Top story: నీ భర్తను దూరం పెట్టు లేడీ ఎమ్మెల్యేకి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్.!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఒక వార్త తీవ్ర సంచలనంగా మారింది. ఆళ్లగడ్డ రాజకీయం మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయానికి చేరింది.

Post Published By: dialnews
Updated : 30 July 2026, 10:41 AM IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఒక వార్త తీవ్ర సంచలనంగా మారింది. ఆళ్లగడ్డ రాజకీయం మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయానికి చేరింది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు పార్టీ అధిష్ఠానం గట్టి షాక్ ఇచ్చింది. అసలు మంగళగిరిలో ఏం జరిగింది..? అఖిలప్రియను పిలిపించి ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల కాలంలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు, వివాదాలు పార్టీ అధిష్ఠానానికి తీవ్ర తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం ఆలయానికి సంబంధించిన వివాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆలయ వేలం పాటలు, టెండర్ల వ్యవహారంలో స్థానిక ప్రజాప్రతినిధుల జోక్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనికి తోడు నియోజకవర్గంలోని పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తల నుంచి ఎమ్మెల్యే అఖిలప్రియ వైఖరిపై పార్టీ అధిష్ఠానానికి వరుసగా ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే టిడిపి అధిష్ఠానం తీవ్రంగా స్పందించింది.

ఆళ్లగడ్డలో జరుగుతున్న ఈ గొడవలపై ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. పవిత్రమైన అహోబిలం ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించేలా, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఎవరు వ్యవహరించినా ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.. అఖిలప్రియను అత్యవసరంగా మంగళగిరి పార్టీ కార్యాలయానికి పిలిపించారు. ఇద్దరి మధ్య జరిగిన ఈ భేటీలో ఆళ్లగడ్డలో అందిన ఫిర్యాదులపై పల్లా శ్రీనివాసరావు సుదీర్ఘంగా చర్చించారు.

ఈ భేటీలో పల్లా శ్రీనివాసరావు.. అఖిలప్రియకు అత్యంత కీలకమైన హెచ్చరికలు జారీ చేశారు. పార్టీలో క్రమశిక్షణే అత్యంత ప్రధానమని, లక్ష్మణ రేఖ దాటితే ఎంతటి వారినైనా, ఏ స్థాయిలో ఉన్నవారినైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. అన్నింటికంటే ముఖ్యంగా, ఆళ్లగడ్డ అధికారిక మరియు రాజకీయ వ్యవహారాలలో అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ జోక్యం ఏమాత్రం ఉండటానికి వీల్లేదని చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని పల్లా ఆమెకు తేల్చిచెప్పారు. ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని, కాబట్టి కేవలం మీరే ప్రజలకు, పార్టీకి సమాధానదారీగా ఉండాలని, ఇతరుల ప్రమేయాన్ని సహించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.

నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్టను కాపాడుకుంటూ, స్థానిక సీనియర్ నేతలను, కార్యకర్తలను కలుపుకుని ముందుకు వెళ్లాలని అఖిలప్రియకు అధిష్ఠానం స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. అధిష్ఠానం ఇచ్చిన ఈ గట్టి వార్నింగ్ తర్వాత ఆళ్లగడ్డ రాజకీయాల్లో భూమా అఖిలప్రియ తన రూట్ మార్చుకోబోతున్నారా? భర్త జోక్యానికి ఇకనైనా బ్రేక్ పడుతుందా? అనేవి ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

Published : 
  • 30 July 2026, 10:41 AM IST