అంతర్జాతీయ రక్షణ రంగంలో ఒక పెను భూకంపం ఇది. అమెరికా వైమానిక దళం తన అత్యంత రహస్య ఆయుధంగా భావించే, భూగర్భంలోని అణు కేంద్రాలను పిండి చేయగల GBU-57 మాసివ్ ఆర్డనెన్స్ పేనేట్రటోర్ ఇప్పుడు ఇరాన్ చేతికి చిక్కినట్లు వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఇటీవల జరిగిన దాడులలో పేలకుండా మిగిలిపోయిన దాదాపు 15 అత్యాధునిక అమెరికన్ క్షిపణులను ఇరాన్ రక్షణ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో ఒక్కటి కాదు, ఏకంగా నాలుగు GBU-57 బంకర్ బస్టర్లు ఉన్నట్లు సమాచారం.
వీటిని ఇరాన్ తన 'టెక్నికల్ అండ్ రీసెర్చ్ యూనిట్స్'కు తరలించింది. ఇది అమెరికాకు ఒక పీడకల లాంటి వార్త. ఎందుకంటే, వీటి ద్వారా అమెరికా యొక్క అత్యున్నత క్షిపణి సాంకేతికత ఇప్పుడు శత్రు దేశం చేతిలో బహిర్గతం కాబోతోంది. అసలు ఈ GBU-57 అంటే ఏమిటో, అది ఎందుకు అంత ప్రత్యేకో మనం అర్థం చేసుకోవాలి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నాన్-న్యూక్లియర్ బాంబు. దీని బరువు సుమారు 30,000 పౌండ్లు అంటే 13,600 కిలోలు. దీనిని కేవలం B-2 స్పిరిట్ స్టీల్త్ బాంబర్లు మాత్రమే మోయగలవు.
ఇది సాధారణ బాంబులా భూమిపై పడగానే పేలదు. ఇది భూమిలోకి లేదా గట్టి కొండల్లోకి దాదాపు 200 అడుగుల లోతు వరకు చొచ్చుకుపోయిన తర్వాతే పేలుతుంది. అందుకే దీనిని 'బంకర్ బస్టర్' అంటారు. ఇరాన్‌లోని ఫోర్డో వంటి భూగర్భ అణు కేంద్రాలను ధ్వంసం చేయడానికి అమెరికా దీనినే నమ్ముకుంది. అటువంటి బాంబు ఇప్పుడు ఇరాన్ వద్ద పూర్తిగా 'ఇంటాక్ట్' ఉండటం అంటే, అమెరికా యొక్క డీప్-పెనెట్రేషన్ టెక్నాలజీ, దాని ఫ్యూజ్ మెకానిజం మరియు గైడెన్స్ సిస్టమ్స్ అన్నీ ఇరాన్ శాస్త్రవేత్తల ముందు ఉండటమే.
ఇరాన్ కు రివర్స్ ఇంజనీరింగ్ అంటే.. ఒక ఆయుధాన్ని విడదీసి, అది ఎలా పనిచేస్తుందో చూసి సొంతంగా తయారు చేయడంలో చాలా అనుభవం ఉంది. 2011లో అమెరికాకు చెందిన RQ-170 స్టీల్త్ డ్రోన్‌ను ఇరాన్ కూల్చకుండా పట్టుకుంది. ఆ ఒక్క డ్రోన్ ద్వారా ఇరాన్ ఏకంగా ఒక డ్రోన్ సైన్యాన్నే నిర్మించింది. ఇప్పుడు ఇరాన్ చేతిలో 15 క్షిపణులు ఉన్నాయి. ఇందులో టొమాహాక్ క్రూయిజ్ మిసైల్స్ కూడా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ క్షిపణుల లోపల ఉండే జీపీఎస్ యాంటెనాలు, సెన్సార్లు, మరియు నావిగేషన్ సాఫ్ట్‌వేర్‌ను ఇరాన్ శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు.
