పీకేస్తాం.. పొడిచేస్తాం అని విర్రవీగే.. అగ్రరాజ్యం అమెరికాకు కోలుకోలేని షాక్ ఇచ్చింది ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్. ప్రపంచాన్నే తన గుప్పిట్లో ఉంచుకోవాలనుకున్న వాషింగ్టన్ అహంకారం.. ఇస్లామాబాద్ గడ్డపై ముక్కలైపోయింది. అవును.. మీరు విన్నది నిజం. ఇరాన్ లొంగుతుంది, కాల్పుల విరమణకు ఒప్పుకుంటుంది, అమెరికా కాళ్ళ దగ్గరకు వస్తుంది అని కలలు గన్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్.. ఇద్దరికీ ఇరాన్ గట్టి షాక్ ఇచ్చింది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ స్వయంగా తల దించుకుని.. 'ఏ ఒప్పందం కుదరలేదు.. మేము వెనక్కి వెళ్తున్నాం' అని ప్రకటించారంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోండి.
ఇవాళ ప్రపంచం మొత్తం అడుగుతున్న ఒకే ఒక్క ప్రశ్న.. అమెరికాకు ఇరాన్ ఎందుకు భయపడటం లేదు..? పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌ను వేదికగా చేసుకుని 21 గంటల పాటు హై-వోల్టేజ్ డ్రామా నడిచింది. ఒకవైపు అమెరికా తన సైనిక బలగాలను చూపిస్తూ బెదిరించింది. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ తన ప్రతినిధుల ద్వారా ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేశారు. జేడీ వాన్స్ టేబుల్ మీద ఫైల్స్ విసిరి కొట్టినా.. ఇరాన్ ప్రతినిధులు కనురెప్ప కూడా వాల్చలేదు. అమెరికా పెట్టిన అన్యాయమైన షరతులను ఇరాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.
'మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఒప్పందాలు చేసుకోం' అని ఇరాన్ తేల్చి చెప్పేసింది. దీంతో చేసేదేమీ లేక, అమెరికా బృందం అవమాన భారంతో పాకిస్థాన్‌ను విడిచి వెళ్లిపోతోంది. ప్రపంచం మొత్తం ట్రంప్ అంటే భయపడుతుంది. ఆయన ఒక్క ట్వీట్ చేస్తే దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయి. కానీ ఇరాన్ మాత్రం 'ట్రంప్ మాకు కొత్త కాదు' అన్నట్టుగా వ్యవహరిస్తోంది. మరోవైపు.. ఇరాన్ దగ్గర బాంబులు మాత్రమే లేవు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే తాళం చెవి ఉంది. ఆ తాళం చెవే 'హార్ముజ్ జలసంధి'.
దీన్ని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించబట్టే, అమెరికా దిగివచ్చి చర్చలు జరిపింది. కానీ ఇరాన్ మాత్రం తన పంతం వీడలేదు. జేడీ వాన్స్ చర్చల మధ్యలో ట్రంప్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నా, ట్రంప్ పంపిన సందేశాలను వినిపించినా.. ఇరాన్ లొంగలేదు. దీని అర్థం ఏంటో తెలుసా? అమెరికా 'సూపర్ పవర్' ఇమేజ్ ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఒక చిన్న దేశం, ఆంక్షలతో సతమతమవుతున్న దేశం.. అగ్రరాజ్యాన్ని ఎదిరించి నిలబడుతుంటే, అది అమెరికా పతనానికి సంకేతమా? లేక ఇరాన్ వెనుక చైనా, రష్యాల అండ ఉందా..? ఎందుకు ఇరాన్ ఇంత ధైర్యంగా ఉంది..? అంటే దీని వెనుక మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి.
ఒకటి.. అస్థిత్వ పోరాటం.. ఇరాన్ తన అణు శక్తిని వదులుకుంటే అది తన మనుగడకే ప్రమాదమని భావిస్తోంది. రెండు అమెరికా విశ్వసనీయత.. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలనే అమెరికా తుంగలో తొక్కింది, ఇప్పుడు మళ్ళీ నమ్మడం ఎలా..? అని ఇరాన్ ప్రశ్నిస్తోంది. మూడు.. ముస్లిం ప్రపంచం.. ఈ చర్చలు విఫలమవ్వడం ద్వారా, తాము అమెరికాకు వ్యతిరేకంగా పోరాడే ఏకైక శక్తిగా ఎదగాలని ఇరాన్ చూస్తోంది. ఇంకొకటి.. ఇరాన్ కేవలం మొండితనం చూపడం లేదు, వాళ్ళు రష్యా, చైనాల మద్దతుతో ఈ గేమ్ ఆడుతున్నారు.
