క్షణ క్షణానికీ యుద్ధ వ్యూహాలు మార్చేస్తున్నారు.. క్షిపణి లొకేషన్లు రెండో కంటికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు.. కమ్యూనికేషన్స్ అన్నీ హై-లెవెల్ ఎన్క్రిప్టెడ్. అయినప్పటికీ గురిచూసి కొట్టినట్టుగా అమెరికా ఆయుధ వ్యవస్థలను ధ్వంసం చేస్తోంది ఇరాన్. యుద్ధ విమానాలను సైతం పిట్టల్లా కూల్చేస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని వ్యూహాలు మార్చినా.. ఇరాన్ దాడుల నుంచి తప్పించుకోవడం అసాధ్యం అనేలా మారింది పరిస్థితి. ఇది ఎలా సాధ్యమవుతుందో అమెరికా నిఘా వర్గాలకు అంతుచిక్కడం లేదు. సరిగ్గా ఇలాంటి సమయంలో ఇరాన్ వెనుక ఉన్న పవర్ వెలుగు లోకి వచ్చింది. ఆ పవర్ పేరు చైనా. తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం, చైనా టెక్ కంపెనీలు అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగిస్తూ అమెరికా సైనిక కదలికలను పర్యవేక్షిస్తున్నట్లు తేలింది. ముఖ్యంగా డ్రాగన్ కంట్రీ ప్రైవేట్ టెక్నాలజీ కంపెనీలు ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్నాయట. ఈ సంస్థలు సేకరించిన విశ్లేషణాత్మక డేటాను ఇరాన్ సైనిక ఉన్నత అధికారులకు అందజేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారికంగా ఈ విషయాన్ని చైనా ఖండించకపోయినా, అంతర్జాతీయ వర్గాల్లో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది.
విశ్లేషకులు చెబుతున్న వివరాల ప్రకారం, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ సాధనాలు పవర్‌ఫుల్‌గా మారాయి. ఒకప్పుడు ప్రభుత్వాలకు మాత్రమే పరిమితమైన నిఘా సామర్థ్యాలు ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఏఐ టెక్నాలజీ అభివృద్ధితో ఈ సమాచారాన్ని వేగంగా విశ్లేషించడం మరింత సులభమైంది. ఉదాహరణకు, ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ద్వారా యుద్ధ విమానాల ప్రయాణ మార్గాలు, సమయాలు ఈజీగా తెలుస్తున్నాయి. అలాగే శాటిలైట్ ఫొటోల ద్వారా సైనిక స్థావరాల్లో జరిగే మార్పులను సైతం అంతే ఈజీగా గమనించే ఛాన్స్ వచ్చింది. నౌకా రవాణా సమాచారంతో సముద్ర మార్గాల్లో కదిలే యుద్ధ నౌకల వివరాలు సైతం అంతే సులువుగా సేకరించే అవకాశం ఏర్పడింది. ఈ మూడు వనరులను కలిపి విశ్లేషిస్తే, ఒక దేశం సైనిక వ్యూహంపై సమగ్ర అవగాహన పొందడం అంత పెద్ద కష్టమేం కాదు. అమెరికాతో యుద్ధంలో చైనా టెక్ సంస్థలు ఇరాన్‌కు చేస్తున్న సహాయం ఇదే. ఈ యుద్ధం ఇంత సుదీర్ఘంగా సాగడానికీ, అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు, రాడార్ వ్యవస్థలు కుప్పకూలడానికీ చైనా అందిస్తున్న ఈ ఇంటెలిజెన్స్ సహాయమే కీలకం.
ఇరాన్ తన క్షిపణులు, డ్రోన్ల కోసం అమెరికాకు చెందిన జీపీఎస్ మీద ఆధారపడకుండా, చైనా స్వదేశీ నావిగేషన్ సిస్టమ్ అయిన బైడూ-3 కి మారింది. ఇది ఇరాన్ క్షిపణులకు సెంటీమీటర్ స్థాయి ఖచ్చితత్వాన్ని ఇస్తుంది. అంతేకాదు, పాశ్చాత్య దేశాల సిగ్నల్ జామింగ్ ప్రయత్నాలను ఇది సమర్థవంతంగా ఎదుర్కుంటోంది. చైనా ఈ యుద్ధాన్ని ఒక పరిశోధనశాలగా వాడుకుంటోందని రక్షణ రంగ విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణి రక్షణ వ్యవస్థలు.. పేట్రియాట్, ఐరన్ డోమ్ ఎలా పనిచేస్తున్నాయో చైనా AI సిస్టమ్స్ గమనిస్తున్నాయి. ఈ డేటాను వాడుకుని ఫ్యూచర్లో పాశ్చాత్య దేశాల రక్షణ వ్యవస్థలను ఎలా నిర్వీర్యం చేయాలో చైనా తన ఏఐ అల్గారిథమ్స్‌కు శిక్షణ ఇస్తోంది. చైనా ఇరాన్‌కు అత్యాధునిక రాడార్ వ్యవస్థలను, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ పరికరాలను సరఫరా చేస్తోంది. ఇవి శత్రువుల సిగ్నల్స్‌ను అడ్డుకోవడంలోనూ ఇరాన్ డ్రోన్లు శత్రువుల కంట పడకుండా చేయడంలోనూ AI సహాయంతో పనిచేస్తాయి. అలాగే ఇరాన్ డ్రోన్లలో చైనా తయారు చేసిన చిప్స్, AI సెన్సార్లను వాడుతున్నట్లు గుర్తించారు. ఇవి డ్రోన్లు స్వతంత్రంగా లక్ష్యాలను గుర్తించి దాడి చేసే సామర్థ్యాన్ని పెంచుతున్నాయి.
మరోవైపు.. తాజా పరిణామాలపై అమెరికా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. తమ సైనిక సమాచారం ఇలా బయటకు వెళ్లకుండా ఎలా అడ్డుకోవాలన్న దానిపై పరిశోధనలు జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఓపెన్ సోర్స్ డేటా వినియోగంపై కొత్త మార్గదర్శకాలు తీసుకురావాలా అనే దానిపై చర్చ జరుగుతోంది. చైనాలోని ప్రైవేట్ రంగంలో జియోస్పేషియల్ విశ్లేషణ సామర్థ్యం వేగంగా పెరుగుతోందన్న ఆందోళనలు ఎప్పట్నుంచో ఉన్నాయి. అమెరికాకే కాదు, ప్రపంచంలోని ఇతర దేశాలకూ భద్రతాపరమైన సవాళ్లు తీసుకురావచ్చని వార్నింగ్ ఇస్తున్నారు. భవిష్యత్తులో యుద్ధాలు కేవలం భూభాగం లేదా గాల్లోనే కాకుండా, డేటా, టెక్నాలజీ రంగంలో కూడా జరిగే అవకాశం ఉంది. యుద్ధం ఆయుధాలతోనే కాకుండా, సమాచారంతో కూడా జరుగుతోందన్న రియాలిటీని పశ్చిమాసియా యుద్ధ పరిణామాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. ఓపెన్ సోర్స్ డేటా విషయంలో అలర్ట్ అవ్వకపోతే.. చైనా వంటి దేశాలు ప్రపంచాన్నే తమ గుప్పిట్లో పెట్టుకోవడం ఖాయం.