కేవలం బాంబు దొరకడమే కాదు, ఆ బాంబులో ఉన్న గైడెన్స్ కిట్ ఇప్పుడు ఇరాన్ శాస్త్రవేత్తల చేతిలో ఉంది. అమెరికా వాడే అత్యంత రహస్యమైన మిలిటరీ గ్రేడ్ GPS/INS నావిగేషన్ వ్యవస్థలను ఇరాన్ విడదీసి చూడబోతోంది. ఒకసారి ఈ సాఫ్ట్వేర్ మరియు హార్డ్‌వేర్ కోడింగ్ గనుక వారికి అర్థమైతే, భవిష్యత్తులో అమెరికా ప్రయోగించే క్షిపణులను గాలిలోనే 'జామ్' చేయడం లేదా వాటి దిశను మార్చడం ఇరాన్‌కు సాధ్యమవుతుంది. అంటే అమెరికా తన ఆయుధాల ద్వారా శత్రువుపై దాడి చేయడమే కాదు, వాటిని ఎలా అడ్డుకోవాలో కూడా శత్రువుకు నేర్పించినట్టు అవుతుంది.
GBU-57 బాంబులో ఉన్న అత్యంత కీలకమైన భాగం దాని స్మార్ట్ ఫ్యూజ్. ఇది బాంబు భూమిలోకి వెళ్లేటప్పుడు ఎన్ని గదులు లేదా ఖాళీ ప్రదేశాలు దాటిందో లెక్కపెట్టి, కచ్చితంగా కావాల్సిన లోతుకు వెళ్ళిన తర్వాతే పేలుతుంది. ఈ టెక్నాలజీని ఇరాన్ సొంతం చేసుకుంటే, వారు తమ సొంత క్షిపణులను కూడా ఇలాగే భూగర్భంలో ఉన్న శత్రువు బేస్‌లను ధ్వంసం చేసేలా మార్చుకుంటారు. ఇప్పటికే ఇరాన్ తన 'ఫత్తా' హైపర్ సోనిక్ మిసైల్‌కు ఈ టెక్నాలజీని జోడించి, అమెరికా లేదా ఇజ్రాయెల్ బేస్‌లపై దాడి చేసే ప్లాన్‌లో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యం పాయింట్ ఏమిటంటే.. ఇరాన్ ఈ క్షిపణులను కేవలం తన కోసమే వాడుకోదు. చైనా మరియు రష్యాల నుండి ఇరాన్‌కు ఇప్పటికే సాంకేతిక సహాయం అందుతోంది. ఇప్పుడు దొరికిన ఈ అమెరికన్ టెక్నాలజీని ఇరాన్ ఆ దేశాలతో పంచుకునే అవకాశం పుష్కలంగా ఉంది. ఇలా జరిగితే, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో లేదా భవిష్యత్తులో తైవాన్ సంక్షోభంలో అమెరికా ఆయుధాలను ఎలా ఎదుర్కోవాలో ఆ దేశాలకు ముందే ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అమెరికా సైనిక ఆధిక్యతకు గొడ్డలి పెట్టు లాంటిది.
ఒకవేళ ఇరాన్ ఈ టెక్నాలజీని సొంతం చేసుకుంటే, భవిష్యత్తులో అమెరికా లేదా ఇజ్రాయెల్ చేసే బంకర్ బస్టర్ దాడులను ముందే పసిగట్టి అడ్డుకునే శక్తిని ఇరాన్ పొందుతుంది. ఈ పరిణామం కేవలం ఇరాన్-అమెరికా మధ్య మాత్రమే కాదు, మొత్తం మధ్యప్రాచ్య భద్రతను మార్చేయబోతోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇప్పటికే హెచ్చరించారు. పేలకుండా మిగిలిపోయిన ఈ బాంబుల వల్ల రేడియేషన్ ముప్పు ఉన్నప్పటికీ, వాటి నుండి సాంకేతికతను గ్రహించే అవకాశం తమకు దక్కిందని ఆయన స్పష్టం చేశారు.
ఒకవేళ ఇరాన్ తన సొంత బంకర్ బస్టర్లను తయారు చేస్తే, అది ఇజ్రాయెల్ లేదా అమెరికా బేస్‌లకు పెద్ద ముప్పుగా మారుతుంది. ఇది అమెరికా ఇంటెలిజెన్స్ మరియు మిలిటరీ వ్యూహకర్తలకు ఒక పెద్ద సవాలు. మరి ఈ రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా ఇరాన్ అమెరికాను తలదన్నే ఆయుధాలను తయారు చేయగలదా..? అనేది కాలమే నిర్ణయించాలి.