Top Story: రష్యా – ఉక్రెయిన్ యుద్ద నష్టం ఎన్ని లక్షల కోట్లంటే..?

ఏళ్ళ తరబడి సాగుతోన్న మారణ హోమం.. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం. ఆ రెండు దేశాల మధ్య భీకర పోరు ప్రారంభాన్ని చూసిన ప్రపంచం, అంతాన్ని ఎప్పుడు చూస్తుందో తెలియని పరిస్థితి.

Post Published By: dialnews
Updated : 26 February 2026, 11:00 AM IST

ఏళ్ళ తరబడి సాగుతోన్న మారణ హోమం.. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం. ఆ రెండు దేశాల మధ్య భీకర పోరు ప్రారంభాన్ని చూసిన ప్రపంచం, అంతాన్ని ఎప్పుడు చూస్తుందో తెలియని పరిస్థితి. అగ్ర రాజ్యాలు, మిత్ర దేశాలు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసినా, బెదిరించినా, భయపెట్టినా, ప్రేమగా సయోధ్య చేసినా లొంగని పరిస్థితి. వారం రోజుల్లో ఉక్రెయిన్ ను రష్యా ఆక్రమిస్తుందని అంచనా వేస్తే.. నాలుగేళ్ళు అయినా సరే ఇంకా కొలిక్కి రాలేదు. కమెడియన్ నుంచి దేశాధ్యక్షుడు అయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జేలేన్ స్కీ పోరాటం చూసి రష్యా రోజు రోజుకి తలపట్టుకుంటుంది. ఆర్ధిక సమస్యలతో ఉన్న రెండు దేశాల మధ్య ఈ పోరు.. యూరప్ దేశాలపై తీవ్రంగా పడిన పరిస్థితి.

అసలు ఈ రెండు దేశాల మధ్య పోరులో వాటిల్లిన నష్టం ఎంత..? పోయిన ప్రాణాలు ఎన్ని..? జరిగిన ఆర్ధిక నష్టం ఎంత..? ఈ లెక్కలు చూస్తే రెండవ ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులు కళ్ళ ముందు కనపడతాయి. అసలు ఏ దేశం ఎంత నష్టపోయిందో ఒకసారి చూద్దాం.ఉక్రెయిన్-రష్యా యుద్ధం 2022 లో మొదలైంది. నాటి నుంచి.. ప్రాణ నష్టం, ఆర్థిక, సైనిక పరికరాల నష్టాల అంచనాలు భారీగా ఉన్నాయి. తాజా అంచనాల ప్రకారం రెండు దేశాల సైనికుల మరణాలు గానీ, గాయపడిన వారు గానీ.. సుమారు 18-20 లక్షల మంది. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి మాత్రమే 588 బిలియన్ డాలర్లు అంటే.. సుమారు 49 లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతుందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది.

సైనిక నష్టాల పరంగా చూస్తే.. రష్యా సైనికులు 12 లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం గాని, గాయపడటం గాని, కనపడకుండా పోవడం గానీ జరిగింది. 3.25 లక్షల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా వేస్తున్నారు. యుద్దంలో ప్రభావితం అయిన ఉక్రెయిన్ సైనికుల సంఖ్య 6 లక్షలకు పైగా ఉందని అంతర్జాతీయ మీడియా అంచనా వేసింది. వారిలో 1.4 లక్షల మంది మరణించారు. రష్యా ఈ యుద్దంలో 11,500 ట్యాంకులు, 24,000 ఆర్మర్డ్ వెహికల్స్, 37,781 ఆర్టిలరీ సిస్టమ్స్ నష్టపోయింది. 428 విమానాలతో పాటుగా, 347 హెలికాప్టర్ లు రష్యా నష్టపోయినట్లు అంతర్జాతీయ మీడియా లెక్కలు చెప్తున్నాయి. ఉక్రెయిన్ లో 195 బిలియన్ డాలర్ల ఆస్తులు నాశనం అయ్యాయి. ఇక రష్యా సైనిక పరంగా ఇప్పటి వరకు 211 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. యుద్ద సమయంలో ఉక్రెయిన్ కు మిత్ర దేశాలు 297 బిలియన్ డాలర్లు సాయం చేసాయి.

రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో 2022 నుంచి 2026 వరకు.. రష్యా చేసిన మొత్తం యుద్ధ ఖర్చు, సుమారు 550 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. అంటే 46 లక్షల కోట్ల రూపాయలు. దీని కారణంగా రెండు దేశాల పౌరులపై పన్నులు, ధరల పెంపు భారం పడింది. 2024 వరకు అమెరికా లెక్కల ప్రకారం.. నష్టం 211 బిలియన్ డాలర్లు. సంవత్సరాలవారీగా రష్యా ఖర్చు ఒకసారి చూస్తే.. 2022లో 82-102 బిలియన్ డాలర్లు రష్యా ఖర్చు చేసింది. ఇది ఆ దేశ జీడీపీలో 6 శాతం. 2025 లో 137 బిలియన్ డాలర్లు.. ఇది ఆ దేశ జీడీపీలో 5.1 శాతంగా ఉంది. 2026 బడ్జెట్ లో 166 నుంచి 217 బిలియన్ డాలర్లు రష్యా కేటాయించింది. ఆ దేశ బడ్జెట్ లో మూడింతలలో ఒకటవ వంతు కావడం గమనార్హం. ఇక ఆర్మీ బడ్జెట్ ను 2021 నుంచి ప్రతీ ఏటా ఆ దేశం పెంచుతూనే ఉంది. దీని కారణంగా రష్యాలో సంక్షేమ కార్యక్రమాలను కుదించారు. 38% నుంచి 25% వరకు తగ్గించింది రష్యా. అలాగే ధరలు కూడా 30 నుంచి 80 శాతం వరకు పెరిగాయి.

ఉక్రెయిన్ చేసిన ఖర్చు గానీ నష్టాలు గానీ 588 బిలియన్ డాలర్లు.. అంటే దాదాపుగా 49 లక్షల కోట్ల రూపాయలు. ఉక్రెయిన్ నుంచి దాదాపు 11 మిలియన్ల మంది వలస వెళ్ళిపోయారు. అలాగే కీలక నగరాలు అయిన క్రిమియా, డోన్‌బాస్‌లను ఆ దేశం కోల్పోయింది. సాధారణ పౌరులు కూడా 40 వేల మంది ప్రాణాలు విడిచారు. ఈ యుద్ధం ప్రభావం కారణంగా యూరప్ దేశాల్లో ధరలు భారీగా పెరిగిపోయాయి. వంట నూనెలు ఉక్రెయిన్ నుంచి భారీగా ఎగుమతి అవుతాయి. ఇప్పుడు ఆ ధరలు రెట్టింపు అయ్యాయి. యూకే సహా ఎన్నో దేశాల్లో లివింగ్ కాస్ట్ పై కూడా ఉక్రెయిన్ యుద్ద ప్రభావం పడింది.

ఏది ఎలా ఉన్నా.. ఈ యుద్ధం మాత్రం రెండు దేశాలకు తీరని నష్టం మిగిల్చింది. రష్యా లాంటి బలమైన దేశంతో ఉక్రెయిన్ చేస్తున్న యుద్ధం.. ఆ దేశ భవిష్యత్తును అంధకారంలో నెట్టింది. అభివృద్ధి సంగతి పక్కన పెడితే.. ఆ దేశాన్ని కాపాడుకోవడం, తిరిగి యధాస్థితిలోకి తీసుకు రావడానికి దశాబ్దాలు పట్టే అవకాశం ఉంది. అమెరికా, బ్రిటన్ సహా ఎన్నో దేశాలు ఉక్రెయిన్ కు చేసిన ఆర్ధిక సహాయం మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అయింది.

Published : 
  • 26 February 2026, 11:00 AM IST