుంటూ అదే ప్రచారంగా భావిస్తున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుందో మాత్రం జనానికి స్పష్టంగా చెప్పడం, సంక్షేమం అందుకున్న వాళ్లు మాకిది జరిగింది అని వాళ్ళు చెప్పడం ఈ రెండు ఏపీలో జరగడం లేదు. బహుశా 2004, 2019 స్టోరీయే రిపీట్ అవుతుందేమో అనే భయం పార్టీలో కొందరికి లేకపోలేదు.

 

 

Published : 
  • 18 August 2026, 11:15 AM IST