ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరైనా శత్రువులు కావచ్చు.. ఎవరైనా మిత్రులు కావచ్చు. కానీ, ఉత్తరాంధ్ర పొలిటికల్ ల్యాండ్‌స్కేప్‌లో దశాబ్దాలుగా ఒక విచిత్రమైన, అత్యంత బలమైన మిత్రత్వం నడుస్తోంది. అదే.. గంటా శ్రీనివాసరావు మరియు బొత్స సత్యనారాయణల బంధం. పార్టీలు వేరైనా, జెండాలు వేరైనా స్క్రీన్ వెనుక వీరిద్దరూ ప్రాణస్నేహితులు. అలాంటి ప్రాణస్నేహితుడు, ప్రస్తుతం భీమిలి ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావుపై.. బొత్స సత్యనారాయణ తన సొంత కుమార్తె డాక్టర్ బొత్స అనూషను పోటీగా నిలబెట్టాల్సి వచ్చింది. పైకి ఇది సాధారణ రాజకీయ వారసత్వ నియామకంలా కనిపిస్తున్నా, దీని వెనుక బొత్సకు అస్సలు ఇష్టం లేదనే సంచలన నిజం ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. కేవలం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన విపరీతమైన ఒత్తిడి వల్లే బొత్స ఈ నిర్ణయానికి తలొగ్గారా? అసలు బొత్స ఫ్యామిలీలో నడిచిన ఆ అంతర్గత డ్రామా ఏంటి?
ఉత్తరాంధ్ర రాజకీయాల గురించి తెలిసిన ఎవరికైనా బొత్స, గంటాల మైత్రి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరివీ వేర్వేరు సామాజిక వర్గాలు, వేర్వేరు రాజకీయ సిద్ధాంతాలు. కానీ, వైజాగ్, విజయనగరం పరిధిలో వీరిద్దరి మధ్య ఉన్న అవగాహన అంతా ఇంతా కాదు. ఒకరి నియోజకవర్గంలో ఒకరు జోక్యం చేసుకోరు. ప్రజాక్షేత్రంలో ఎంత గట్టిగా విమర్శలు చేసుకున్నా, వ్యక్తిగతంగా ఒకరిపై ఒకరు బురద చల్లుకున్న సందర్భాలు చరిత్రలోనే లేవు. ఎప్పుడు ఏ రాజకీయ సంక్షోభం వచ్చినా స్క్రీన్ వెనుక ఇద్దరూ ఒకరికొకరు సాయం చేసుకుంటారనే ప్రచారం ఉంది. అంతటి బలమైన మిత్రుడు, 2024 ఎన్నికల్లో భీమిలి నుండి ఏకంగా 92 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి తిరుగులేని పొలిటికల్ హంక్ గా ఉన్న గంటా శ్రీనివాసరావును ఎదుర్కోవడానికి బొత్స తన కూతురిని రంగంలోకి దించడం వెనుక పెద్ద కథే నడిచింది.
అసలు ఈ సీన్ లోకి బొత్స అనూష ఎందుకు రావలసి వచ్చిందంటే.. భీమిలి వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాస్ అలియాస్ చిన్న శ్రీను అకస్మాత్తుగా వైసీపీకి హ్యాండ్ ఇచ్చి టీడీపీలో చేరిపోయారు. చిన్న శ్రీను ఎగ్జిట్ అవ్వడంతో భీమిలిలో వైసీపీ క్యాడర్ అంతా అయోమయంలో పడిపోయింది. గంటా లాంటి సీనియర్, ఆర్థిక అంగబలం ఉన్న నేతను భీమిలిలో ఢీకొట్టాలంటే సాదాసీదా నేత వల్ల కాదు. దీంతో జగన్ మోహన్ రెడ్డి భీమిలి సీటును భర్తీ చేయడంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. మొదట గుడివాడ అమర్నాథ్ లాంటి పేర్లు పరిశీలనకు వచ్చినా, గంటా వ్యూహాలను తట్టుకుని నిలబడే స్థాయి కేవలం బొత్స కుటుంబానికే ఉందని జగన్ ఫిక్స్ అయ్యారు.
అయితే, జగన్ ప్రతిపాదించిన ఈ భీమిలి స్కెచ్ బొత్స సత్యనారాయణకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే, డాక్టర్ బొత్స అనూషకు ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యక్ష ఎన్నికల అనుభవం లేదు. 2024 ఎన్నికల్లో బొత్స ఓడిపోయిన తర్వాత చీపురుపల్లిలో క్యాడర్ చెల్లాచెదురు కాకుండా ఆమె చూసుకున్న మాట నిజమే కానీ.. నేరుగా వైజాగ్ జిల్లా దాటించి, భీమిలి లాంటి మూడున్నర లక్షల ఓటర్లు ఉన్న పెద్ద నియోజకవర్గంలో, అదీ గంటా లాంటి పొలిటికల్ చాణక్యుడిపై కూతురిని బలిపశువును చేయడం బొత్సకు అస్సలు ఇష్టం లేదు. తన ప్రాణస్నేహితుడితో నేరుగా శత్రుత్వం కొనితెచ్చుకోవడం ఒకటైతే.. ప్రత్యక్ష అనుభవం లేని కూతురి పొలిటికల్ కెరీర్ మొదటికే మోసం వస్తుందేమోనని బొత్స తీవ్రంగా భయపడ్డారు. అందుకే ఈ ప్రతిపాదనను బొత్స మొదట సున్నితంగా తిరస్కరించినట్లు ఇన్సైడ్ టాక్.
కానీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇక్కడే తన మార్క్ ప్రెజర్ పాలిటిక్స్ ఉపయోగించారు. ఉత్తరాంధ్రలో వైసిపి ఉనికిని కాపాడుకోవాలంటే బొత్స కుటుంబం రంగంలోకి దిగాల్సిందేనని, ఆర్థికంగా, సామాజికంగా గంటాకు గట్టి పోటీ ఇవ్వగలిగేది మీరేనని జగన్ గట్టిగా పట్టుబట్టారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సీనియర్లు వెనకడుగు వేస్తే క్యాడర్ కు తప్పుడు సంకేతాలు వెళ్తాయని జగన్ ఒత్తిడి పెంచడంతో.. బొత్స సత్యనారాయణకు ఇక చేసేదేమీ లేక, అధినేత మాటను కాదనలేక తన కుమార్తె అనూష నియామకానికి అయిష్టంగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది పక్కా సమాచారం. బొత్స సత్యనారాయణ కూతురిగా అనూషకు ఇన్ఛార్జ్ పదవి దక్కిన మాట నిజమే అయినా.. గెలుపును మాత్రం ఆమె భీమిలి ప్రజాక్షేత్రంలో గంటా శ్రీనివాసరావు లాంటి బలమైన నేతను తట్టుకుని చేసే పోరాటంపైనే ఆధారపడి ఉంటుంది.