అమెరికా ఆంక్షలను వారు ఇప్పుడు లెక్క చేయడం లేదు. ఈ ధైర్యం వెనుక పుతిన్ హస్తం ఉందా..? లేక జిన్ పింగ్ ధైర్యం ఉందా..? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏది ఏమైనా.. అమెరికా బెదిరింపులకు ఇరాన్ నవ్వుతూ సమాధానం చెబుతోంది అంటే.. వాళ్ళ దగ్గర ఏదో 'సీక్రెట్ వెపన్' ఉంది. ఆ ఆయుధమే అమెరికాను వణికిస్తోంది. మనం అర్ధం చేసుకోవాల్సింది.. జేడీ వాన్స్ కేవలం ఒక ప్రతినిధిగా కాదు, వైట్ హౌస్ లో.. డొనాల్డ్ ట్రంప్ 'వారసుడి'గా ఇస్లామాబాద్ వెళ్లారు. అంటే ఫ్యూచర్ అమెరికా ప్రెసిడెంట్.
ఆయన ఖాళీ చేతులతో తిరిగి రావడం అంటే అది అమెరికా దౌత్య నీతికి జరిగిన అతిపెద్ద పరాజయం. ప్రపంచాన్ని శాసించే అమెరికా వైస్ ప్రెసిడెంట్, ఒక చిన్న దేశం ముందు మోకరిల్లాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇస్లామాబాద్ చర్చల విఫలం అంటే.. కేవలం ఒక ఒప్పందం కుదరకపోవడం కాదు, అమెరికా సూపర్ పవర్ ఇమేజ్‌కు తగిలిన బలమైన దెబ్బ. ట్రంప్ ఎప్పుడూ తాను గొప్ప డీల్ మేకర్ అని చెప్పుకుంటారు. కానీ ఇరాన్ విషయంలో ఆయన పంపిన ప్రతినిధి విఫలమవ్వడం ట్రంప్ రాబోయే రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది.
మరి.. ట్రంప్ పవర్ ఏమైంది..? 'నేను వస్తే యుద్ధాలు ఆగిపోతాయి' అన్న గంభీర ప్రకటనలు ఏమయ్యాయి..? ఇరాన్ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి.. 'నీ షరతులు మాకు వద్దు' అని చెప్పడం ద్వారా ట్రంప్ ఇమేజ్ను ఇరాన్ బజారున పడేసింది. జేడీ వాన్స్ మాటల్లోని నిస్పృహ చూస్తుంటే.. అమెరికా అమ్ములపొదిలో అస్త్రాలన్నీ అయిపోయాయని స్పష్టంగా అర్థమవుతోంది. పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించినా అమెరికాను కాపాడలేకపోయింది. చర్చలు విఫలమయ్యాక వాన్స్ వెంటనే దేశం విడిచి వెళ్లడం, పాకిస్థాన్‌తో ఉన్న సంబంధాలపై కూడా అనుమానాలు రేకెత్తిస్తోంది.
ఫైనల్ గా.. ఇస్లామాబాద్ వేదికగా అమెరికాను ఇరాన్ ఆడుకుంది. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ స్వయంగా రంగంలోకి దిగినా ఇరాన్ తగ్గలేదు. చర్చల తర్వాత జేడీ వాన్స్ ముఖంలో కనిపించిన అసహనం.. అమెరికా ఓటమిని స్పష్టం చేస్తోంది. ఇప్పుడు చర్చలు ఫెయిల్ అయ్యాయి. జేడీ వాన్స్ వెళ్ళిపోయారు. మరి నెక్స్ట్ ఏంటి..? ఇరాన్ మీద అమెరికా బాంబుల వర్షం కురిపిస్తుందా..? లేక ఇరాన్ తన ప్రాక్సీల ద్వారా అమెరికా స్థావరాలను ధ్వంసం చేస్తుందా..? మరో భారీ యుద్ధానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఇస్లామాబాద్ చర్చల విఫలం.. కేవలం ఒక దౌత్యపరమైన వైఫల్యం కాదు, ఇది రాబోయే పెను తుఫానుకు ముందున్న నిశ్శబ్దం.